Nov 01,2021 00:00

అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత కార్యక్రమం నేడు (సోమవానం) ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నెల్లూరులో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి భాగస్వామ్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందన అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో వారిని భాగస్వాములను చేయవచ్చని, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రధానోపాధ్యాయులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు ఆదివారం ఆదేశాలు అందాయి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్ధుల తల్లులకు ఈ పథకం కింద రాష్ట్రప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 44,00,891 మంది తల్లులు ఈ పథకానికి అర్హులని పాఠశాల విద్యాశాఖ తేల్చింది. గత ఏడాది 42,24,302 మందికి ఈ పథకం వర్తింపచేయగా, ఈ ఏడాది అదనంగా 1,76,589 మందిని అర్హుల జాబితాలో చేర్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల తల్లులకు రూ.14వేలే వారి ఖాతాల్లో జమకానున్నాయి. రూ.1000లను మరుగుదొడ్ల నిర్వహణ కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు కోత పెట్టనుంది. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మాత్రం యధాతధంగా రూ.15వేలు జమకానున్నాయి.