
దేశంలో బిజెపి ఏలుబడిలో అప్రజాస్వామిక, అనైతిక రాజకీయం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నది. బిజెపి ఇలాంటి ప్రతీకార రాజకీయాలను ఇప్పటికే దేశవ్యాప్తం చేసింది. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి... తమ పార్టీ లోకి వలసలను ప్రోత్సహించడానికి...విననివారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ...ఇ.డి, ఐ.టి, ఎన్ఐఏ, సిబిఐలను వినియోగించుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. 2014 తర్వాత ఈ సంస్థల కార్యకలాపాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. బిజెపి అధికారంలోకి వచ్చాక సిబిఐ 115కి పైగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 120 మందికి పైగా రాజకీయ నేతలపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తుండగా, ఇందులో 115 మంది ప్రతిపక్షనేతలే. ఈ సంస్థలు ప్రతిపక్షాలకు చెందిన నాయకులను టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, 'ఆప్' కీలక నాయకులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, జార్ఖండ్ సి.ఎం హేమంత్ సొరేన్, శివసేన కీలక నేత సంజరు రౌత్, ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్, రాజస్థాన్ సి.ఎం అశోక్ గెహ్లాట్, సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ వంటి నేతలను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెట్టింది. కర్నాటకలోనూ కాంగ్రెస్ జేడీయూ కీలక నేతల ఇళ్లపై ఐ.టి దాడులు నిర్వహించింది. మరోవైపు బిజెపి విధానాలను తీవ్రంగా విమర్శించే దాదాపు 20 మంది మేధావులు, ప్రొఫెసర్లు, పౌర హక్కుల నేతలను ఎన్ఐఏ అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. ఇంకా నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతు సంఘాల నేతలకు ఉగ్రవాదులతో సంబంధాలు వున్నాయంటూ ఎన్ఐఏ టార్గెట్ చేసింది. అయితే వేధించడమే తప్ప ఇ.డి నమోదు చేస్తున్న కేసుల్లో కన్విక్షన్ రేటు (ముద్దాయిలకు శిక్ష పడటం) మూడు శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే బిజెపి ఇలా ప్రతీకార రాజకీయాలను పాల్పడుతున్నందున ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాలు సిబిఐకి యథేచ్ఛగా ప్రవేశించే సాధారణ అనుమతిని రద్దుచేశాయి.
- మీడియా పైనా....
మీడియాను తన గుప్పిట ఉంచుకోవడానికి బిజెపి మీడియా సంస్థలపై కూడా సిబిఐ, ఇ.డి, ఐటీ లతోపాటు స్థానిక పోలీసులను దాడులకు ఉసిగొల్పుతున్నది. గతంలో ఎన్డి టీవీని టార్గెట్ చేసి, ఆ సంస్థ యజమానులు ప్రణరు రారు, రాధికా రారుపై కేసులు నమోదు చేసింది. బిజెపి కి నచ్చని కథనాలు రాసినందుకు ''ద వైర్'' న్యూస్ వెబ్సైట్ ఎడిటర్లు కె.వేణు, జాహ్నవి సేన్, వ్యవస్థాపకుడైన సిద్ధార్థ వరదరాజన్ ఇళ్లలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. డిజిటల్ మీడియాను సైతం తన నియంత్రణలో ఉంచేందుకు బిల్లులను తీసుకొస్తున్నది. అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛ సూచీని పరిశీలిస్తే 180 దేశాలకు గాను భారత ర్యాంకు 150. అదే 2021లో ఇది 142గా ఉంది. 2016లో 133గా ఉంది.
- బిజెపి లోకి వెళ్లగానే పునీతులు!
ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బిజెపి లోకి వెళ్లగానే పునీతులుగా మారిపోతున్నారు. పార్టీ మారాక ఆ నాయకులపై ఇ.డి, సిబిఐ, ఐటి వంటి సంస్థలు ఎలాంటి దాడులు చేయడం లేదు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, టీఎంసీ సీనియర్లు సువేందు అధికారి వంటి నేతలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. టిడిపి లో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేశ్ అనేక కేసులు ఎదుర్కొన్నారు. వారు బిజెపి లో చేరగానే కేసులన్నీ మాయమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులున్నాయి. 2020 మార్చిలో ఆయన బిజెపి లో చేరగానే ఆ కేసే మూతపడింది. కేంద్రాన్ని ప్రశ్నించేవారిని వేధించడం, తమ పార్టీలో చేరగానే కేసులను పక్కకు పెట్టడం ఆనవాయితీగా మారింది.
ఇప్పుడు టిఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఇ.డి, ఐటీ ని ప్రయోగిస్తున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నది. ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను అటాచ్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును తీసుకొచ్చారు. లిక్కర్ స్కామ్ పేరుతో సిబిఐ కూడా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా... దానికి అనుమతి నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిజెపి కుట్రలపై సిట్ ఏర్పాటు చేసి సంబంధిత బిజెపి నాయకులు, సన్నిహితులకు నోటీసులు జారీ చేస్తున్నది.
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే కెసిఆర్ చూపిస్తున్నటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలు చూపించలేకపోతున్నారు. అదే సమయంలో కేంద్ర సంస్థలన్నీ ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బిజెపి జేబు సంస్థలుగా మారిపోవడం విషాదం. కాగా ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారింది.
- ఫిరోజ్ ఖాన్,
సెల్:9640466464