Sep 30,2023 22:25
  • వడ్డే శోభనాద్రిశ్వర రావు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్
  • ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ.
  • సంస్మరణ సభలో నివాళులర్పించిన  వివిధ  రైతు, ప్రజా సంఘాల నాయకులు.
  • కేంద్ర వ్యవసాయ పరిశోధన కేంద్రానికి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరు పెట్టాలని తీర్మానం

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : భారతదేశ ప్రజలకు ఆహార కొరత తీర్చిన గొప్ప మానవతావాది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు అన్నారు. శనివారం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఉన్న  కేబీ భవన్  ( ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కార్యాలయం ) వద్ద  హరిత పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సమస్మరణ సభ  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో  జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  సీనియర్ నాయకులు వై కేశవరావు అధ్యక్షతన జరిగిన  ఈ సంస్మరణ సభకు  సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వర రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.  ముందుగా డాక్టర్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా ఇరిగేషన్ ఇంజనీర్ చెరుకూరి  వీరయ్య చౌదరి, రైతాంగ  ఉద్యమ నాయకులు  ఎర్నేని నాగేంద్రనాథ్  చిత్రపటాలకు వివిధ ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోభనాద్రిశ్వర రావు మాట్లాడుతూ ఈనాడు భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు  ఆహార సమకూర్చడమే కాక, ఇతర దేశాలకు గోధుమలు, వరి, వంటి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు కారకుడైన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గొప్ప మానవతావాదిగా చరిత్రలో నిలిచిపోయారని  ఆయన అన్నారు. అదేవిధంగా  సీలింగ్ భూములు, బంజర భూములు పేదలకు సాగు చేసుకునేందుకు కారకుడైన వ్యక్తి స్వామినాథన్ అన్నారు. పంటల నష్టపోయిన రైతాంగానికి రుణాలు, వడ్డీలు మాఫీ చేయాలని తన పరిశోధన ద్వారా చెప్పారన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆయన సమస్యలను అధ్యయనం చేసి చెప్పారు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి, అభివృద్ధి అంటే పంటలు ఎన్ని క్వింటాలు పండాయి అనేది కాకుండా రైతుల ఆదాయం ఏ మేరకు పెరిగిందో కొలమానంగా తీసుకోవాలని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త అన్నారు. అదేవిధంగా పేదవాడి ఆకలి తీరాలని, రైతులు ఆత్మగౌరవంతో  బతకాలని ఆలోచించిన  మహోన్నతమైన  స్వామినాథన్  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, స్వయంగా పరిశీలించి, తన అధ్యయనం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కమిటీ రిపోర్టును అందజేశారని  ఆయన అన్నారు.  రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారన్నారు. వ్యవసాయ రంగాలకు ఇరిగేషన్, డ్రైనేజీ  రంగాలకు నిధులు ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వాలకు స్వామినాథన్ కమిటీ  సూచించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడే ఆదివాసీలు, మహిళా రైతులను సైతం  ప్రభుత్వాలు ఆదుకోవాలని, పేదవాడి ఆకలి గురించి తపన పడిన  స్వామినాథన్ ధన్యజీవన్నారు. స్వతంత్ర భారతదేశంలో వ్యవసాయ రంగం  అభివృద్ధి చెందాలని సూచించిన గొప్ప శాస్త్రవేత్త స్వామినాథన్ స్ఫూర్తితో  రైతు సంఘాలు, కిసాన్ మోర్చా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సామాన్య రైతుల పట్ల స్పృహ ఉన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  వి శ్రీనివాసరావు అన్నారు. ఆహార కొరత సమస్యను పరిష్కరించేందుకు, రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసిన  ఎమ్మెస్ స్వామినాథన్  భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అన్నారు. ఆహార కొరతతో ఉన్న దేశాన్ని సమృద్ధిగా ఆహార నిల్వలు చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా  స్వామినాథన్ కృషి చేశారని  ఆయన కొనియాడారు. అదేవిధంగా నేడు  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని  ఆయన విమర్శించారు. ఆహార నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్న పేదలకు పంచేందుకు  సుముఖంగా లేవన్నారు. వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు  అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. హరిత విప్లవం తీసుకువచ్చిన  దేశంలోనూ రాష్ట్రంలోనూ  కొన్ని ప్రాంతాలు వ్యవసాయ రంగంలో వెనకబడి ఉన్నాయన్నారు. ఒక విప్లవాత్మక ఫార్ములాను తీసుకువచ్చి ప్రజలందరి మధ్య సజీవంగా డాక్టర్ స్వామినాథన్ నిలిచిపోయారన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా డాక్టర్ స్వామినాథన్ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వాలపై  పోరాటాలు చేయాలన్నారు. దేశంలో బహుళ జాతి కంపెనీలు విత్తనాలపై ఆధిపత్యం చేస్తున్నాయన్నారు. రైతంగ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని  శ్రీనివాసరావు అన్నారు. అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కుటుంబం,  అల్లుడు ప్రముఖ శాస్త్రవేత్తగా  అభ్యుదయ భావాలతో సేవలు అందిస్తున్నారని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా విశిష్ట సేవలు అందించిన  డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరును  వ్యవసాయ పరిశోధన కేంద్రానికి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త వంగడాలు తయారు చేయడంలోనూ  గొప్ప వ్యక్తిగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నిలిచిపోయారని   సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వేణుగోపాలరావు అన్నారు. స్వాలంబన అంటే వ్యవసాయం అని నిర్వచనం చెప్పిన ఏకైక వ్యక్తి  స్వామినాథన్ అన్నారు.వ్యవసాయ రంగం లో గొప్ప పరిశోధనలు చేసాడన్నారు.రైతు వ్యవసాయ రంగాన్నే కాక, పర్యావరణాన్ని, దేశాన్ని కాపాడుతున్నారని ఆయన అన్నారు.పేదరికం, వ్యవసాయ రంగాలపై విశేషంగా పరిశోధన చేసిన డాక్టర్ స్వామినాథన్  మృతి దేశానికి  తీరని లోటని  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత  రైతులు ఆత్మహత్యలు పెరిగాయని,  వ్యవసాయం సంక్షేభంలో పడిందన్నారు. దేశాన్ని వ్యవసాయ కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంగం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.శివ నాగరాణి  ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ నాయకురాలు  ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నరసింహారావు,తెలుగు రైతు నాయకులు నరేంద్ర, రైతు నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు వెంకటరెడ్డి,  తెలుగు రైతు నాయకులు కళ్ళం  రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జొన్న శివశంకరరావు, కంచుమాటి అజయ్ కుమార్,  రైతు నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, ములక శివ సాంబిరెడ్డి, కౌలు రైతు సంఘం   జిల్లా కార్యదర్శి బైరు గాని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా రైతు సంఘం నాయకులు ఆంజనేయులు, రైతు సంఘం తాడేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు మోదుగుల శ్రీనివాసరెడ్డి, కాజా వెంకటేశ్వరరావు, శివరామకృష్ణయ్య, ఆళ్ల సాంబిరెడ్డి, బి శివారెడ్డి, పల్లె కృష్ణ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ms-swaminadhan-memorial-meet-in-tadepalli