Sep 27,2023 16:39

 మలయాళ చిత్రం '2018' ఆస్కార్‌ అధికారిక ఎంట్రీని సాధించింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం భారత జ్యూరీ సభ్యులు ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ఈ వేడుకలు జరగనున్నాయి.  ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ కోసం పంపిన మొత్తం 22 చిత్రాలను వీక్షించింది. చెన్నైలోని సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో జ్యూరీ సభ్యులు బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. పర్యావరణ మార్పులు, సమాజ అభివృద్ధిపై అవగాహన కల్పించే విధంగా   రూపొందించడంతో ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.

టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ  చిత్రాన్ని  తెరకెక్కించారు. ఆద్యంతం భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం  మలయాళంతో పాటు, ఇతర భాషల్లోనూ విజయం సాధించింది.