Oct 14,2023 14:53

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : దళిత వర్గంలోని అన్ని కులాల సామాజిక న్యాయం, వర్గీకరణ సాధన కోసం దళిత వర్గాల పక్షాన ఈ నెల ఏడవ తేదీ నుంచి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు చేపట్టనున్న విశ్వరూప మహాపాదయాత్రను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చేమూరు వెంకటేష్, మందా శ్రీనివాసులు, మందా శివయ్య, జడ శివ లు పిలుపునిచ్చారు. శనివారం పట్టణ పరిధిలోని ఎర్రబల్లి రామాలయంలో విశ్వరూప మహాసభకు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ వల్ల దశాబ్దాలుగా విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో తీవ్రంగా నష్టపోయిన మాదిగలు ఉపకులాల పక్షాన నిలబడి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరపాలని ఎమ్మార్పీఎస్ 20 సంవత్సరాలుగా ఉద్యమిస్తోందన్నారు. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి 2004 నవంబర్ 5 వరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగిందని, వర్గీకరణ జరిగిన నాలుగేళ్లలోనే మాదిగ మరియు ఉప కులాల విద్యార్థులకు విద్యారంగంలో ఉన్నత విద్యా అవకాశాలు రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ రంగంలో వేలాది ఉద్యోగాలు లభించాయని తెలిపారు. అప్పుడప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న మాదిగ మరియు ఉప కులాల అభివృద్ధికి అడ్డుపట్ట వేస్తూ కొంతమంది స్వార్థపర శక్తులు సాంకేతిక కారణాల సాకుతో సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ ను 2004 నవంబర్ 5 న అడ్డుకట్ట వేశారని అన్నారు. వాటి నుండి నేటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మాదిగ మరియు ఉప కులాల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. ఆనాటి నుండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ ఆధ్వర్యంలో వర్గీకరణ సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేయడం జరుగుతోందని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి.. ఎస్సీ వర్గీకరణ అనుకూలమంటూనే జాప్యం చేస్తున్న పాలకవర్గాల మీద బలమైన నిరసనను వ్యక్తం చేయడానికి, మాదిగల ఐక్యతను, సంకల్ప బలాన్ని విశ్వరూపంగా ప్రదర్శించడానికి మందకృష్ణ ఆధ్వర్యంలో అలంపూర్ నుండి హైదరాబాదు వరకు ఈ నెల ఏడవ తేదీ నుండి నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్న విశ్వరూప మహా పాదయాత్రకు ఇల్లు, ఇల్లు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు మదనపల్లి పెంచలయ్య వడ్డెర, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మినుకు ఆదెయ్య, రేవూరి గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.