Aug 13,2022 06:59

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వంటి స్వతంత్ర సంస్థలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్న మోడీ సర్కార్‌కు కేరళ హైకోర్టు ఇటీవల చెంప పెట్టులాంటి ఉత్తర్వులను వెలువరించింది. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా స్వతంత్ర సంస్థల ప్రతిష్టతను మసకబారుస్తున్న తరుణంలో కేరళ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న శక్తులకు ఊరటనిచ్చే ఒక మంచి పరిణామం. ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యానిర్వాహక, న్యాయ విభాగాలు ప్రధానంగాలు. వీటి మధ్య సమతుల్యత కోసం రాజ్యాంగ సంస్థలు, మీడియా తదితర విభాగాలు కృషి చేస్తుంటాయి. భారత ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), వంటివి రాజ్యాంగ సంస్థలుగా స్వతంత్రంగా పనిచేయాల్సివుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీటి స్వతంత్రతను హరించివేస్తోంది. సంఫ్‌ు పరివార్‌ నేతలతో వాటిని నింపేసి ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు ఈ సంస్థలను కీలుబొమ్మలుగా మార్చేసుకున్నారు. మహారాష్ట్ర, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇడిని రాజకీయ సాధనంగా చేసుకుని కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని యత్నించిన సంఫ్‌ు పరివార్‌ి హైకోర్టు ఉత్తర్వులతో కంగుతింది.               
               కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డు (కెఐఐఎఫ్‌బి) కేసులో విచారణకు హాజరు కావాలని, ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు, కేరళ మాజీ మంత్రి థామస్‌ ఐజాక్‌కు ఇడి నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక నిర్ధారణేదీ లేకుండానే, కనీసం నేరారోపణ కూడా ఏదీ లేకుండానే ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఎలా కోరతారంటూ విచారణ సందర్భంగా జస్టిస్‌ విజి అరుణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇడిని కడిగిపారేసింది. ఏ కేసులోనూ తాను నిందితుడిగా లేకపోయినా తనతో సహా కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఇడి కోరుతోందని, ఇది తన గోప్యత హక్కును కాలరాయడమేనని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇడిని దుర్వినియోగపరుస్తున్నారంటూ థామస్‌ చేసిన వాదనతో ధర్మాసనం సంపూర్ణంగా ఏకీభవించింది. ధర్మాసనం ఇడిని నిగ్గదీయడంతో ఈ కేసులో థామస్‌ నిందితుడిగా లేరని, ఆయనపై ఇడి చర్యలు తీసుకోబోదని ఇడి తరపున హాజరైన న్యాయవాది సంజాయిషీ ఇచ్చుకోవాల్సివచ్చింది.
            మసాల దినుసుల ఉత్పత్తిలో పేరొందిన కేరళలో అక్కడి వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం స్థానిక పరిశ్రమలకు చేయూతనందించేందుకు 2019లో కెఐఐఎఫ్‌బి ద్వారా మసాల బాండ్లు జారీ చేయాలని సంకల్పించింది. శాసనసభ ఆమోదంతో పాటు రిజర్వుబ్యాంకు కూడా ఇందుకు సమ్మతించింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులకు ఇప్పుడు ఇది ఒక ఊతంగా నిలుస్తోంది. కేరళలో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న మోడీ సర్కార్‌ మసాల బాండ్ల ద్వారా సమీకరిస్తున్న నిధులను కూడా అడ్డుకోవాలన్న దుష్ట తలంపుతోనే ఈ కక్షసాధింపు చర్యలకు దిగింది.
               ఇడిని అడ్డంపెట్టుకొని అటు కెఐఐఎఫ్‌డిపైన, ఇటు సిపిఎం నాయకులపైన బురద చల్లాలని చూసింది. మసాలా బాండ్లను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాతో సహా పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంగీకరిస్తున్న నేపథ్యంలో ఇడి ద్వారా కెఐఐఎఫ్‌బి సిఇఒను, డిప్యూటీ మేనేజర్లును, ఇతర ఉన్నతాధికారులకు వేధింపులకు గురిచేయడం వెనుక ఉద్దేశం ఇట్టే అర్థం అవుతుంది. ఒకవేళ అక్రమ లావాదేవీలు జరిగివుంటే మసాలా బాండ్లకు అనుమతించిన రిజర్వుబ్యాంకు చూసుకోవాలి. కానీ ఇడికి ఏం పని? అయినా, ఇడిని పనిగట్టుకుని ఉసిగొల్పడం మోడీ ప్రభుత్వ కుతంత్రాన్ని తెలియజేస్తోంది. నేరారోపణలు లేకుండానే దర్యాప్తు పేరుతో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించడం బిజెపి దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ట. సోనియాగాంధీపైకి ఇడిని ప్రయోగించినప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ గగ్గోలు పెట్టిన కేరళలోని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎల్‌డిఎఫ్‌పై అక్కసుతో మోడీ సర్కార్‌కు వంత పాడటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి దర్పణం పడుతోంది. ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎవరు ప్రయత్నించినా వారికి భంగపాటు తప్పదు.