చెప్పవలసిన మాట ఏదో
ఎప్పటికీ మిగిలిపోతూనే వుంటుంది
చేయవలసిన పనేదో
ఇంకా మొదలైనా కానట్లుంటుంది
పొందవలసిన అనుభవమేదో
దూరంగా ప్రవహిస్తున్న ఎండమావిలా
కూర్చోనీయక నడిపిస్తూ ఉంటుంది
చెప్పిన మాటలన్నీ ఒక్కుమ్మడిగా
పెనుగాలికి ఆకులు రాలినట్టు
అర్థం లేకపోవటంలోకి రాలిపోతాయి
చేసిన పనులన్నీ
తాకి చూడటానికి రవ్వంత దూరంలోకి
జరిగిపోతూ ఉంటాయి
పొందిన అనుభవాలన్నీ
నిద్రలేచిన పక్కమీద రాలని కలల్లా
తెలియని కొలతలోకి
చెప్పకుండానే సెలవు తీసుకొంటాయి
ఎప్పటి వెలితి
ఎప్పటి ఆతృత
ఎప్పటి పెనుగులాట
ఎప్పటికీ దుఃఖపు లోతుల్లోంచి
ఉబకని సంతోషపు జల
ఎక్కడ ఉన్నావో తెలియకనే
ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే
తెలిసినదంతా
ఎక్కడ నిన్ను నిలిపిందో కనుగొనకనే
ఏ రాత్రుల, ఏ పగళ్ల,
ఏ ఆకాశాల
లోపల, వెలుపల, చుట్టూ
నువ్వు మిగిలావు
నువ్వు నిలిచావు
నువ్వు తడిశావు
బివివి ప్రసాద్
90320 75415