Oct 17,2020 20:40

న్యూఢిల్లీ : గతంలో రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన బిటి  వంగ పంట మళ్లీ తెరపైకి వచ్చింది. బిటి విత్తనాలు జన్యు పరంగా మార్పు చెందినవి కావడంతో రైతులు, పర్యావరణ వేత్తల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో దశాబ్దకాలంగా ఈ పంటను నిలిపివేశారు. అయితే దేశంలో గత నెల ఈ పంట ఫీల్డ్‌ ట్రయల్స్‌కు ప్రభుత్వం అనుమతించింది. కాగా, భారత్‌లో మొదటి జిఎం (జన్యుమార్పిడి) పంట బిటి పత్తి కాగా, రెండోది బిటి వంగ సాగు  కావడం గమనార్హం. అయితే అపరిమితంగా, ప్రణాళిక లేకుండా బిటి పత్తిని ప్రవేశపెట్టడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బిటి వంగ సాగుతోనూ  అవే సమస్యలు తిరిగి పునరావృతం కానున్నాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. భూ పరీక్షలు లేకపోవడం, భద్రత, పారదర్శకత లేకపోవడంతో దేశంలో 93 శాతం ఎకరాల్లో బిటి పత్తిని వేశారు. దీంతో మరే ఇతర పంటలు పండకుండా అనేక ఎరకాలు భూసారం కోల్పోయాయి. అయితే బిటి వంగ ఆహార పంట అని, ఇది వాణిజ్య పంట కాదని, దీంతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరగాలని, భద్రత, పారదర్శకత అవసరమని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. అలాగే దేశీయ రకాలైన విత్తనాలను కూడా భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన జన్యు ఇంజనీరింగ్‌ ఆమోదకమిటీ బీహార్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, ఒడిశా, తమిళనాడు వంటి ఎనిమిది రాష్ట్రాల్లో దేశీయ బిటి విత్తనాల కోసం భూపరీక్షలకు అనుమతించింది. మట్టిలోని బ్యాక్టీరియా, బాసిల్లస్‌ తురింజెనిసిస్  (బిటి) నుండి ప్రోటీన్‌ జన్యువు(క్రై 1ఎఫ్‌1)ను వంకాయ డిఎన్‌ఎలోకి చేర్చడం ద్వారా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఈ బిటి రకాలను అభివృద్ధి చేసింది.  కాండం తొలిచే పురుగులను అడ్డుకోవడంతో పాటు ఉత్పత్తిని పెంచేందుకు ఈ రకాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. బిటి వంకాయల విత్తనాలతో పురుగుమందుల వాడకాన్ని తగ్గించడంతో పాటు రైతుల ఉత్పాదకత, లాభాలను పెంచుతుందని జిటి మద్దతుదారులు పేర్కొంటున్నారు. పత్తిపంట ఉత్పత్తిని, ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న పేరుతో మోన్‌శాంటో  బిటి పత్తిని భారత్‌లో ముందుకు తెచ్చింది.  అలాగే  వీటిని అనుమతించిన ఎనిమిదేళ్ల అనంతరం భారత్‌ ప్రపంచంలోనే పత్తిని ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటిస్థానంలో నిలిచిందని,  ఎగుమతుల్లో రెండవ అతిపెద్ద దేశంగాను పేరుపొందిందని ప్రభుత్వం వాదిస్తోంది.
అయితే భారత్‌లో బిటి విత్తనాల ద్వారా వంకాయలను ఉత్పత్తి చేయాల్సిన అవసరంలేదని నిపుణులు పేర్కొంటున్నారు. వంకాయల్లో ప్రపంచ ఉత్పత్తిలో భారత్‌ 27 శాతం వాటాలను కలిగి ఉంది. చైనా తరువాత రెండోస్థానంలో కొనసాగుతోంది. దేశంలో నాలుగు వేల ఏళ్లక్రితమే 2,500 వంగ రకాలను సాగుచేస్తోంది. దేశీయ పంటలను జన్యుమార్పిడికి గురిచేయకూడదని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2010లో పేర్కొంది. జిఎం టెక్నాలజీ వినియోగించడంతో దేశీయ రకాలు మరుగున పడిపోతాయని వ్యవసాయ కార్యకర్తలు వాదిస్తున్నారు.