
- డి.ఎస్.పి మహబూబ్ బాష
ప్రజాశక్తి-పీలేరు : రెండు నాటు తుపాకులతో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు రాయచోటి డి.ఎస్.పి మహబూబ్ బాష తెలిపారు. శుక్రవారం పీలేరు అర్బన్ సిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి మాట్లాడుతూ, పీలేరు మండలం, రేగళ్లు పంచాయితీ, బోయపల్లికి చెందిన లింగం బాలకృష్ణ (33), దాసరి గంగాధర (32) అనే ఇద్దరు యువకులు, బోయపల్లికి పడమర దిక్కున ఉన్న పెద్ద కొండకు నాటు తుపాకులతో వేటకు వెళ్లారని గురువారం సాయంత్రం పీలేరు పోలీసులకు సమాచారం అందిందన్నారు. దీంతో సిఐ ఎన్. మోహన్ రెడ్డి, ఎస్సై ఎంకె నరసింహుడు తమ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని, దాడులు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నిందితులిద్దరూ జంతువులను వేటాడ్డం కోసం రెండు నాటు తుపాకులతో చెట్ల మధ్య ఉండగా ఇరువురినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇరువురు నిందితులు ఎలాంటి అనుమతులు కానీ, లైసెన్సులు కానీ లేని రెండు నాటు తుపాకులు కలిగి ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండుకు పంపినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐ మోహన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.