Dec 11,2020 07:14

బ్యాంకులు...యజమానులు... తమ మధ్యనే రుణాలిచ్చుకొంటూ బ్యాంకింగ్‌ రెగ్యులేషన్లు, ప్రభుత్వ, ప్రజల కళ్ళు కప్పటానికి ప్రయత్నం చేస్తారు. దీని వలన ప్రజల డిపాజిట్లన్నీ పెద్ద సంస్థల యాజమాన్యం చేతుల్లోనే ఉండిపోతాయి. వారు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తారు. ప్రైవేటు సంస్థలను బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ అధారిటీ ఏమీ చేయలేదు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ, మొత్తం ద్రవ్య వ్యవస్థ స్థిరత్వం ప్రమాదంలో పడుతుంది.
         సరళీకరణ విధానాలను అత్యంత వేగంగా అమలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు కూడా ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వటానికి సన్నాహాలు చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవటం, పోటీని పెంచటం కోసం కొత్త ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు, రెగ్యులేషన్‌, భారత బ్యాంకులకు ప్రపంచ ర్యాంకులు తీసుకు రావటానికి సూచనలు చేయటం కోసమంటూ ఆర్‌బిఐ జూన్‌ 12న ఐదుగురితో ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసింది. ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూపు అక్టోబరు 26న నివేదిక ఇవ్వగా, ఆర్‌బిఐ ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నివేదికను నవంబరు 20న చర్చ కోసం విడుదల చేసింది. నివేదికపై సూచనలు, సవరణలు, సలహాలు ఇవ్వాలనుకున్నవారు రెండు నెలల్లో తమకు అందజేయాలని ఆర్‌బిఐ కోరింది. వాస్తవంగా ఆర్‌బిఐ నియమించిన కమిటీలు నివేదికను అందజేసిన తర్వాత దానికి తుది రూపం ఇవ్వటానికి రెండు సంవత్సరాలు తీసుకుంటారు. అటువంటిది రెండు నెలలలోనే నివేదికకు తుది రూపం ఇచ్చి ఆచరణలో పెట్టాలనుకుంటున్నారంటే ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంత తొందరపడుతున్నదో అర్ధం అవుతున్నది.
         వర్కింగ్‌ గ్రూపు తన నివేదికలో బడా కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. మరో ముఖ్యమైన ప్రతిపాదన రూ.50 వేల కోట్ల పెట్టుబడి, 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఎన్‌బిఎఫ్‌సి లను బ్యాంకులుగా మారటానికి అనుమతివ్వాలని సిఫార్సు చేసింది. ఇది దొడ్డిదారిన ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేయటానికి దారితీస్తుంది. బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలను దెబ్బ తీస్తుంది. ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేస్తే జరిగే నష్టం ఏమిటని చర్చించే ముందు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రైవేటు బ్యాంకులను ఎందుకు జాతీయం చేశారో తెలుసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది.
స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు, గ్రూపుల ఆధ్వర్యంలో బ్యాంకులు ఉన్నాయి. టాటా గ్రూపు ఆధ్వర్యంలో సెంట్రల్‌ బ్యాంకు, బిర్లాల ఆధ్వర్యంలో యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులకు యాజమాన్యం వహిస్తున్నవారు ప్రజల డిపాజిట్లను తమ ఇష్టం వచ్చిన విధంగా వినియోగించుకొనేవారు. ప్రైవేటు బ్యాంకులు వ్యవసాయ రంగానికి 2.1 శాతం రుణాలు మాత్రమే ఇచ్చాయి. అవి కూడా పలుకుబడి కలిగిన బడా భూస్వాములకు మినహా సామాన్య రైతాంగానికి అందలేదు. వృత్తిదారులు, ఇతర పేదలకు బ్యాంకులకు వెళ్ళటానికే అవకాశం ఉండేది కాదు. తమ గ్రూపు సంస్థలు, తమకు కావలసిన వారికి రుణాలు ఇవ్వటంతో ఎక్కువ భాగం రుణాలు తిరిగి చెల్లించేవారు కాదు. ఫలితంగా 1947-58 మధ్య దేశంలో 361 బ్యాంకు వైఫల్యాలు సంభవించాయి. లక్షలాది మంది ప్రజలు పొదుపు చేసుకున్న మొత్తాలు బడాబాబుల పరమైనాయి.
ఈ పరిణామాల వలన 1969లో 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేశారు. రెండవసారి 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. జాతీయం చేసిన తర్వాత ప్రజల డిపాజిట్లకు భద్రత చేకూరింది. బ్యాంకులలో ప్రజలు డిపాజిట్‌ చేసిన డబ్బు దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడింది. దేశం లోని పేద, మధ్యతరగతి రైతులు, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు చేసుకొనేవారు, ఇతర చిన్నా చితకా వ్యాపారులకు కూడా రుణాలు ఇవ్వటం ప్రారంభమైంది. సామాన్య ప్రజలు కొంతమేరకు వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి బయటపడ్డారు.
         ప్రస్తుతం గతంలోనివి 12, సరళీకరణ విధానాలు ప్రారంభమైన 1991 తర్వాత ఏర్పాటు చేసినవి 9 ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకులు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాయనేది ఈ మధ్య కాలంలో పిఎంసి, ఐపిఐసిఐ, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, డిహెచ్‌ఎఫ్‌సి తదితర బ్యాంకులలో జరిగిన కుంభకోణాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించటం బడా సంస్థలకు మేలు చేయటానికి మినహా ప్రజలకేమాత్రం ఉపయోగం లేదు. ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేయటం వలస కొన్ని పెద్ద సంస్థలు లాభపడతాయి.
గత పది సంవత్సరాల నుండి ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేయటం కోసం చర్చలు జరుగుతున్నాయి. అనేక సంస్థలు ఏర్పాటు చేయటం కోసం సిద్ధమైనాయి. అయితే ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేయటం కోసం 2013లో రూపొందించిన మార్గదర్శకాలు దీనికి ఆటంకం కలిగించాయి. ప్రైవేటు సంస్థలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లు బ్యాంకులను ఏర్పాటు చేయాలంటే ద్రవ్యపరంగా, వారి వ్యాపారాలలో 10 సంవత్సరాల పాటు నమ్మకం కలిగే విధంగా వ్యవహరించి ఉండాలని పేర్కొనటంతో అనేకమంది ఆశలు నిరాశలైనాయి. ఇపుడు ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఐదు నెలల లోనే హడావుడిగా ప్రైవేటు బ్యాంకులను తీసుకురావటానికి పూనుకున్నది. దానికోసం 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టానికి సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
మూడు విధాల నష్టం
        ప్రైవేటు బ్యాంకులను ఏర్పాటు చేయటం వలన మూడు విధాలైన ఫలితాలు వస్తాయి. ఒకటి. బ్యాంకులను ఏర్పాటు చేసిన పెద్ద సంస్థలు తమ అనుబంధ సంస్థలకు, తమకు కావలసినవారికి రుణాలివ్వటం ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి సంస్థలకు తక్కువ వడ్డీలకు రుణాలిస్తారు. వారు లాభాలు సంపాదించినా రుణం తిరిగి చెల్లిస్తారనే గ్యారంటీ ఉండదు. అందువలన బ్యాంకులకు తిరిగిరాని రుణాలు పెరగటానికి ఇది దారితీస్తుంది. దానితో పాటు దివాళా తీసినట్లు ప్రకటించటం ద్వారా అత్యధిక లాభాలు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఏ విధానం అయినా అది ప్రజల డిపాజిట్లకు గ్యారంటీ లేకుండా చేస్తుంది.
        రెండవది. బ్యాంకులను ఏర్పాటు చేసిన బడా సంస్థలు తమ పోటీదారులను దెబ్బ తీయటానికి బ్యాంకుల లోని పెట్టుబడులను వినియోగించుకొంటారు. అందువలన వారు లబ్ధి పొందినా, ఇతరులు దివాళా తీయటానికి, వారికి రుణాలిచ్చిన బ్యాంకులు నష్టపోవటానికి దారితీస్తుంది. ప్రైవేటు బ్యాంకులు లేకుండానే తనకున్న పలుకుబడిని ఉపయోగించి ముఖేష్‌ అంబానీ టెలికాం రంగంలో ఇటువంటి పోటీనే ప్రవేశ పెట్టారు. తన ఆర్థిక వనరులను వినియోగించి 200 రోజుల పాటు మొబైల్‌ వినియోగదారులకు ఉచితంగా డేటాను ఇవ్వటం ద్వారా చిన్న సంస్థలు పోటీకి తట్టుకోలేక దివాళా తీశాయి. మిగిలినవి కూడా పరస్పరం కలిసిపోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆ రంగానికి బ్యాంకులిచ్చిన రూ.4.4 లక్షల కోట్ల రుణాలు పేరుకు పోయాయి. 90 రోజులకు మించి ఉచితంగా డేటా ఇవ్వకూడదని నిబంధన ఉన్నా, దానిని అమలు చేయటానికి ఉన్న ట్రారు ఏమీ చేయలేకపోయింది. ప్రైవేటు బ్యాంకులతో ఈ రంగంలోనూ అటువంటి పరిస్థితే ఏర్పడుతుంది.
        మూడవది. ఒక బ్యాంకు యాజమాన్యం రెండవ బ్యాంకు యాజమాన్యం లోని సంస్థలకు, రెండవ బ్యాంకు యాజమాన్యం మూడవ బ్యాంకు యాజమాన్యం లోని సంస్థలకు రుణాలు ఇస్తాయి. అంటే బ్యాంకులు...యజమానులు...తమ మధ్యనే రుణాలిచ్చుకొంటూ బ్యాంకింగ్‌ రెగ్యులేషన్లు, ప్రభుత్వ, ప్రజల కళ్ళు కప్పటానికి ప్రయత్నం చేస్తారు. దీని వలన ప్రజల డిపాజిట్లన్నీ పెద్ద సంస్థల యాజమాన్యం చేతుల్లోనే ఉండిపోతాయి. వారు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తారు. ప్రైవేటు సంస్థలను బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ అధారిటీ ఏమీ చేయలేదు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ, మొత్తం ద్రవ్య వ్యవస్థ స్థిరత్వం ప్రమాదంలో పడుతుంది.
అందువలన ప్రేవేటు బ్యాంకులతో ఏర్పడే ప్రమాదాన్ని ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోవాలి. ప్రపంచం లోని అనేక దేశాలు కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వలేదు. ఇపుడు ప్రైవేటు బ్యాంకులకు అవకాశం ఇస్తే బ్యాంకుల జాతీయీకరణ తర్వాత ఈ రంగంలో సాధించిన స్థిరత్వం పోతుంది. ఈ సరళీకరణ యుగంలో జాతీయీకరణకు ముందునాటికన్నా మరింత ఎక్కువగా ప్రజల ధనాన్ని స్వాహా చేయటం జరుగుతుంది. అందువలన ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటును ఆపివేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు పారిశ్రామికవేత్తల నుండి రావలసిన రుణాలను వసూలు చేయాలి. ఆర్‌బిఐ వద్ద ఉన్న మిగులు నిధులను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవటం ఆపివేస్తే బ్యాంకింగ్‌ రంగంలోని ఒడిదుడుకులను తట్టుకొనే అవకాశం ఉంటుంది. ఈ చర్యలు తీసుకొని ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టపరచాలి.

kotireddy