Nov 06,2022 06:51

నూట ఐదు సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం, ఒక శతాబ్దం క్రితం ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ప్రపంచ చరిత్ర గతినే మార్చివేశాయి.
నవంబర్‌ 7న ప్రారంభమైన అక్టోబర్‌ విప్లవం నూతన సమాజానికి నాంది పలికింది. ఒకరిని మరొకరు దోపిడీ చేయడం నుండి విముక్తి కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రామిక పీడిత ప్రజలలో ఆశను, విశ్వాసాన్ని కలిగించింది. ఎక్కడైతే ప్రజల శ్రమ గుర్తింపబడుతుందో, గౌరవింపబడుతుందో అక్కడ...శ్రమజీవులు, కర్షకులు, సామాన్య ప్రజలు సృష్టించిన సంపద...కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడదన్న విషయం నిరూపితమైంది. అక్టోబర్‌ విప్లవం వలన సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం మొదలైనవి అతి తక్కువ వ్యవధిలో నిర్మూలింపబడ్డాయి. అదే సమయంలో సైన్స్‌ అభివృద్ధి విషయంలో భారీ ప్రగతిని సాధించింది. అంతేగాక అత్యంత సంపన్నమైన, అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశమైన అమెరికాతో పోటీ పడేలా సోవియట్‌ యూనియన్‌ ఎదిగింది.
శ్రామిక వర్గానికి, సామాన్య ప్రజలకు...అభ్యుదయ వాదులందరికీ అక్టోబరు విప్లవం స్ఫూర్తినిచ్చింది. నాడు బ్రిటిష్‌ వలసవాదం నుండి మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థలు, శక్తులు సోవియట్‌ యూనియన్‌ విజయాల ద్వారా బాగా ప్రభావితమయ్యాయి. సోవియట్‌ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం చూసి...స్వతంత్ర భారతం గురించిన వారి దక్పథం మరింత ప్రభావితమైంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది. మత విభజన సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ హయాంలో మనం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం. అంతేగాక ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కుల మీద, ప్రజల ప్రయోజనాలపైన దాడి జరుగుతున్నది. బ్రిటిష్‌ పాలనను తలపించే పరిస్థితులకు ప్రజలు నెట్టివేయబడుతున్నారు.
అక్టోబర్‌ విప్లవాన్ని స్మరించుకోవడం, అది సాధించిన ఘన విజయాలను గుర్తుచేసుకోవడం ఒక మొక్కుబడి కార్యక్రమంగా పరిగణించరాదు. మన దేశంతో సహా ప్రపంచంలోని శ్రామిక వర్గానికి ఇదొక సందర్భం కావాలి. ప్రపంచ గతిని మార్చిన సంఘటన నుండి పాఠాలు నేర్చుకుని...పాలక వర్గాలను ఐక్యంగా ఎదుర్కోవడానికి, వారిని ఓడించి దోపిడీ రహిత సమాజాన్ని సాధించడానికి దృఢ సంకల్పం తీసుకోవాలి. అది సాధ్యమేనని అక్టోబర్‌ విప్లవం రుజువుచేసింది.
సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలి దాదాపు మూడు దశాబ్దాలు అయింది. ఇది సోషలిజంకు పెద్ద ఎదురుదెబ్బ. సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్థ పతనం ఎంతోమంది సామాజిక స్థితి, జీవన ప్రమాణాల తీవ్ర క్షీణతకు దారితీసింది. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక సంక్షోభాలు వలన పేదరికం పెరిగింది. మరణాలు, ఆత్మహత్యల రేటు పెరిగింది. 2020లో ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, 75 శాతం మంది రష్యన్లు ''సోవియట్‌ యుగం అనేది రష్యా చరిత్రలో అత్యుత్తమ కాలం''గా భావించారు. సాధారణ పౌరులకు ఉన్నత స్థాయి శ్రేయస్సు, అవకాశాల పరంగా కూడా ఆ సమయం చాలా అత్యుత్తమమైనదని విశ్వసించారు.
అయితే, సోవియట్‌ పతనం తర్వాత...పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం యొక్క కిరాయి రాతగాళ్లు...సోషలిజాన్ని ఎదుర్కొనే ఒక సిద్ధాంతంగా నయా ఉదారవాద విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీనిని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు డబ్ల్యు.టి.ఓ, ప్రపంచ బ్యాంకు, ఐ.ఎమ్‌.ఎఫ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లారు. దీనికి ప్రత్యామ్నాయం మరొకటి లేదని ప్రజలు విశ్వసించేట్టు చేశారు.
2007-2008 ఆర్థిక సంక్షోభం తర్వాత...అలాగే అప్పటి నుండి ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఏర్పడిన కోవిడ్‌ సంక్షోభం తర్వాత...ఈ నయా ఉదారవాద విధానం ఎటువంటి పరిష్కారం చూపలేకపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థను మోసే పెద్దలు కూడా తోక ముడిచారు. నయా ఉదారవాదానికి నాయకత్వం వహించిన ఐ.ఎం.ఎఫ్‌ కూడా తన వైఫల్యాన్ని అంగీకరించింది. వృద్ధి ఉన్నప్పటికీ ఫలితాలు అనిశ్చితంగా ఉన్నాయని, పెరిగిన ఆర్థిక అస్థిరత, సంక్షోభాల కారణంగా అసమానతలు తీవ్రమయ్యాయని తన ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ 'ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌'లో పేర్కొంది.
కోవిడ్‌ సమయంలో కార్మికులు, ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని పరిరక్షించడంలో అత్యంత ధనిక, శక్తివంతమైన అమెరికాతో సహా పెట్టుబడిదారీ దేశాలు విఫలం కావడాన్ని వారు స్పష్టంగా గమనించారు. ఈ కోవిడ్‌ వైరస్‌ను మొదట గుర్తించిన చైనాతో సహా సోషలిస్టు దేశాలు ప్రజల ప్రాణాలను, వారి జీవనోపాధిని సమర్థవంతంగా కాపాడాయి.
అమెరికా విధించిన క్రూర ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతున్న సోషలిస్టు దేశం క్యూబా... ప్రభుత్వ రంగంలో ఉన్న బలమైన ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా కోవిడ్‌ను ఎదుర్కొని ప్రజలను, వారి ఉపాధిని కాపాడుకుంది.
నయా ఉదారవాదం నేడు అప్రతిష్ట పాలైంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసమానతలు, ఉద్యోగ నష్టాలు, నిరుద్యోగం, వైద్య సదుపాయాల లేమి పెరగడానికి ఈ నయా ఉదారవాద విధానాలు దారితీశాయి. ఈ విధానాల వలన ట్రేడ్‌ యూనియన్‌ హక్కులపై దాడులు, పేదరికం పెరుగుదల, ఆకలి, పోషకాహార లోపం తలెత్తాయి. ప్రజలు ముఖ్యంగా యువత నయా ఉదారవాదాన్ని వ్యతిరేకించసాగారు. అంతేగాకుండా పెట్టుబడిదారీ విధానంపై వారికున్న భ్రమలు తొలగిపోయాయి.
18-24 ఏళ్ల మధ్య వయస్కులైన 54 శాతం మంది అమెరికన్లు తమ తమ రాజకీయ విశ్వాసాలు ఏవైనప్పటికీ పెట్టుబడిదారీ విధానంపై ప్రతికూలంగా ఉన్నారన్న 'యాక్సియోస్‌' సర్వే వివరాలను 'హెరిటేజ్‌ ఫౌండేషన్‌ పేర్కొంది. రెండేళ్ల క్రితం పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల 58 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు 42 శాతం మంది మాత్రమే అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని చెప్పింది.
నయా ఉదారవాద విధానాల వలన వారి జీవనోపాధి చితికిపోయినప్పటికీ, జీవన ప్రమాణాలు పడిపోయినప్పటికీ వారి చూపు సోషలిజం కోసం చేసే పోరాటాలపై మళ్లడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రత్యామ్నాయం కోసం పోరాటాలు చేస్తున్నారు. ఈ నయా ఉదారవాద విధానాల వలన ఏర్పడిన ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రాథమిక హక్కులు - సంక్షేమ ప్రయోజనాలపై దాడులు మొదలగు సమస్యలపై నిరంతరం పోరాటాలు జరుపుతున్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అవలంబిస్తామని వాగ్దానం చేసిన కొన్ని లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రగతిశీల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మన దేశంలోనూ భారీ పోరాటాలు జరిగాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటం...ఆ మూడు చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేయగలిగింది. ఉమ్మడి ట్రేడ్‌ యూనియన్‌ వేదిక పిలుపు మేరకు గత రెండేళ్లలో మన దేశంలోని కార్మిక వర్గం మూడు సార్వత్రిక సమ్మెలు చేసింది. 2020లో రెండు సమ్మెలు జరిగాయి. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో ఒకటి, అలాగే 2022 మార్చిలో ఒక సమ్మె జరిగాయి. దాదాపుగా శ్రామికులందరూ ఈ సమ్మెలలో పాల్గొన్నారు. ఈ సమ్మెలన్నీ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నయా ఉదారవాద విధానాల వల్లనే తమ జీవన పరిస్థితులు దుర్భరమయ్యాయని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉద్యోగ నష్టాలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పని ప్రదేశాల్లో పరిస్థితులు దిగజారడం, వ్యవసాయ సంక్షోభం వలన రైతుల మరియు కూలీల ఆత్మహత్యలు పెరగటం...వంటివన్నీ జరుగుతున్నాయని మన దేశంలోని కార్మిక వర్గం ఇంకా గుర్తించడం లేదు.
ప్రజలు తమ నిజమైన శత్రువులైన నయా ఉదారవాద విధానాలను, దోపిడీపై ఆధారపడిన పెట్టుబడిదారీ వ్యవస్థను గుర్తించకుండా ఉండేలా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని పాలక వర్గాలు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రజలు, కార్మికులు బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు బిజెపి రాజకీయ, సైద్ధాంతిక గురువైన ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటిష్‌ వారి కొమ్ము కాసింది. ఇప్పుడు బిజెపి వారు (మన పాలక వర్గాలు) అమెరికా సామ్రాజ్యవాద కొమ్ము కాస్తున్నందున దేశంలో నయా ఉదారవాద విధానాలు మరింత వేగంగా అమలు చేయబడుతున్నాయి.
ఈ శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ద్వేష భావాన్ని పెంచుతూ సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూస్తున్నాయి. స్వతంత్ర పోరాట సమయంలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన రాజ్యాంగం స్థానంలో ... దళితులను, గిరిజనులను, స్త్రీలను అణగదొక్కాలని చూసిన మనుస్మృతిని తీసుకురావాలని చూస్తున్నాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ లకు స్వదేశీ, విదేశీ బడా కార్పోరేట్‌ సంస్థలు, వ్యాపార సంస్థలు అండగా నిలుస్త్తున్నాయి. దేశంలోని నిరసన స్వరాలను అణచివేసేందుకు బిజెపి ప్రభుత్వం అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తోంది. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులపై దాడి జరుగుతున్నది. పార్లమెంటరీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ప్రజలు ఐక్యతను, ఐక్య పోరాటాలు దెబ్బ తీసే చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు నిర్వహించిన ఉమ్మడి జాతీయ మహాసభ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశ రాజధానిలో 2023 బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. దీనికోసం దేశ నలుమూలలా ప్రచారం చేయాలని నిర్ణయించింది. నయా ఉదారవాద విధానాల దుష్ఫలితాలను తిప్పి కొట్టాలని, అదే సమయంలో ప్రజల ముందు ప్రత్యామ్నాయ విధానాలను వుంచాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
సామాన్య ప్రజలు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గాల ద్వారానే మన సమాజం యొక్క సంపద సృష్టించబడింది. శ్రమ దోపిడీ చేసే పెట్టుబడిదారీ వ్యవస్థ వలన ఇబ్బంది పడుతున్న వీరంతా ఉమ్మడి పోరాటాల ద్వారానే ఈ విధానాలను తిప్పికొట్టి ప్రత్యామ్నాయ విధానాలను తీసుకురాగలరు.
వ్యవస్థాగత సంక్షోభంలో ఉన్న దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చాల్సిన అవసరం గురించి మన కార్మిక వర్గానికి, అలాగే కర్షకులకు అవగాహన కల్పించాలి. ఈ కర్తవ్య సాధనకు ఐక్య పోరాటాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా...అక్టోబర్‌ మహా విప్లవం స్ఫూర్తితో కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలి.

 

october-revolution-duties-of-working-class-article-by-hemalatha

 

 

 


వ్యాసకర్త  : కె. హేమలత, సిఐటియు జాతీయ అధ్యక్షురాలు