Aug 08,2022 13:03

ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : ఏలేశ్వరం నుండి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని నిరసిస్తూ ... సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. రోడ్లపై వరి నాట్లేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు గణేష్‌ మాట్లాడుతూ ... ఏజెన్సీ ముఖ ద్వారమైన ప్రధాన రహదారి గోతులు గుంటలతో చెరువులను తలపిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో తూతూ మంత్రంగా రోడ్డు మరమ్మతులు చేపట్టి వదిలేశారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రహదారి మరింత అధ్వాన్నంగా మారిందని, పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. ఈ రహదారిగుండా ప్రత్తిపాడు, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలన్న కనీస ఆలోచన కూడా వారికి రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఏలేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులతోపాటు, లారీలు, ఆటోలు, బైక్‌లు వందలాదిగా ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయన్నారు. ఆదివాసీ సంఘం నాయకుడు సామాల కుశల మాట్లాడుతూ ... వెంటనే రోడ్డు నిర్మాణాలు చేపట్టకపోతే ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మసకపల్లి ధనబాబు, కందుల ప్రసాద్‌, గుమ్మడి రమణ, పడాల అర్జునుడు, బల్లా రమణ, వల్లి కొండలరావు, మసిరపు రాజారావు, నువ్వా నూకాలమ్మ, తదితరులు ఉన్నారు.