
ఏమేవ్! ఎక్కడ చచ్చావే... పేపర్లో, టీవీల్లో రాజదండంతో మన ప్రధాని మోడీగారి ఆ రాజవైభోగం చూస్తుంటే... వళ్ళు పులకరిస్తున్నది సుమా! నీవేంటి అసలు ఇదేమీ పట్టనట్టు ఇంటి పని, వంట పని అంటూ అలా అఘోరిస్తే ఎలా..?
భావం-భాష తెలియని మీకూ, మీలాంటి వారికి మీ గొడవ. అది మా బోటి ప్రజలకు ఎందుకండీ..?
ఆ... ఇది మా గొడవా..? మాకు భావం-భాష తెలియదా? ఎంత మాటన్నావ్?. శుభమా అని దేశంలోని అత్యున్నత పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను వేదపండితులు, వేదమంత్రాలు, హోమగుండాల మధ్య ప్రధాని ప్రారంభిస్తే అది నీకు వేళాకోళంగా ఉందా..?
కాకపోతే ఏమిటి? నా పనేదో నా మానాన నేను చేసుకుంటూ ఉంటే ఎక్కడి చచ్చావే అంటూ ఆ పలకరింపు ఏమిటి? నేను చచ్చినదాన్నా..?
ఆ... అదేదో ఊతపదం. దాన్ని పట్టుకుని బట్టతలకు మోకాలుకు ముడి వేస్తావేమిటి?
ముడి వేస్తున్నది మీరు. మీది ఊతపదం కాదు, ఆధిపత్యం. ఎదుటివారు ఏమన్నా, ఏం చేసినా పడి ఉంటారనే అహంభావం. రోజులు మారుతున్నాయనే స్పృహ అస్సలుండదు. ఎంత స్థాయిలో ఉంటే మాత్రం ఏం సుఖం. ఛాదస్త భూతం పట్టాక...
ఎవరికీ నాకా... నా అధినాయకునికా..?
ఇద్దరికీ. లేకపోతే ఏమిటండీ..? మన దేశ ప్రథమ పౌరురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును పిలువక అదేం ప్రారంభమండీ..? ఇప్పుడు...మనది ప్రజాస్వామ్య దేశం. ఏదైనా ఓ చట్టం అమలు కావాలంటే పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో పాటు రాష్ట్రపతి సంతకం కూడా కావాల్నా... అక్కరల్లేదా..? ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడేదెవరండి. రాష్ట్రపతి కాక మరెవరున్నారు? అంతెందుకు మన భారత సైన్య త్రివిధ దళాల అధిపతి కూడా రాష్ట్రపతే కదా..! మరెందుకు పిలవలేదు? భర్త లేని మహిళగా వైధవ్యంతో ఉంది గనుక, మీరనుకునే ఆ శుభకార్యానికి రాకూడదని పిలవలేదా? చెప్పండీ..? ఇదంతా మీడియా కోడై కూస్తున్నా మీరు మాత్రం కిమ్మనరు. పైగా అదేదో గొప్ప కార్యంలా ఊగిపోతారు పోతురాజులా?
మళ్ళీ పోతురాజా..?
సామెతలు ఊరికే రావండీ... తరతరాల అనుభవసారం. తిండికి తిమ్మరాజు.. పనికి పోతురాజు అంటే తిండి ఎక్కువ పని తక్కువ అని అర్థం.
పన్నెండు వందల కోట్లు ఖర్చుపెట్టి పార్లమెంటు భవనం కట్టిస్తే అది గొప్పపని కాదా..?
ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. మీ సొంత డబ్బు కాదు కదా! సొంత డబ్బా కొట్టుకోవడానికి. గొప్ప పని అంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ప్రజల్ని ఉత్నతులుగా తీర్చిదిద్దాలి. ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో ఓ చోట రైతుల ఆత్మహత్యలు, ఆడపిల్లలపై అత్యాచారాలు. అంతెందుకు? ఆ పార్లమెంటు భవనం ప్రారంభం రోజునే పాపం న్యాయం కోసం రోడ్డెక్కిన రెజ్లర్ల పోరాటాన్ని అత్యంత కర్కశంగా అణచివేసారే. కనీసం మీకు ఆడపిల్లలనే సానుభూతైనా ఉన్నదా... అరెరే...
పార్లమెంటు భవనాన్ని ఓ పక్కన ఘనంగా ప్రారంభిస్తుంటే ఆ పక్కనే ఆందోళనలు చేయడం ఏమిటి? ప్రతిష్ట పోదూ..?
మీరూ... మీ ప్రతిష్ట మండిపోనూ... ఆందోళన చేయడం ప్రజాస్వామ్యపు హక్కండీ... అయినా వారేమైనా సామాన్య మహిళలా... ఒలింపిక్స్‌లో మన భారత పతాకాన్ని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన మల్లయోధులండీ...నెల రోజులుగా శిబిరం వేసుకుని నిరసన దీక్ష చేస్తుంటే... మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. నేరం చేసినవాడు మాత్రం మీ పాలకుల అండతో దర్జాగా ఆ పార్లమెంటులోనే కూర్చుంటాడు. మా ఆడవాళ్ళు మాత్రం ఇలా రోడ్లపై పోలీసుల బూటుకాళ్ళ దెబ్బలు తినాలి.
ఇదేంటి నీవు రెజ్లర్లతో కలసిపోతున్నావు?
మీరు పాలక మోడీతో కలిసిపోతున్నప్పుడు నేను పోరాడే రెజ్లర్లతో కలసిపోవడం తప్పా..?
ఆ... ఆ... అన్నీ పోరాటాలు... నిరసనలతోనే తేల్చుకుంటారా ఏంటి?
మరెలా..?
కాస్త సర్దుబాట్లు, క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి గానీ...
హమ్మయ్య, దారికొచ్చారు. అందుకే దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగం చేస్తే... ఆ వీరుల్ని కాదని, ఎవరూ చెప్పని రీతిలో బ్రిటిష్ పాలకులకు క్షమాపణ చెప్పిన సావర్కర్ జన్మదినాన్నే పార్లమెంటు భవన ప్రారంభ రోజుగా మోడీ ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మీరు, మీ నోటితోనే ఇలా చెప్పారు. యద్భావం.. తత్ భవతి. భావాలకు అనుగుణంగానే పనులు. అందుకే రాజదండాన్ని కూడా అణచివేతకు చిహ్నంగా పట్టుకున్నారిప్పుడు.
తప్పు చేసినవారిని రాజులు దండించరా ఏమిటి?
అయ్యో! రాజులు కాలం పోయి చానాళ్ళయింది. జనం ప్రజాస్వామ్యంలోకి వచ్చారు. మీరింకా ఆ... ఆలోచనల్లోకి రాలేదు. ఏం చేస్తాం? కర్మ...కర్మ. అందుకే అన్నాడు ఐన్‌స్టీన్.... ముందుకు చూస్తూ వెనక్కి నడిచేవారు ఎప్పటికైనా వెళ్ళేది అజ్ఞాన గాధంలోకే అని. ఛాదస్తపు లోతులకూ అంతం ఉండదు సుమా. నా దౌర్భాగ్యం ఏమంటే... మీ అధినాయకులతో పాటు మీరూ అదే దారిలో నడవడం...!
- కె. శాంతారావు,
సెల్ : 9959745723