Nov 01,2022 18:39

ప్రముఖ నటి సమంత 'మయోసిటిస్‌' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. 'ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నానని.. త్వరలోనే కోలుకుంటానని' సమంత తన ట్వీట్‌లో పేర్కొంది. దీంతో మయోసిటిస్‌ అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ అరుదైన వ్యాధి ఏ వయసు వారికి వస్తుంది? ఎలాంటి లక్షణాలు వుంటాయి? దానికి ఎలాంటి చికిత్స అందిస్తారు? వంటి అనేక సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో మయోసిటిస్‌ వ్యాధికి సంబంధించిన పలు విషయాలను మణిపాల్‌ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ డి.ఎస్‌ భకుని మాటల్లో తెలుసుకుందాం...

- మయోసిటిస్‌ అంటే..?
మయోసిటిస్‌ కండరాలకు సంబంధించిన వ్యాధి (ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌). ఈ వ్యాధి కండరాల వాపును సూచిస్తుంది. ఈ వ్యాధికి గురైన వారు మొదట నడవలేక చాలా ఇబ్బంది పడతారు. అలాగే కూర్చున్న చోట నుంచి కూడా పైకి లేవలేరు. మోచేతుల దగ్గర నొప్పిగా ఉంటుంది. మోచేతిని కదిలించాలన్నా చాలా బాధపడతారు. ఆ తర్వాతర్వాత ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని మింగలేరు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.
ఈ వ్యాధిలో రెండుమూడు రకాలున్నాయి. చర్మంపై దద్దుర్లు వస్తే దాన్ని డెర్మాటో మయోసిటిస్‌ అంటారు. ఈ వ్యాధికి గురైన వారికి కనురెప్పలపైనా, నుదుటిపైనా దద్దుర్లు వస్తాయి. మొదటిది చర్మానికి సంబంధించినది అయితే... రెండోరకం కేవలం కండరాలకు మాత్రమే వస్తుంది. ఇక మూడవది ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసిటిస్‌ (ఐబిఎం) అని పిలుస్తారు. ఇది తొడ కండరాలను, ముంచేతి కండరాలను, మోకాలి కింద కండరాలను ప్రభావితం చేస్తుంది. అయితే మూడోరకపు వ్యాధి చాలా అరుదుగా వస్తుంది అని డాక్టర్‌ భకుని అన్నారు.

- వేటివల్ల ఈ వ్యాధి వస్తుంది?
సాధారణంగా జలుబు, దగ్గులకు కారణమయ్యే వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా మయోసిటిస్‌ వ్యాధికి కారణం కావచ్చు. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు కావచ్చు.. లేదా హృద్రోగ సమస్యలకు వాడే మందులు కావొచ్చు... వైరస్‌ల వల్ల కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశముంది. ఇక శరీర సామర్థ్యానికి మించి అల్కాహాల్‌ సేవించడం, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశముంది.

- ఏయే వయసుల్లో వారికి వస్తుంది?
ఈ వ్యాధి ఏ వయసులోని వారికైనా వస్తుంది. మరీ చిన్న వయసు వారిలోనూ.. లేదా 16 ఏళ్ల వయసులో ఉన్నవారికి వచ్చే ఈ వ్యాధిని జువైనల్‌ మయోసిటిస్‌ అంటారు. సహజంగా ఈ వ్యాధి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకు వస్తుంది. అయితే ఈ వయసులో వచ్చిన వారికి క్యాన్సర్‌ సోకే ప్రమాదముంది. ప్రత్యేకించి క్యాన్సర్‌ సోకిందా లేదా అని నిర్థారించుకోవడానికి పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది. ఈ పరీక్షల ద్వారానే మయోసిటిస్‌ వ్యాధి ద్వారా దాదాపు 30 శాతం మందికి క్యాన్సర్‌ సోకే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

- చికిత్స ఎలా చేస్తారు?
ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల కండరాలు సహకరించవు. రోగుల రోగనిరోధకశక్తిని బట్టి.. చికిత్స చేయడం జరుగుతుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని, వ్యాధి తీవ్రతను పరిశీలించి.. ముందుగా స్టెరాయిడ్‌ థెరపీ చేస్తారు. అయితే స్టెరాయిడ్లు దుష్ప్రభావాలకి గురిచేస్తాయి. అందుకే వ్యాధి తీవ్రతను బట్టే స్టెరాయిడ్‌ థెరపీ చేయడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స తీసుకునేవారి ముఖ్యంగా అల్కాహాల్‌, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలను తీసుకునే అలవాటు వుంటే, వెంటనే మానుకోవాలి. లేకుంటే చికిత్స చేసినా ప్రయోజనం ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.