Jan 10,2021 07:07

'మీరు చాలా సమర్థులు. కనుక ప్రధాని పదవిలో మిమ్మల్ని బంధించి వివిధ విషయాలలో మీ సేవలు ఉపయోగించుకునే అవకాశం పోగొట్టుకోవడం సాధ్యం కాదు' అని సోనియా గాంధీ చెప్పినప్పుడు 'నేను ఎప్పటికీ మీతోనే వుంటా'నని చెప్పిన వాస్తవికవాది ప్రణబ్‌ ముఖర్జీ. పాండిత్యం, పెద్దరికం, పదవుల్లో ప్రథమ శ్రేణి...అన్నీ వున్నా అందరితో సాన్నిహిత్యం వున్న నాయకుడు. ఆర్థిక శాఖతో మొదలు పెట్టి ఆయన కీలకమైన అన్ని శాఖలూ చుట్టేశారు. తనెంతగానో కోరుకున్న ప్రధాని పదవి మినహా రాష్ట్రపతి స్థానం కూడా అలంకరించారు. పదవిలో వుండగానే తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని, పరిశీలనను నాలుగు భాగాలుగా రాసిన ఒకే ఒక రాష్ట్రపతి ఆయన. అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పే ప్రణబ్‌ దా అందులోనూ తన భావాలు పెద్దగా దాచుకోలేదు. తమ నాయకత్వంతో తాను విభేదించిన అంశాలు, తనకు వస్తాయనుకున్న అవకాశాలు ఎలా దూరమైనాయనేది కూడా నిర్మొహమాటంగా చెప్పేశారు. అధికార వ్యవస్థలో, పాలక పక్షాలలో ఇంత సుదీర్ఘకాలం కీలక పాత్రలు నిర్వహించిన ప్రణబ్‌ జ్ఞాపకాలు చదివితే పాలక వర్గాల అంతర్గత వైరుధ్యాలు, వ్యక్తిగత విన్యాసాలు అవకాశవాదాలు బాగా తెలుస్తాయి.
విద్యార్హత, విధేయత కొలబద్దలుగా ఇందిరాగాంధీ ఎంపిక చేసిన ప్రణబ్‌ ఎమర్జన్సీ లోనూ ఆమెతోనే వున్నారు. బెంగాల్‌లో ఆమెకు చాలా సన్నిహితుడు మాత్రమే గాక ఎమర్జన్సీ విధించాలని సలహా ఇచ్చిన సిద్ధార్థ శంకర్‌ రే కూడా తర్వాత మారిపోయారు గాని ప్రణబ్‌ వదలిపెట్టలేదు. కాకుంటే ఆమె హత్య తర్వాత సీనియర్‌ను గనక తనకు ప్రధానిగా అవకాశం వస్తుందనుకున్నారు. రాజీవ్‌ గాంధీతో ఎకాఎకిన ప్రమాణ స్వీకారం చేయిస్తే కష్టపెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయనకు రాజీవ్‌గాంధీకి ఎడం ఏర్పడింది. దూరం జరిగి రాష్ట్రీయ కాంగ్రెస్‌ పెట్టినా తర్వాత మళ్లీ రాజీకి వచ్చారు. రాజీవ్‌ హత్య తర్వాత తాను వరుసలో వున్నా పి.వి నరసింహారావుకు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి విషయం చెప్పి సన్నద్ధం చేసింది ప్రణబ్‌ ముఖర్జీనే. అప్పుడూ ఆయనకు నాయకత్వంపై ఆశ వుంది గాని అవకాశం రాలేదు. పి.వి హయాంలో మొదట ప్రణాళికా సంఘ ఉపాధ్యక్ష పదవి, ఆఖరి ఏడాది మంత్రి పదవి చేపట్టినా తర్వాత మాత్రం వారి మధ్య సంబంధాలు అంతంతగానే వుండేవి. ఆ ప్రభుత్వం ఆఖరు ఘట్టంలో కాని ఆయన మంత్రి కాలేదు. కాని తర్వాత సోనియా గాంధీని విదేశీయురాలనే దుమారం రేగినపుడు ప్రణబ్‌ తిరిగి వచ్చి ఆమెకు అండగా నిలబడ్డారు. యుపిఎ ప్రభుత్వంలో ప్రధానిని కాగలనని మూడోసారి అనుకున్నప్పుడు ఆమె ఏమన్నారో మొదటే చూశాం. మూడు సార్లు ప్రధాని పదవి ఎంపిక లోకి రాకపోయేసరికి ఆయనను ప్రధాని పదవికి 'శాశ్వత నిరీక్షకుడు' అన్న ముద్ర పడిపోయింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయినా ప్రణబ్‌ ముఖర్జీ దానికి ప్రధాన ఆలంబనగా నిలిచారు. 14 మంత్రివర్గ ఉపసంఘాలకు నాయకుడుగా వున్నారు. రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాల పరిష్కారానికి కూడా వెళ్లవలసి వచ్చేది. అది తెలంగాణ సమస్య అయినా అణు ఒప్పందంపై వామపక్షాలతో చర్చలయినా ప్రణబ్‌ దగ్గరకే వచ్చేవి. ఈ సందర్భంగానే అణు ఒప్పందం విషయంలో వామపక్షాల పట్ల కాంగ్రెస్‌ మోసపూరితంగా వ్యవహరించిన తీరు ఈ జ్ఞాపకాలలో తెలుస్తుంది (అయితే వ్యక్తిగతంగా ప్రణబ్‌ ఎప్పుడూ కోపతాపాలు చూపలేదని సీతారాం ఏచూరి తన నివాళి వ్యాసంలో రాశారు). ఇక తెలంగాణపై ఏర్పడిన కమిటీకి కూడా ఆయన ఆధ్వర్యం వహించారు. ఎప్పుడూ ఆ విషయమై మాట్లాడుతుండేవారు. తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రణబ్‌ కమిటీ నిరంతర ప్రస్తావనగా వుండేది. ప్రణబ్‌ ముఖర్జీ తమకు కొండంత అండ అని తెలంగాణ నేతలు భావించేవారు. ఆయన మరణించిన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా మాట్లాడిన తీరు అందుకు నిదర్శనం. కాని అది కూడా రాజకీయ ప్రహసనం మాత్రమేనని ఇప్పుడు విడుదలైన తాజా పుస్తకం చెబుతుంది. తాను ప్రధానిని అయివుంటే తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకునేవాణ్ని కాదని రాశారు. కుల మత ప్రాంత తత్వాలతో పాలకవర్గ నేతలు ఎలా ఆడుకుంటారో, వాడుకుంటారో దీన్నిబట్టి తెలుస్తుంది.
ఆ కాలంలో బెంగాల్‌లో సిపిఎం అప్రతిహతంగా పాలిస్తున్న పరిస్థితి. రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ముఖ్యమంత్రి జ్యోతిబసు వంటి వారితో కూడా ఆయన వ్యక్తిగత సంబంధాలు పాటించేవారు. పెద్ద ప్రజా పునాది వున్న నాయకుడు కాదు గనక రాజ్యసభకు ఎంపికై వచ్చేవారు, అయితే 1980లో ఇందిరాగాంధీ వద్దన్నా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2004లో లోక్‌సభకు పోటీ చేయనా అని ఒకేఒకసారి సలహా అడిగారని సీతారాం ఏచూరి రాశారు. మీకంటే నేను చిన్నవాణ్ని ఎలా చెప్పగలనని ఏచూరి అన్నా వినకుండా పట్టుపట్టారట. తప్పక గెలుస్తానని నమ్మకం వుంటే పోటీ చేయమని ఏచూరి చెప్పారు. మొత్తానికి గెలిచి వచ్చారు. కాంగ్రెస్‌ తగాదాలలో మమతా బెనర్జీతో సత్సంబంధాలు పాటించేవారు. నేను ప్రధానిని అయితే మమతను యుపిఎ నుంచి బయటికి వెళ్లనిచ్చేవాణ్ని కాదని రాశారు. తను రాష్ట్రపతినై, ప్రత్యక్ష రాజకీయ పాత్ర నుంచి దూరమైనాక సోనియాగాంధీ హయాంలో చాలా తప్పు నిర్ణయాలు జరిగాయని వ్యాఖ్యానించారు. అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణల మధ్య మన్మోహన్‌ సింగ్‌ ఎప్పుడూ ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే తలమునకలు కావడంతో పార్లమెంటులో చర్చలు ప్రాధాన్యత కోల్పోయాయని వ్యాఖ్యానించారు.
2012లో రాష్ట్రపతి అయిన ప్రణబ్‌ 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమికి నాయకత్వం పొరబాట్లే కారణమైనాయని స్పష్టీకరించారు. సోనియా విధానాల వల్ల మహారాష్ట్ర వంటి చోట్ల బలమైన నాయకులు దూరమైనారని వెల్లడించారు. ప్రజల ఆశలు నెరవేర్చడంలోనూ సమస్యలు పరిష్కరించడంలోనూ కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. ఆ ఏడాది రిపబ్లిక్‌ దినోత్సవ ప్రసంగంలో తాను పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చానని, బిజెపి కి పూర్తి మెజార్టీ వచ్చిందని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం మధ్యలో నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టినా సత్సంబంధాలు పాటించడమే గాక ఇద్దరూ సన్నిహితులుగా వున్నారన్న భావం కలిగించారు. అయితే రాష్ట్రపతి పదవీ కాలం గురించి రాసిన చివరి భాగంలో మోడీది నిరంకుశ శైలి అని విమర్శించారు. సోనియా గాంధీని ప్రధానిగా ఎన్నుకుంటే ఆమె ఎంపికగా మన్మోహన్‌ వచ్చారని, కాని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ముందే అభ్యర్థిగా ఎంపికై విజయం సాధించారు గనక ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్లమెంటును కూడా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. ఆయన భిన్నాభిప్రాయాలు వినడం, అసమ్మతిని సహించడం అలవర్చుకోవాలన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి వంటి వారు పార్లమెంటుకు రావడం, వినడం జరిగేదని పార్లమెంటు పట్ల శ్రద్ధ లేని మోడీ వారి నుంచి నేర్చుకోవాలని రాశారు. విదేశాంగ విధాన సమస్యలు ఆయన త్వరగా ఆకళింపు చేసుకున్నప్పటికీ విదేశీ నాయకులతో సంబంధాలను వ్యక్తిగతంగా చూపించుకోవడానికి చాలా తాపత్రయ పడేవారని వ్యాఖ్యానించారు. ఉదాహరణకు, జపాన్‌తో మనకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నా అదేదో తన హయాంలోనే జరిగినట్టు మోడీ చిత్రించుకున్నారని రాశారు. చైనాతో శిఖరాగ్ర సమావేశాల సంప్రదాయం మోడీ హయాంలో మొదలవడం గుర్తు చేశారు. అయితే లాహోర్‌లో ఆగి నవాజ్‌ షరీఫ్‌ను కలుసుకోవడం అప్పటి హడావుడి అవసరంలేని పనులని స్పష్టం చేశారు. వివిధ దేశాల నాయకుల మధ్య వుండే సంబంధాలలో వ్యక్తిగతం ఏమీ వుండదని మోడీ తెలుసుకోవాలన్నారు. విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ కూడా నిర్వహించిన ప్రణబ్‌ ముఖర్జీ నోట్ల రద్దు నిర్ణయంతో విభేదించారు. దాన్ని ప్రకటించే ముందు మోడీ తనతో సంప్రదించలేదని, పార్లమెంటులో ప్రసంగించిన తర్వాత వచ్చి వివరించారని చెప్పారు. నల్ల డబ్బు నిరోధం తదితర లక్ష్యాలను ప్రకటించిన ప్రధాని మోడీ వాటిని సాధించలేకపోయారని కూడా మాజీ రాష్ట్రపతి విశ్లేషించారు. మతం వంటి అంశాలను బట్టి జాతీయ గుర్తింపును గణించడం పొరబాటని, భారతీయులుగా ప్రజాస్వామ్యయుతంగా సహనంతో జీవించడం ప్రధానమని ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతులో 2018లో ఆయన ఇచ్చిన సందేశమే ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలతోనూ కనిపిస్తుందని చెప్పొచ్చు. మీడియా తోనూ ఆయన సూటిగా పొదుపుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు కఠినంగానూ వుండేది. పదవీ విరమణ తర్వాత రాజ్‌దీప్‌ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధ్యలో ప్రశ్నలు వేస్తుంటే 'మాజీ రాష్ట్రపతిని ఇలా అడ్డుకోకూడదు. ముందు విచారం వెలిబుచ్చు' అని సారీ చెప్పించారు. అలాంటి ప్రణబ్‌ ముఖర్జీ జ్ఞాపకాల వార్తకు 'మోడీ అజేయుడు, మన్మోహన్‌ విధేయుడు' అని ఒక అగ్ర తెలుగు పత్రిక తప్పుగా శీర్షిక ఇచ్చినందుకు ఏమనేవారో తెలియదు. ఇలా మొత్తంపైన ప్రణబ్‌ ముఖర్జీ ఆసక్తికర జ్ఞాపకాలతో వెలువడిన నాలుగు సంపుటాలు భారత రాజకీయ గమనాన్ని, పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

                                                                                                     పాలకవర్గ పోకడలకు అద్దం పట్టిన ప్రణబ్‌ జ్ఞాపకాలు        -    తెలకపల్లి రవి