Oct 13,2020 18:14

చెన్నై : తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్‌ 25 తర్వాత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (లా నినా) కారణంగా నైరుతి రుతుపవనాలు కొనసాగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం బెంగాల్‌ మీదుగా కాకినాడ సమీపంలోని బంగాళాఖాతంలో తీరం దాటిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.
లా నినా ఒక ప్రపంచ వాతావరణ నమూనా అని, భూమధ్యరేఖ పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పడిపోవడానికి, గాలుల దిశను ప్రభావితం చేస్తాయని, దీంతో భారత్‌తో సహా పలు ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని చెన్నై వాతావరణ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌. బాలచంద్రన్‌ అన్నారు.