
'మనవాళ్లు వట్టి వెధవాయి లోయి...' అన్నాడు గురజాడ గిరీశం. అంటే నిష్ప్రయోజకులు అని అర్ధం. శాస్త్రంలో ఉన్న ప్రతిదానికీ మినహాయింపులుంటాయని మన పండితులెప్పుడో సెలవిచ్చారు గనుక గిరీశం చెప్పినదానికి మినహాయింపు ఏమిటంటే అది అందరికీ వర్తించదు. వాట్సాప్ ''విజ్ఞానాన్ని'' గుడ్డిగా నమ్మే అజ్ఞానులకు మాత్రమే అని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ మీద విదేశీ బిబిసి చెప్పిందాన్ని మనం నమ్మాలా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, దేశభక్తుడు అదానీ కంపెనీల గురించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనే సంస్థ ఇచ్చిన నివేదికను విశ్వసించాలా అని 56 అంగుళాల ఛాతీ విరుచుకొని ప్రశ్నిస్తున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. నిజమే దేన్నీ గుడ్డిగా నమ్మకూడదు. వాళ్లే ఇంకా ఏమంటారంటే మన దేశంలో నరేంద్రమోడీని విమర్శించే దేశద్రోహులకు మోడీ గురించి విదేశాల వారు చెప్పే ప్రశంసలు కనిపించవా అని తర్కానికి దిగుతారు.
అదే విదేశీయులు విమర్శిస్తే, దాని సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే శత్రువులను భుజాన వేసుకుంటారా అని మాటలమారులు దెబ్బలాడతారు. వారి నాలికలకు నరం ఉండదు. ఇదే గ్యాంగు వాట్సాప్‌లలో తిప్పుతున్న ఒక అంశాన్ని చాలా మంది చదివే ఉంటారు. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక చీఫ్ ఎడిటర్ జోసెఫ్ హోప్ రాసిన సంపాదకీయం అంటూ నరేంద్ర మోడీ గొప్పతనం గురించి అనేక అంశాలను పేర్కొన్నారు. బిబిసి విమర్శిస్తే దురుద్దేశం ఉంది అన్నారు. మరి ఈ సంపాదకీయం మోడీని బుట్టలో వేసుకొనేందుకు మునగ చెట్టు ఎక్కించినట్లా? ఇక జోసెఫ్ సంపాదకీయంలో చెప్పిందేమిటో కొన్ని ఆణిముత్యాలను చూద్దాం. లేకపోతే మోడీ భక్తుల మనోభావాలు గాయపడితే ప్రమాదం.
''నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నారు. ఆయన ఏం చెయ్యబోతున్నారో ఎవ్వరికీ తెలియదు (నిజమే పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపని తెలిసిందే). ఆయన చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశభక్తుడున్నాడు (ఇదేమీ వర్ణనరా బాబూ, ఏ దేశభక్తుడినైనా ఇలా వర్ణించటం చూశారా, అసలు నరేంద్ర మోడీలో ఎవరైనా చిరునవ్వును చూశారా). పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లకు అమెరికాతో సంబంధాలను తెగ్గొట్డారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తారు. యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ను సర్వనాశనం చేశారు. ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని నిరూపించాడు. రష్యా, జపాన్‌లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.'' ఇలాంటి అనేక అంశాలను చెప్పి ఇంతవరకు ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు అని జోసెఫ్ హోప్ రాసినట్లుగా దానిలో పేర్కొన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమంటే బిబిసి, హిండెన్‌బర్గ్ వాస్తవం. జోసెఫ్ హోప్ అనే జీవి అసలు ఉనికిలో లేడు, న్యూయార్క్ టైమ్స్ పత్రిక అసలు అలాంటి సంపాదకీయం రాయలేదు. ఇది ఫేక్ న్యూస్ అని అనేక సంస్థలు దాని బండారాన్ని చెప్పాయి. పోనీ ఇది వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించిందా అంటే అదెక్కడా కనపడదు. నమో భారతీయం వంటి పేర్లతో ఆంగ్లంలో ప్రచారం చేసినదానిని తెలుగులో పాక్షికంగా అనువందించి వాట్సాప్‌లో తిప్పుతున్నారు.
వారం రోజుల తరువాత స్వదేశీ జాగరణ మంచ్ అనే ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ మేలుకున్నది. గౌతమ్ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్ అశ్వనీ మహాజన్ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు. మరొక వాట్సాప్ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఇజ్రాయిల్ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయిల్ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రు దేశమే. దాని రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా! మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టటం అంటే ఇదే. హిండెన్‌బర్గ్ నిర్వాహకుడు అమెరికాలో స్థిరపడిన ఇజ్రాయలీ. ప్రపంచంలో కంపెనీల వాటాలను షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థ హిండెన్‌బర్గ్ ఒక్కటే కాదు. దానికి నిధులు ఇవ్వటం ఎందుకు? స్వయంగా చైనా అలాంటి కంపెనీని పెట్టవచ్చు. ప్రపంచంలో డాలర్ నిల్వలు ఎక్కువ ఉన్న దేశం అది. ఒక్క అదానీని మాత్రమే ఎందుకు...అన్ని పారిశ్రామిక సంస్థలను అదే విధంగా చేయవచ్చు కదా? చైనా గనుక హిండెన్‌బర్గ్‌కు నిధులు ఇస్తే మన జేమ్స్ బాండ్ అజిత్ దోవల్‌ను పంపి బయట పెట్టించవచ్చు. ఎవరన్నా అడ్డుపడ్డారా? కాసేపు నిజంగానే చైనా నిధులు ఇచ్చి ఆ పని చేసిందని అనుకుందాం. పార్లమెంటును కుదిపివేస్తున్న ఈ ఉదంతం మీద మాట్లాడి దాని బండారాన్ని వెల్లడించవచ్చు. ఇదేమీ దేశ రహస్యం కాదు. ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? ఆడలేక మద్దెల ఓడంటే కుదరదు.
హిండెన్‌బర్గ్ నివేదికను ఆసరా చేసుకొని చైనా మీద ప్రచారదాడి మొదలు పెట్టటం వెనుక అసలు అంశాన్ని పక్కదారి పట్టించి అదానీ కంపెనీలను రక్షించే ఎత్తుగడ ఉంది. హిండెన్‌బర్గ్ తన నివేదికలో అదానీకి చాంగ్ చుంగ్ లింగ్ అనే చైనా జాతీయుడికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇంటి చిరునామానే తనదిగా చాంగ్ ఇచ్చాడని, అతనితో ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిగ్గదీసింది. ప్రపంచంలో ఉన్న చైనా జాతీయులందరూ చైనా పౌరులు కానట్లే ఇతగాడూ కాదు. తైవాన్‌కు చెందినవాడు. హిండెన్‌బర్గ్ 129 పేజీల నివేదికలో లేవనెత్తిన ప్రశ్నలకుగాను అదానీ ఇచ్చిన 413 పేజీల వివరణలో కీలకమైన వాటిని విస్మరించారు. చాంగ్ గురించి హిండెన్‌బర్గ్ నివేదికలో నాలుగు చోట్ల ప్రస్తావన ఉంది. ఒక్కదానికీ అదానీ సమాధానం ఇవ్వలేదు. నిజానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే అంతా ఉత్తిదే అని ఒక ట్వీట్ చేసి ఊరుకునేదానికి అంత వివరణ ఎందుకు ఇవ్వాలి.
హిండెన్‌బర్గ్ నివేదికలో ''గుడామీ ఇంటర్నేషనల్'' అనే సంస్థ గురించి పేర్కొన్నారు. దానిలో చాంగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అది తమకు సంబంధించినదే అని అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2002 కంపెనీ వివరాల్లో పేర్కొన్నది. ఈ గుడామీ ఇంటర్నేషనల్ 2018 వార్తల్లో ఉంది. కాంగ్రెస్ నేతలు, మిలిటరీ అధికారులు ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో అనుమానిత మూడు సింగపూర్ సంస్థలలో ఇదొకటి. మాంటెరోసా ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ అనే సంస్థ అదానీ కంపెనీల్లో 450 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీలో గుడామీ పెట్టుబడులు పెట్టింది. చాంగ్ అనేక అదానీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు హిండెన్‌బర్గ్ పేర్కొంటే మన దేశానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డిఆర్‌ఐ) ఇచ్చిన ఒక తీర్పు ఉత్తరువులో, సంస్థ రికార్డుల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇంటి చిరునామానే తన అడ్రస్‌గా చాంగ్ ఇచ్చినట్లు ఉంది.
ఇదిగాక హిండెన్‌బర్గ్ మరొక ఉదంతాన్ని పేర్కొన్నది. గ్రోమోర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీ 2011లో 42.3 కోట్ల డాలర్ల లాభంతో అదానీ పవర్‌లో విలీనమైంది. దీనికీ చుంగ్‌కు సంబంధం ఉంది. భారత చట్టాల ప్రకారమే దాన్ని విలీనం చేసుకున్నాం తప్ప అక్రమాలేమీ జరగలేదని అదానీ తన సమాధానంలో పేర్కొన్నది.హిండెన్‌బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో మూడు పిఎంసి ప్రాజెక్ట్స్ అనే సంస్థకు చెందినవి. దీనికి అదానీ కంపెనీలు చెల్లింపులు జరిపినట్లు డిఆర్‌ఐ నివేదికలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ కంపెనీ అదానీ బినామీనా కాదా చెప్పాలని కోరింది. ఇది చాంగ్ చుంగ్ లింగ్ కుమారుడిదని, తైవాన్‌లో అదానీ కంపెనీ ప్రతినిధి అని పేర్కొంటూ వారంతా కలసి ఉన్న చిత్రాన్ని కూడా జత చేసి వారి సంబంధాలపై అనుమానాలున్నట్లు పేర్కొన్నది. పిఎంసితో తమకెలాంటి సంబంధాలు లేవని అదానీ తన వివరణలో పేర్కొన్నారు. తాము అడిగిన దానికి సూటిగా చెప్పకుండా కలగాపులగం చేసి చెప్పారని హిండెన్‌బర్గ్ పేర్కొన్నది.
ప్రస్తుత ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు దాని అవసరం లేదని, మన ప్రధాని మోడీ చక్రం తిప్పుతున్నట్లు ఒకవైపు ప్రచారం. అమెరికా మనకు జిగినీ దోస్తుగా ఉంది, మన ప్రధాని మోడీ దాని అధ్యక్షులతో భుజాల మీద చేతులు వేసి తిరిగే చనువు ఉంది. నిజంగా దానికి మన అవసరం ఉంటే హిండెన్‌బర్గ్ గురించి ఇంతవరకు జో బైడెన్ నోరు విప్పడేం. మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరవుతుంటే నరేంద్రమోడీ ఫోన్ చేసి మాట్లాడరేం! హిండెన్‌బర్గ్ వెనుక చైనా ఉందని మన వాట్సాప్ మరుగుజ్జులకు తెలిసిన పరమ రహస్యం మోడీ సర్కార్‌కు తెలియని దుస్థితిలో ఉందా? తెలిస్తే హెచ్చరిక ఎందుకు చేయరు? దేశం, మదుపర్ల కంటే మౌనమే ప్రధానమా? ఇంతటి సంచలనం చెలరేగితే ఏ దేశాధినేతైనా మౌనంగా ఉంటారా? జనాలకు భరోసా ఇవ్వాల్సిన రాజధర్మం తెలియదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలేమిటి అని ఆలోచించకుండా వాట్సాప్, ఫేస్‌బుక్కులో మోడీ, అదానీ, తదితరుల గురించి ప్రచారం చేసే అతిశయోక్తుల మీద స్వంత బుర్రలను ఉపయోగించకుండా వాటిని ఇతరులకు పంచే, ప్రచారం చేసే, సమర్ధించే పెద్దమనుషులను గిరీశం చెప్పినట్లుగా వర్ణిస్తే తప్పా!
- సత్య