Sep 11,2020 11:18

మానవ విధ్వంసంతో అతి వేగంగా క్షీణిస్తున్న జంతుజాలం

* డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ నివేదిక హెచ్చరిక


వాషింగ్టన్‌ : గత 50ఏళ్ళ కన్నా తక్కువ కాలంలోనే వన్య ప్రాణుల సంఖ్య మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగానే క్షీణించింది. అడవులు నరికివేయడం, విశృంఖలంగా వినియోగించుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా ప్రకృతిని రక్షించుకోవడం చాలా ముఖ్యమని వారు హెచ్చరించారు. మానవ కార్యకలాపాల వల్ల మూడువంతుల భూమి, 40శాతం సముద్రాలు క్షీణించాయని, ప్రకృతి విధ్వంసం వేగంగా జరుగుతున్న కొద్దీ ప్రజల జీవనంపై, వారి ఆరోగ్యంపై లెక్కకు మిక్కిలి పర్యవసానాలు కలుగుతాయని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌) గురువారం తన వార్షిక నివేదికలో హెచ్చరించింది. 4వేలకు పైగా వెన్నెముక గల జీవుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. 1970-2016 మధ్య కాలంలో వన్యప్రాణుల సగటు క్షీణత 68శాతం వరకు వుందని, అడవులను నరికివేయడాన్ని పెరగడం, వ్యవసాయ విస్తరణ దీని వెనుక గల ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. గత 30ఏళ్ళ కాలంగా తాము పర్యవేక్షిస్తున్నామని, క్షీణత అనేది బాగా ఎక్కువగా వుందని డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ అంతర్జాతీయ డైరెక్టర్‌ జనరల్‌ మార్కో లాంబర్టిని మీడియాకు తెలిపారు.