Aug 06,2022 06:20

మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది హిరోషిమా, నాగసాకిలలో బాంబింగ్‌ సంఘటనల్లో మాత్రమే. ఈ దారుణ మారణకాండకు ఆగష్టు 6 నాటికి డెబ్బై ఏడేళ్లు. యుద్ధాల వల్ల ఇరుపక్షాలకు జన, ధన నష్టం తప్పదు. ఒకటి లేక రెండు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. అయితే అణ్వాయుధ దాడిలో బాంబు వేయబడిన ప్రాంతానికి రెండు, రెండున్నర కిలోమీటర్ల పరిధిలో జన నష్టంతో పాటు భవంతులు, నిర్మాణాలు...అన్నీ ధ్వంసం అవుతాయి. అంతేకాక ఆ ప్రదేశంలో వాతావరణం కలుషితమౌతుంది. భూమి విషపూరితం అయి మొక్కలు మొలవవు. పంటలు పండవు. ప్రమాదానికి గురై బతికిన వారు అనేక ఆరోగ్య సమస్యలతో జీవచ్ఛవాలుగా జీవించాలి. సంతానోత్పత్తి జరగదు. ఒకవేళ పుట్టినా అనేక ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యంతో పుడతారు.
శాంతి రాజకీయాలను ప్రోత్సహించడానికి, హిరోషిమాపై బాంబు దాడి ప్రభావాలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 6న హిరోషిమా డే జరుపుకుంటారు. ఆగష్టు 6, 1945న హిరోషిమా నగరంపై అణుబాంబు వేయబడింది. అది తక్షణమే వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచంలో అణుబాంబు దాడికి గురైన మొదటి నగరం ఇదే. ఈ రోజున అనేక దేశాలలో యుద్ధ వ్యతిరేక మరియు అణు వ్యతిరేక ప్రదర్శనలపై దృష్టి సారి స్తున్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజున ప్రజలు...రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై అణుబాంబు దాడిని ఫలితాలను, సాక్ష్యాలను భద్రపరచిన హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ మ్యూజియాన్ని సందర్శిస్తారు.
1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో అమెరికా జపాన్‌ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. ఈ దాడులు చేసే ముందు అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మద్దతు తీసుకుంది. యుద్ధం చివరి ఏడాదిలో అమెరికా మిత్రరాజ్యాలు జపాన్‌ను ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబు దాడులు చేసి 67 జపాన్‌ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాన్‌ బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోక పోవడంతో పసిఫిక్‌ యుద్ధం కొనసాగింది. జపాన్‌ బేషరతుగా లొంగిపోవాలని 1945 జులై 26న మిత్ర రాజ్యాలు తమ పోట్స్‌డామ్‌ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషను హెచ్చరించింది. జపాన్‌ దాన్ని పెడచెవిన పెట్టింది. 1945 ఆగస్టు నాటికి మన్‌హట్టన్‌ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్‌ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్‌ బి-29 సూపర్‌ఫోర్ట్రెస్‌ను సమకూర్చుకుంది.
నాలుగు జపాన్‌ నగరాల మీద అణుబాంబులు వెయ్యాలని జులై 25న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 6న అమెరికా హిరోషిమాపై యురేనియం గన్‌ రకం బాంబును (లిటిల్‌ బారు) వేసింది. లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు జపాన్‌కు చెప్పాడు. లేదంటే ''చరిత్రలో ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుందని'' హెచ్చరించాడు. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9న ప్లుటోనియమ్‌ ఇంప్లోజన్‌ రకం బాంబును (ఫ్యాట్‌ మ్యాన్‌) నాగసాకిపై వేసింది. 20 బ్రిటిషు, డచ్చి, అమెరికా యుద్ధ ఖైదీలు మరణించారు. రెండు నుండి నాలుగు నెలల్లోపు హిరోషిమాలో 90,000 నుండి146,000 మంది వరకు, నాగసాకిలో 39,000 నుండి 80,000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు సగం మంది మొదటిరోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్‌ సిక్‌నెస్‌ వలన, ఇతర గాయాల వలనా, పౌష్టికాహార లోపంతోను అనేక మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. అయితే హిరోషిమాలో ఒక సైనిక స్థావరం మాత్రమే ఉంది.
నాగసాకిలో బాంబు వేసిన ఆరు రోజుల తరువాత జపాన్‌ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 2న లొంగుబాటు పత్రంపై జపాన్‌ ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. లక్షకు పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికీ చర్చనీయాంశమే.
సామ్రాజ్యవాదం తలకెక్కిన ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. ఈ అణుబాంబు దాడుల నుండి మనం ఆలోచించ వలసిన విషయాలు 1.ఈ దారుణ మారణకాండకు బాధ్యులు ఎవరు? 2. ఆ బాధ్యులు అలా చేయడానికి కారణాలు ఏమిటి? దీనికి జవాబులు చరిత్రను పరిశీలిస్తే సులువుగా లభిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం మార్కెట్టు కోసం పోరాటం. అలా ప్రపంచ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన సామ్రాజ్యవాదం నుండి వచ్చిందే. దీనికి మూలం పెట్టుబడిదారీ వ్యవస్థ. కాబట్టి తృతీయ ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాద ప్రమాదం, నష్టాలను గుర్తెరగాలి. ప్రపంచం అంతా ఒక గొడుగు కిందకు వచ్చిన ఈ పరిస్థితుల్లో అందరూ క్షేమంగా, అన్ని దేశాలు సుభిక్షంగా వుండడంకోసం ప్రపంచ శాంతికి పాటుబడాలి.

satya

 

 

 

 

 

వ్యాసకర్త : ఆంధ్రప్రదేశ్‌, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

కె.వి.వి. సత్యనారాయణ సెల్‌ : 8500004953 /