ప్రసూతి మరణాలు, అయిదేళ్ల లోపు శిశువుల మరణాలు భారతదేశంలో అధికంగా ఉన్నాయి. వీటితోబాటు మహిళలలో రక్తహీనత ఉన్నవారు మన దేశంలో అత్యధికంగా ఉన్నారు. పౌష్టికాహారం పొందలేకపోతున్న గర్భిణీ స్త్రీల శాతమూ ఎక్కువే. దీనికి మన దేశంలో పెరిగిపోతున్న పేదరికమూ, ఆర్థిక అసమానతలు కారణం. ఈ పేదరికం పెరిగిపోడానికి నయా ఉదారవాద విధానాలు కారణం. ఈ నయా ఉదారవాద విధానాలను వదిలిపెట్టే బదులు మరింత ఉధృతంగా అమలు చేస్తోంది మోడీ ప్రభుత్వం.
అంతేగాక ప్రజారోగ్య పరిరక్షణలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్లేటు మార్చి కొత్త వాదన ముందుకు తెస్తోంది. కొన్ని ప్రాంతాల్లోను, కొన్ని తెగల్లోను ముస్లిం మైనారిటీల్లోను బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నందువల్లే ప్రసూతి, శిశుమరణాలు, రక్తహీనత వంటివి సంభవిస్తున్నాయని ప్రధానే స్వయంగా ప్రకటించారు. అందుకే స్త్రీ కనీస వివాహ వయస్సును పురుషులతో బాటు సమానంగా 21కి పెంచాలని ప్రతిపాదించారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు అటు తమ ప్రభుత్వ వైఫల్యాలనూ కప్పెట్టుకోవచ్చు. ఇటు మైనారిటీలపై వ్యతిరేకతనూ రెచ్చగొట్టవచ్చు. ఇదే కాషాయ పాలకుల రాజనీతి. కాని వాస్తవాలు వేరుగా ఉన్నాయి.
మైనారిటీలు, దళితులు, గిరిజనులు హెచ్చు సంఖ్యలో ఉన్న జమ్ము, కాశ్శీర్, మిజోరాం, మణిపూర్, గోవా, కేరళ వంటి రాష్ట్రాలలో సగటు వివాహ వయస్సు మహిళలలో 25 సంవత్సరాలు. అదే బిజెపి పాలిత యు.పి లో 18 సంవత్సరాలు. బాల్యవివాహాలు అన్ని కులాల్లో, అన్ని మతాలలో కూడా జరుగుతున్నాయి. ప్రసూతి, శిశుమరణాలు సంభవిస్తున్నది కేవలం బాల్య వివాహాలు చేసుకున్న వారిలోనే కాదు. 30 ఏళ్లు దాటిన వయస్కులలోనూ జరుగుతున్నాయి. వీటికి మతం రంగు పులమడం అంటే అసలు సమస్యను పక్కదోవ పట్టించడమే. అందరికీ తగినంత పౌష్టికాహారాన్ని, ఆరోగ్య సంరక్షణను ఏర్పాటు చేయడం సమస్య పరిష్కారానికి దారితీస్తుంది. కాని నయా ఉదారవాద విధానాలు దీనికి ఒప్పుకోవు. గోడౌన్లలో ఆహారధాన్యాలు చెడిపోయినా ఫరవాలేదు గాని ఉచితంగా పేదలకు అందించకూడదన్నదే ఆ విధానాలు చెప్పేది. వివాహ వయస్సు పైకి చర్చ మళ్లించి ప్రజల దృష్టిలో ప్రభుత్వానిదేమీ దోషం లేదనిపించుకోవడమే పాలకుల వ్యూహం. తప్పంతా తమలోనే వుందని, ప్రజలు పాపచింతనతో కుంగిపోవాలి.
ఒక నిరుద్యోగి తనకు ఉద్యోగం రాకపోయినా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా అది అతని/ఆమె తప్పే అంటున్నారు. ఒక రైతు పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా, పంట అమ్ముకోలేకపోయినా అది అతని తప్పే. అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, పేదలు రోడ్డున పడినా, అది వారి తప్పే. ఉద్యోగం సంపాదించుకోలేకపోవడం చదువుకున్నవాడి తప్పు, పంట అమ్ముకోలేకపోవడం రైతు తప్పు, పిడికెడు మెతుకుల కోసం రోడ్డుపై పడటం పేదోడి తప్పు... అంతా మీ తప్పే... ఇందులో మాకేం సంబంధం అంటోంది ప్రభుత్వం. ఇప్పుడూ అంతే... మాతా శిశుమరణాలతో మాకేం సంబంధం.... పోషకాహారం తీసుకోవద్దని మేము చెప్పామా? అన్నట్టుగానే వ్యవహరిస్తోంది.
అయితే ప్రపంచంలోని అతి తక్కువ వయస్సు వివాహాలకు నిలయంగా ఉన్న భారత్ వంటి దేశాలలో బాల్యవివాహాలను నివారించాల్సిందే. బాల్యవివాహాల నిషేధానికి వివాహ వయసు పెంచడమొక్కటే పరిష్కారం కాదు. మహిళల వివాహ వయసును పెంచే బదులు ఆడపిల్లలందరూ బడిలో చేరేలా, మధ్యలో మానేయకుండా చదువు పూర్తి చేసేలా చూడాలి. లైంగిక, పునరుత్పత్తి హక్కుల గురించి అవగాహన కల్పించాలి. 'రేపటి దేశానికి/ ఈనాటి తల్లివి నువ్వు/ రేపటి ఆకాశానికి/ ఈనాడే పూచిన సూర్యపుష్పానివి నువ్వు' అని ప్రముఖ కవి దేవీప్రియ అన్నట్టుగా రేపటి ఆశాకిరణం కావాలి మహిళ. పోషకాహారం అందించడం తమ బాధ్యతగా ప్రభుత్వాలు తీసుకోవాలి. అప్పుడే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా వుంటారు. బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం ఆవిర్భవిస్తుంది.










