Sep 28,2020 12:48

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

పదాలకు తన గానంతో ప్రాణం పోసి, మధురంగా ఆలాపించడం బాలుకు స్వరంతో పెట్టిన విద్య. తన గాత్రాన్ని కథానాయకుని గొంతులోకి ఒలికించి, పలికించగల నేర్పరి. అది పాట అయినా.. మాట అయినా.. వయసు పెరుగుతున్నప్పుడు స్వరంలో మార్పులు రావడం సహజం. కానీ ఆయన గాత్రం నిత్య యవ్వనంతో చివరివరకూ తొణికిసలాడుతూనే ఉంది.. తీయ తీయని తేనెలు ఒలికిస్తూనే ఉంది.. అన్ని రకాల పాటలు పాడగలగడం ఆయనకున్న ప్రత్యేకత. పాడతా తీయగా అంటూ 50 వసంతాలుగా వేలాది పాటలను తన స్వరంలో మాధుర్యాన్ని చిలికించి పలికించారు. అదే ఆయనకు తిరుగులేని అవార్డు. బాలసుబ్రహ్మణ్యం గాయకుడి మాత్రమే కాదు.. నటుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆయన స్వరం ఎప్పటికీ సజీవం. ఆయన పాట చిరంజీవి.

ఎస్పీ బాలు అని మనమంతా పిలుచుకుంటాం గానీ.. ఆయన పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946, జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. ఇంజనీర్‌ కావాలనుకున్నారు. కానీ తండ్రి కోరిక మేరకు గాయకుడయ్యారు. ఎస్పీ బాలు తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలూ ప్రదర్శిస్తూండేవారు. అలా బాలుకి చిన్ననాటి నుంచే సంగీతం మీద ఆసక్తి.. అనురక్తి పెరిగాయి. దీంతో ఆయనకి తండ్రే తొలి గురువు అయ్యారు. ఐదేళ్ల వయసులో 'భక్త రామదాసు' నాటకంలో తండ్రితో కలిసి బాలు నటించారు. ప్రాథమిక విద్యను నగరిలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసి, స్కూలు ఫైనల్‌ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పుడు చదువులోనే కాదు.. ఆటల్లోనూ స్కూలులో మొదటివాడిగా నిలిచేవారు. బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు పల్లవి, కొడుకు ఎస్‌.పి.చరణ్‌. కొడుకు ఎస్‌.పి.చరణ్‌ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా మారారు. బాలు సోదరి ఎస్‌.పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడారు.
'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' (1966) సినిమాలో బాలు తొలిసారి పాట పాడారు. 'శంకరాభరణం', 'సాగరసంగమం' లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్‌ దుజే కే లియే' హిందీ చిత్రంలోనూ బాలు పాటలు పాడారు. ఆయన పాటకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్తు దేశం, ప్రపంచం నలుమూలలా అభిమానులు ఉన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ పాటల ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలు పాడి, గిన్నీస్‌ రికార్డును సాధించారు.


సంగీతంలో ఆణిముత్యం..
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలుగు సినీ సంగీతంలో ఓ ఆణిముత్యం. 'వందనం అభివందనం' అంటూ విషాద గీతాలైనా, 'ఏ దివిలో విరిసిన పారిజాతమో', 'కన్నెపిల్లవని కన్నులున్నవని ఎనెన్ని వగలు పోతున్నావే చిన్నారి!' అంటూ ప్రేమ పాటలైనా, 'మహానగరంలో మాయగాడూ..' 'నేనే నెంబర్‌ వన్‌...' అంటూ మాస్‌, మసాలా బీట్స్‌ అయినా.. 'తరలి రాదా తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం' వంటి సందేశాత్మక స్వరాలైనా.. 'కో అంటే కోడిపుంజు కోకో..' అంటూ ఏదైనా ఆయన నోట అలవోకగా ఆలాపన సాగుతుంది. ఘంటసాల తరువాత అంత స్థాయిలో పేరొందిన ఏకైక గాయకుడు బాలు. కథా నాయకుల గొంతుకు తగినట్లు తన గాత్రం వారి స్వరంలో పాడడం ఆయనకున్న టాలెంట్‌. చాలామంది నటులకు ఆయన వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి జీవం పోశారు.


మలుపు తిప్పిన 'శంకరాభరణం'మలుపు తిప్పిన 'శంకరాభరణం'
ఘంటసాల అతి చిన్న వయసులో మరణించడంతో తెలుగు సినిమా పాటలకు లోటు ఏర్పడింది. ఆ ఖాళీని ఎస్పీ బాలుయే అతి త్వరలోనే పూడ్చారు. ఆయన తన గళంతో పాత్రలకు ప్రాణం పోశారు. బాలు సినీ జీవితం 'శంకరాభరణం' సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్‌ గీతాలకే పరిమితమైన బాలు.. ఈ సినిమాలో సాంప్రదాయ సంగీతాన్ని సైతం అద్భుతంగా పాడగలరని నిరూపించుకున్నారు. సంగీత పండితుల ప్రశంసలను పొందారు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో 'ఉత్తమ గాయకుడి' గా అవార్డు అందుకున్నారు. తెలుగులోనే కాదు, ఉత్తరాదినా పాటలు పాడి తన ప్రతిభను విస్తరించుకున్నారు. హిందీలో తొలిసారి 'ఏక్‌ దూజే కే లియే' చిత్రంలో అత్యద్భుతంగా పాడి, ఉత్తరాదినా అభినందనలను అందుకున్నారు. ఈ సినిమాకూ 'ఉత్తమ గాయకుడి'గా జాతీయ అవార్డు రావడం మరో విశేషం. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ నాలుగు భాషల్లోనూ కలిపి ఆరుసార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా ఎంపిక కావడం బాలసుబ్రహ్మణ్యానికే దక్కిన అరుదైన గౌరవం. భక్తిపరమైన సినిమాల్లో ఆయన పాడి, మరింత ప్రత్యేకత సాధించారు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శ్రీరామరాజ్యం' చిత్రాలలో బాలు గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపించేవే.


ఇలా గాయకుడయ్యారు..
మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ 1964లో నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలు పాల్గొన్నారు. ఆ పోటీల్లో బాలుకు ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీలకి ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అక్కడే ప్రేక్షకుల మధ్య మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూర్చుని, బాలు పాడిన పాట విన్నారు. ఆయనకు బాలు పాడిన విధానం బాగా నచ్చింది. అక్కడే బాలుని ఆయన అభినందించడమే కాకుండా, సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అలా బాలు మద్రాసులో ఇంజనీరింగ్‌ చదువు కొనసాగిస్తూ సినిమా అవకాశాల కోసం తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా రాగ, తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం బాలుకు పుష్కలంగా ఉన్నాయి. ఒకసారి ట్యూను వింటే యథాతథంగా పాడగలిగే ప్రతిభ బాలు సొంతం.


అందరివాడు..
ఆయన పాటలు పాడడమే కాదు... పాటలకు బాణీలు కట్టేవారు. పాత్రలకు డబ్బింగ్‌ చెప్పారు. కెమేరా ముందుకొచ్చి నటించారు. మంచి కథలకు నిర్మాతయ్యారు. ప్రతిభావంతులైన కొత్తతరం గాయనీ గాయకులను వెలికితీసి, మెరుగుపెట్టి మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తెచ్చారు. అందుకే, భారతీయ సినీ నేపథ్య గాయకుల్లో బాలూది ఓ ప్రత్యేక చరిత్ర.


అంతటి బహుముఖ ప్రతిభాశాలి కాబట్టే, ఆయన గానామృతానికి జాతీయ అవార్డులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వ సత్కారాలు, విశ్వవిద్యాలయ గౌరవాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఆయన కృషి లేకుండా మాత్రం ఇంత ప్రతిభ రాలేదన్నది అంతే వాస్తవం. వెరసి, ఒకప్పటి నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట (ఇప్పుడిది తమిళనాడులో భాగమైంది) గ్రామవాసి అయిన ఈ గాన తపస్వి ఇవాళ అందరి ప్రేమాన్వి అయ్యారు. తెలుగువాళ్లు ప్రేమగా 'మా బాలు'.. అని పిలుచుకుంటే.. తమిళులు 'నమ్మ ఎస్పీబీ'.. మలయాళీలు 'నమ్ముడె ఎస్పీబీ'.., కన్నడిగులకు 'నమ్మవరు ఎస్పీబీ'.., హిందీ వాళ్ళకు 'హమారా ఎస్పీబీ'.. అని ఆయన్ని ప్రేమించారు. అలా తన గానామృతంతో కోట్లాది మందిని అలరించారు. ఇలా అందరివాడిగా ఎదగడం, ఎంత ఉన్నతంగా ఎదిగినా ప్రతిచోటా ఒదిగి ఉండడం అరుదుగా కనిపించే సంస్కారం. అది బాలు సొంతం. అలా అని ఎవరితో మాట తేడాలేవీ రాలేదని కాదు.. వచ్చినా సర్దుబాటు చేసుకునే వ్యక్తిత్వం గల మంచి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం.


బాలు పాట అజరామరం. ఆయన పాటను అనుభూతి చెంది పాడతారు. స్వరమే కాదు.. భాష మీద పట్టున్న అరుదైన సుగుణం ఆయన సొంతం. అందుకే పాటలో ఆయన ఉచ్ఛారణ స్పష్టంగా.. సొగసుగా ఉంటుంది. పాటలో భావాన్ని పలికించి సంతోషమైనా.. కన్నీరైనా పెట్టించగల టాలెంట్‌ బాలుకే ఉంది. 'గుణ' సినిమాలో డబ్బింగే చెప్పినా.. పాట పాడినా.. అనుభూతితో కూడి ఉంటాయి. 'ప్రియతమా నీవచట కుశలమా..' అనే పాటలో చెప్పిన డబ్బింగ్‌ అద్భుతంగా ఉంటుంది. అలా ఆయన పాట, మాట ఎప్పటికీ ప్రతి మదిలో నిలిచిపోతుంది. ఆయన పాట అందరి పెదాలపై తొణికసలాడుతూనే ఉంటుంది. బాలు భౌతికంగానే దూరమయ్యారు.. ఆయన పాట మాత్రం ఎప్పటికీ చిరంజీవే.

తొలి పాట.. చివరి పాట..
'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంలో పాడింది ఆయన తొలిపాట అయితే.. 'పలాస 1978'కి పాడింది చివరి పాట. కన్నడలో కూడా చివరిగా పాడిన పాటలో బాలు చేసిన మిమిక్రీ నమ్మశక్యం కాదు. అదే ఆయనకున్న అరుదైన కళ.1966 డిసెంబర్‌ 15న తొలిపాట రికార్డింగ్‌ జరిపినప్పటి నుంచి నేటివరకూ ఆయన ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 16 భాషల్లో పాడారు. అల్లూరి సీతారామరాజుకు పాడిన అదే గొంతు అల్లు రామలింగయ్యను అనుకరించగలదు. హాస్యాన్ని పండించగలదు. అల్లరి పాటలతో తుంటరి మాటలు పలికించిన గళంతోనూ సంప్రదాయ సంగీతం... అన్నమయ్య కీర్తనల్లో ఆ ఆర్తినీ ఆలాపించగలరు. ఆయన పాట వేల సంఖ్యల్లోకి చేరి, ఉన్నతశిఖరాలను అధిరోహించింది. పాటలొక్కటే పాడి, గాయకుడిగానే మిగిలిపోతే బాలూ అందరిలో ఒకరయ్యేవారు. తన గాత్రంతో పాటకు కొత్త సొబగులను తెచ్చారు బాలు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో పాటలు పాడిన ఆయన.. సినీ సంగీత అభిమానులను ఓలలాడించారు. సుమారు 40 వేల పాటలు విభిన్న భాషల్లో పాడారు. భారతీయ సినీ ప్రపంచంలో ఇంకెవరికీ సాధ్యం కాని చరిత్రను సృష్టించారు. ఆయన చివరిసారిగా పాడిన పాట 'పలాస 1978' సినిమాలోని 'ఓ సొగసరి'. లక్ష్మీ భూపాల్‌ రాసిన పాటను రఘు కుంచె స్వరపరిచారు. బాలు, బేబి ఆ పాట పాడారు.

అనేక అవార్డులు
ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ప్రతిభకు భాఅనేక అవార్డులురత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన 'పద్మభూషణ్‌', 'పద్మశ్రీ' అవార్డులు లభించాయి. ఆరు జాతీయ పురస్కారాలు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది పురస్కారాలు, ఒక ఉత్తరాది ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నారు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన 'శంకరాభరణం' చిత్రానికి ఆయనకు తొలి జాతీయ పురస్కారం లభించింది. 1981లో 'ఏక్‌ దూజే కే లియే' చిత్రంతో బాలీవుడ్‌లో ప్రవేశించి, రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత 'సాగర సంగమం' (1983), 'రుద్రవీణ' (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 'సంగీత సాగర గానయోగి పంచాక్షర గవారు (కన్నడ), 'మిన్సర కన్నవు' (తమిళం), (తెలుగులో మెరుపుకలలు) చిత్రాలకు జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. 'మైనే ప్యార్‌ కియా' చిత్రానికిగానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం సహా, ఎనిమిది 'నంది' అవార్డులు బాలు సొంతమయ్యాయి. 'రుద్రవీణ' వంటి సినిమాల్లోని పాటలు ఇప్పటికీ అపూర్వమైన సాహిత్యంతో చరిత్రలో నిలిచిపోయేవి. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయనటుడిగా 'నంది' పురస్కారాలు అందుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ వరించింది. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది.

పాడుతూ తీయగా....పాడుతూ తీయగా....
గానామృతాన్ని పంచి, నటనా ప్రతిభను ప్రదర్శించి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా వైవిధ్యతను వెలికితీసిన బాలు.. 'పాడుతా తీయగా' కార్యక్రమంలో గొప్ప వ్యాఖ్యాత అయ్యారు. తన మాట కోసం.. పాట కోసం.. పాఠం కోసం.. అనేకమంది వారం వారం ఆ కార్యక్రమం కోసం ఎదురుచూసేలా దాని ప్రతిష్టను పెంచింది బాలూనే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన గాయనీ గాయకులను వెలుగులోకి తెచ్చారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమంలో అనేక రూపాల్లో, వివిధ వయసుల వారితో ప్రేక్షకులను రంజింప చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఈ 'పాడుతా తీయగా' నిర్వహించి, ప్రపంచ వ్యాపితంగా తెలుగు పాటకు వన్నె తెచ్చారు బాలు. అక్కడున్న తెలుగువారిని, తెలుగు పాటను ప్రపంచానికి చూపించారు.

డబ్బింగ్‌లోనూ 'నంది' అవార్డు
గాయకుడిగా తీరిక లేకుండా ఉన్న ఎస్పీ బాలు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ (గాత్రదానం) కావడం యాదృచ్ఛికంగా జరిగింది. కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన 'మన్మథలీల' చిత్రానికి తెలుగులో కమల్‌హాసన్‌కు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా ఆయన డబ్బింగ్‌ కెరీర్‌ మొదలైంది. ఆ గొంతు అచ్చం కమల్‌హాసన్‌దే అనిపించేంత డబ్బింగ్‌ చెప్పడం బాలు ప్రత్యేకత. ఆయన పాటల్లో కూడా కధానాయకుల గాత్రానికి అనుగుణంగా పాడేవారు. ఆ తర్వాత రజనీకాంత్‌, విష్ణువర్థన్‌, సల్మాన్‌ఖాన్‌, కె.భాగ్యరాజా, మోహన్‌, అనీల్‌ కపూర్‌, గిరీశ్‌ కర్నాడ్‌, జెమినీ గణేశన్‌, అర్జున్‌, నాగేశ్‌, కార్తీక్‌, రఘువరన్‌కు ఆయన డబ్బింగ్‌ చెప్పారు. 'దశావతారం'లో కమల్‌ నటించిన ఏడు పాత్రలకూ బాలూనే డబ్బింగ్‌ చెప్పడం గొప్ప విషయం. 'అన్నమయ్య'లో వెంకటేశ్వరస్వామి పాత్ర పోషించిన సుమన్‌కు డబ్బింగ్‌ చెప్పి 'ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌'గానూ 'నంది' అవార్డు అందుకున్నారు. అటెన్‌ బరో దర్శకత్వంలో వచ్చిన 'గాంధీ' చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించిన కింగ్‌ బెన్‌స్లేకు బాలూనే డబ్బింగ్‌ చెప్పారు.

నటునిగా.. నిర్మాతగా..నటునిగా.. నిర్మాతగా..
తెర వెనుక తన సుమధుర గానంతో వైవిధ్యభరితంగా అలరించిన బాలసుబ్రహ్మణ్యం... నటుడిగా తెరపైనా అంతే వైవిధ్యాన్ని ప్రదర్శించారు. 'ప్రేమికుడు', 'రక్షకుడు', 'పవిత్ర బంధం', 'మిథునం' తదితర చిత్రాల్లో ఆయన నటనా ప్రతిభను, వైవిధ్యతను చూడొచ్చు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన 'దేవదాస్‌'లో బాలు తళుక్కున మెరిశారు. 1969లో 'పెళ్ళంటే నూరేళ్ళ పంట' అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ 'కేలడి కన్మణి'లో కథానాయకుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో 'ఓ పాప లాలీ' పేరుతో అనువాదం అయింది. దానిలో 'మాటే రాని చిన్నదాని' అనే పాట ఆయనే గుక్క తిప్పుకోకుండా పాడి రికార్డు సృష్టించారు. తర్వాత 'పవిత్ర బంధం', 'దేవుళ్లు', 'మిథునం' వంటి పలు చిత్రాల్లోనూ నటించారు. కమల్‌హాసన్‌కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీదున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిన 'శుభ సంకల్పం' ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది.

కోదండపాణే వెలుగు దారి
బాలు సగర్వంగా ఎప్పుడూ చెప్పే మాట ఒకటుంది. ''కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద ఎంత నమ్మకమో! నా మొదటిపాట రికార్డు చేసిన టేప్‌ చెరిపేయకుండా సంవత్సరం పాటు అలాగే ఉంచేట్లు చేశారు. ఏ సంగీత దర్శకుడు అక్కడికొచ్చినా వారికి ఆ పాట వినిపించి, నాకు అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి రుణం నేను తీర్చుకోలేను'' అని బాలు అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉండేవారు. నిజంగానే ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకి 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' సినిమాలో తొలిసారి పాడే అవకాశం కల్పించారు. 'ఏమి ఈ వింత మోహం' అనే పాటను కోదండపాణి వారం పాటు బాలుతో ప్రాక్టీసు చేయించారు. చివరకు అది తనొక్కడే పాడే పాట కాదనీ, నలుగురు గాయకులతో కలిసి పాడేదని తెలుసుకున్నారు. అలా పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌ ప్రముఖ గాయకులతో కలిసి బాలు తొలిపాట పాడారు. విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో 1966, డిసెంబరు 15న ఆ పాట రికార్డు చేశారు. పాట మొదటి టేక్‌లోనే ఓకే కావడం బాలుకు చాలా ఆనందం కలిగించింది. 1967, జూన్‌ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు బాలు ప్రభంజనానికి తొలి అడుగు వేయించింది. అలా మొదలైన బాలు పాటల ప్రస్థానం వందలు.. వేలు దాటింది.

మూడు తరాల ముచ్చట
సినీ స్వర్ణయుగంగా పేర్కొనే సంగీత దర్శకుల సారథ్యంలో పాటలు పాడే అరుదైన అవకాశం బాలసుబ్రహ్మణ్యానికి దక్కింది. 1969 నుంచే బాలు బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన పాటలు యువతను విశేషంగా ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. దాంతో మూడు తరాల సంగీత దర్శకుల, కథానాయకులకు బాలు పాటలు పాడారు. సంగీత దర్శకులు పెండ్యాల, సత్యం, తాతినేని చలపతిరావు, మాస్టర్‌ వేణు, ఆదినారాయణ రావు, టి.వి.రాజు, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, ఇళయరాజా, జి.కె. వెంకటేష్‌, రమేష్‌నాయుడు, అశ్వత్థామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి వంటి వారి వద్ద బాలు కొన్ని వేలల్లో మధురమైన మరుపురాని పాటలు పాడారు. అలాగే నాటి నేటి కథానాయకులు అందరికీ బాలు పాటలు పాడారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ సహా ఈ తరంలోని అగ్ర కథానాయకులందరికీ ఆయన పాడారు.

తొలుత నాటకాలు.. ఆపై పాటలు ...
శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో పనిచేసే జి.వి. సుబ్రహ్మణ్యం అనే మాస్టారు బాలుతో 'చెంచులక్ష్మి' సినిమాలో సుశీల ఆలపించిన 'పాలకడలిపై శేషతల్పమున' అనే పాటను పాడించి, టేప్‌ రికార్డు చేశారు. బాలుకు అదొక అపూర్వమైన అనుభూతి. మరో మాస్టారు రాధాపతి ప్రోత్సాహంతో 'ఈ ఇల్లు అమ్మబడును', 'ఆత్మహత్య' వంటి నాటికల్లో నటించి, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ చదివేటప్పుడు మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర పోషించే అవకాశం లభించింది. ఆ తర్వాత విజయవాడ ఆకాశవాణిలో బాలూనే స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఒక లలిత గీతానికి బహుమతి లభించింది. పీయూసీ పరీక్షలు రాసి, నెల్లూరు వెళ్లాక బాలు ఒక బృందాన్ని తయారుచేశారు. మిత్రులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. ఆ తర్వాత అనంతపురంలో ఇంజనీరింగ్‌లో చేరి, అక్కడి వాతావరణం నచ్చక మళ్లీ నెల్లూరు వచ్చేశారు. మళ్లీ మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యకు సరిసమానమైన ఎఎంఐఇలో చేరారు. అక్కడ చదువుతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు లభించాయి. 'మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌' అనే చిత్రంలో రమాప్రభ పుట్టినరోజు వేడుకల్లో 'హ్యాపీ బర్త్‌ డే టు యూ' అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరపై తళుక్కుమన్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి, తనలోని నటనా ప్రతిభనూ ప్రదర్శించారు.

- శాంతిశ్రీ
8333818985