- 'ఇండియా' విజయానికి కృషి చేయాలి
- పార్టీని అనేక రెట్లు బలోపేతం చేయాలి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని, ఇండియా ఫోరం విజయానికి కృషి చేయాలని సిపిఎం నేతలు పిలుపు ఇచ్చారు. మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ జిల్లాలలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10ను అమరవీరుల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. 1945 అక్టోబర్ 10న వర్లీ ఆదివాసీ తిరుగుబాటులో మొదటి ఐదుగురు అమరవీరులను బ్రిటిష్ పాలనలోని పోలీసులు కాల్చి చంపారు. 1996 అక్టోబర్ 10న ప్రజా నాయకుడు కామ్రేడ్ గోదావరి పరులేకర్ వేలాది మంది ప్రజల సమక్షంలో, ప్రధానంగా ఆదివాసీల సమక్షంలో పాల్ఘర్ జిల్లాలోని తలసరి వద్ద దహనం చేసిన రోజు. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబర్ 10న పాల్ఘర్, థానే జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాల నుండి 30,000 మందికి పైగా ప్రజలు దేశంలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులలో ఒకటైన ముంబయి-అహ్మదాబాద్- జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిని, పాల్ఘర్ జిల్లాలోని దహను మండలంలో చరోటి వద్ద రోడ్డును కొన్ని గంటల పాటు దిగ్బందించారు. సిపిఎం, ఏఐకేఎస్, సీఐటీయు, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఏఆర్‌ఏం థానే, పాల్ఘర్ జిల్లా కమిటీలు సంయుక్తంగా ఈ ఆందోళనను నిర్వహించాయి.
2023 మార్చి, ఏప్రిల్‌లలో రాష్ట్రవ్యాప్తంగా ఎఐకెస్ నేతృత్వంలో జరిగిన రెండు కిసాన్ లాంగ్ మార్చ్‌లు, 2023 మేలో పాల్ఘర్, థానే జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఏఐకేఎస్, ఐద్వా ఆద్వర్యంలో నాలుగు భారీ ర్యాలీలు, హాస్టల్ అడ్మిషన్‌ల కోసం ఎస్‌ఎఫ్‌ఐ విజయవంతమైన పోరాటం ఈ ఆందోళనకు నాంది పలికాయి. భూమి, ఆహార భద్రత, ఉపాధి హామీ, విద్య, ఇతర రంగాలకు సంబంధించి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అయితే, అమలులో నెమ్మదిగా ఉంది. అందుకే జిల్లావ్యాప్తంగా ఈ భారీ ర్యాలీ, జాతీయ రహదారి దిగ్బంధనానికి పూనుకున్నారు.
అటవీ, ఇనామీ, దేవాలయం, పాత భూస్వాముల భూములను తమ పేర్లపైకి ఇవ్వాలని, సాగులో ఉన్న రైతులు, ఆహార భద్రత, పీడీఎస్, ఉపాధి హామీ, విద్యుత్తు, విద్య, ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించి గతంలో అంగీకరించిన డిమాండ్లన్నింటినీ పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ (డీఎం) సంతకం చేసిన లేఖను తలసరి, దహను తహశీల్దార్లు తీసుకొచ్చిన తర్వాతే ఆందోళన ముగిసింది. ఆ తరువాత చరోటీలో భారీ బహిరంగ సభ జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే వినోద్ నికోల్ అధ్యక్షత వహించగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి ఉదరు నార్కర్, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి కిరణ్ గహలా, రాష్ట్ర కమిటీ సభ్యులు రడ్కా కలంగ్డా, లక్ష్మణ్ డోంబ్రే, చందు ధంగ్డా, భరత్ వలంబ, లహానీ దౌదా, ప్రాచీ హతివ్లేకర్, ఇంకా చంద్రకాంత్ ఘోరా?నా, యశ్వంత్ బుధార్, అమత్ భవార్, సునీల్ సర్వే, భాస్కర్ మ్హసే, రాజేష్ దాల్వీ ప్రసంగించారు.
వక్తలందరూ వార్లీ ఆదివాసీ తిరుగుబాటు, తరువాత జరిగిన పోరాటాల ఘనమైన వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. కేంద్రంలోని బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, గిరిజన వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మత, నియంతృత్వ స్వభావం, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. అటవీ సంరక్షణ చట్టం (ఎఫ్‌సిఎ), అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) అమలులో నిర్లక్ష్యం, షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల పొడిగింపు చట్టం (పెసా)ను నీరుగార్చడంలో ఆదివాసీ వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల సవరణలతో కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందని విమర్శించారు.
న్యూస్‌క్లిక్, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దారుణమైన దాడి, ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిల అరెస్టులను ఖండించారు. నాందేడ్, ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పలువురు మరణించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, ఇండియా కూటమి విజయానికి కృషి చేయాలని, పార్టీని, అన్ని బహుజన ఫ్రంట్‌లను అనేక రెట్లు బలోపేతం చేయాలని పిలుపుతో బహిరంగ సభ ముగిసింది.










