లండన్ : హిందూ విశ్వాసం తనను జీవితంలో ముందుకు నడిపిస్తోందని బ్రిటన్ ప్రధాని రిషిసునక్ తెలిపారు. బ్రిటన్ ప్రధానిగా అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. మంగళవారం కేంబ్రిడ్జీ యూనివర్శిటీలోని జీసెస్ కాలేజీలో ఆధ్యాత్మికవేత్త మోరారి బాపు నిర్వహించిన 'రామ కథా' కార్యక్రమానికి రిషిసునక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ''బాపు... నేను బ్రిటన్ ప్రధానిగా కాదు.. ఓ హిందువుగా ఇక్కడికి వచ్చాను. నా ఉద్దేశంలో విశ్వాసం అనేది వారివారి వ్యక్తిగతం. ఈ విశ్వాసం నన్ను ముందుకు నడిపిస్తుంది. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం నాకు లభించిన గొప్ప గౌరవం. అయితే ఆ బాధ్యతలు నిర్వహించడం అంత తేలిక కాదు. ఒక్కోసారి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఆ సమయంలో నా విశ్వాసమే నాకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. దేశం కోసం ఉత్తమంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది'' అని అన్నారు. తన కార్యాలయంలో బంగారపు గణేశుని విగ్రహం ఉంటుందని, ఏ పనిచేసే ముందైనా వాటి గురించి అంచనా వేయాలని, వాటి గురించి ముందే తెలుసుకోవాలని తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సౌథాంప్టన్‌తో తన బాల్యం, తల్లిదండ్రులతో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. మన ఉన్నతి కోసం రాత్రి పగలు తేడా లేకుండా తమ జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇప్పుడు మనం భవిష్యత్ తరానికి అందించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాముడు తన జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తారని చెప్పుకొచ్చారు.