Nov 20,2023 17:43

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటించిన సినిమా “ది ట్రయల్”. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. “ది ట్రయల్” చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా రూపొందించారు దర్శకుడు రామ్ గన్ని. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్ని “ది ట్రయల్” సినిమా హైలైట్స్ ఇంటర్వ్యూలో తెలిపారు.

నా పూర్తి పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. కాలేజ్ లో చదువుకుంటున్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎస్ ఐ పరీక్ష రాసి జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ గా సెలెక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకు పదేళ్లు ఆ జాబ్ చేశాను. సినిమాల మీద ప్యాషన్ తో ఆ జాబ్ కు రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. సాధారణంగా జాబ్ వదులుకుని సినిమాల్లోకి వస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ నా ప్యాషన్ చూసి కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చి సెహరీ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. అప్పుడే “ది ట్రయల్” కథ రాసుకోవడం ప్రారంభించా.

డిప్యూటీ జైలర్ గా నా పదేళ్ల కెరీర్ లో ఎన్నో క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి, ఆ క్రైమ్స్ చేసి ఖైదీలుగా ఉన్న వారి కథలను విన్నాను. వాటి ఇన్సిపిరేషన్ “ది ట్రయల్” కథలో కొంత ఉంది గానీ మొత్తం ఒకరి లైఫ్ స్టోరి కాదు. ఫారిన్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మన దగ్గర అన్వయించుకుంటే ఎలా ఉంటుందని ఫిక్షనల్ గా రాసుకున్న స్టోరి ఇది.

“ది ట్రయల్” సినిమాను టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అని ఎందుకు అంటున్నాం అంటే..ఇప్పటిదాకా మన సినిమాల్లో ఇంటరాగేషన్ సీన్స్ ఉన్నాయి గానీ మొత్తం సినిమా ఇంటరాగేషన్ మీద తీయలేదు. “ది ట్రయల్” సినిమాలో ఇంటరాగేషన్ రూమ్ నుంచి కథ మొదలై…అదే గదిలో ముగుస్తుంది.

మీరు “ది ట్రయల్” సినిమా ట్రైలర్ లో చూసినట్లు ఒక జంట తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అబ్బాయి ఒక సర్ ప్రైజ్ ఉంది కళ్లు మూసుకోమని చెబుతాడు. ఆ అమ్మాయి కళ్లు తెరిచే లోగా అబ్బాయి బిల్డింగ్ మీద నుంచి కిందపడి చనిపోతాడు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనే అంశంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంటరాగేషన్ ఆఫీసర్  విచారణ చేస్తున్నది ఒక మహిళ ఎస్ ఐని అయితే వారి మధ్య సంభాషణ ఎంత టఫ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి.

మొదట “ది ట్రయల్” సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. అయితే ఓటీటీకి ఇవ్వాలంటే థియేటర్ రిలీజ్ కంపల్సరీ అంటున్నారు. మా సినిమాకు విచారణ అని పేరు పెట్టుకోవచ్చు కానీ ది ట్రయల్ అనేది యాప్ట్ అనిపించింది. మా సినిమాలో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. సేవ్ ది క్యాట్, అకిరా కురసోవా రూపొందించిన రాషోమన్ వంటి సినిమాల్లో భార్య భర్తలు ఇద్దరే ఉన్నప్పుడు భర్త చనిపోతే.. ఆ కేసులో విచారణ చేయాల్సింది కేవలం భార్యనే. ఎందుకంటే ఆ టైమ్ లో అక్కడున్న సాక్షి ఆమె మాత్రమే. అకిరా కురసోవా రాషోమన్ సినిమాలో ఆ భార్యను ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు భర్త డైరీ చదువుతుంటారు. ఆ డైరీలోని అంశాల ఆధారంగా క్వశ్చన్ చేసినప్పుడు ఇచ్చే ఆన్సర్ తో బ్యాక్ గ్రౌండ్ సీన్స్ మారిపోతుంటాయి. అడివి శేష్ ఎవరు సినిమా కూడా ఇదే స్ట్రక్చర్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. మా సినిమాలో కూడా అదే ఫాలో అయ్యాం. అయితే ప్రెజెంటేషన్ ఆఫ్ ది మూవీ కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది.

ఎస్ఐ రూప క్యారెక్టర్ కోసం స్పందన పల్లిని తీసుకోవడానికి కారణం ఆమె హైట్. చూడగానే ఎస్ ఐ అంటే నమ్మేలా ఉండాలి. స్పందన ఈ క్యారెక్టర్ కు యాప్ట్ అనుకున్నాం. సెహరీ మూవీ ప్రొడక్షన్ హౌస్ వర్గో పిక్చర్స్ లో నేను ఒక వెబ్ సిరీస్ కు అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ సినిమా వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ఈ మూవీ మొదలుపెట్టాను. ఇందులో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నా..ఫాంటసీ ఉంటుంది. ఫాంటసీ యాడ్ చేయకుంటే సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండదు.

మా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ..ఇలా టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. సినిమా నిడివి 1 గంట 39 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాంతో సినిమా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టినట్లే క్రిస్ప్ గా ఉంటుంది. ఎక్కడా విసుగు రాదు. పీవీఆర్ ద్వారా “ది ట్రయల్” రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాం. ఒక మెసేజ్ కూడా ఉంటుంది. బిజినెస్ కోసం వేసిన షోస్ చూసిన వాళ్లకు కూడా బాగా నచ్చింది. సినిమా బాగుందని మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

ప్రస్తుతం వర్గో పిక్చర్స్, జీ 5 వాళ్ల ప్రాజెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత డార్క్ హ్యూమర్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నా అలాగే సూపర్ హీరో కథ ఒకటి రెడీ చేస్తున్నాను