
- సినిమాలకు ధీటుగా ఇటీవలి కాలంలో వెబ్‌సిరీస్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటంతో.. వాటిపై మరింత ఆసక్తి పెరుగుతోంది. కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ వరుసగా వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా 'కుమారి శ్రీమతి'లో నటించి, అమెజాన్ ప్రైమ్ వేదికగా పలకరించారు. చిత్రంలో హీరో తిరువర్‌తో పాటు కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు పాత్రధారి నిరుపమ్ పరిటాల ప్రధానపాత్ర పోషించారు. డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల షో క్రియేటర్‌గా డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మరి ఈ కుమారి శ్రీమతి లక్ష్యం ఏంటి? అసలు కథ ఏంటో చూద్దాం.
సుమారు 30 నుంచి 40 నిమిషాల నిడివితో ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ నడిచింది. తాతయ్యకు ఇచ్చిన మాటను ఆశయంగా తీసుకున్న శ్రీమతి చివరికి తన ఇంటిని సొంతం చేసుకుందా? లేదా? అనేదే కుమారి శ్రీమతి కథ. అందుకోసం బార్ పెట్టి డబ్బు సంపాదించే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ, దాన్ని ఎవరినీ నొప్పించకుండా అందంగా తెరకెక్కించారు. కేవలం రూ.13 వేలకు పని చేసే శ్రీమతి రూ.38 లక్షలు సంపాదించుకోవడానికి బార్ పెట్టాలనుకోవడం, అందులోనూ 30 ఏళ్లు వచ్చిన పెళ్లిచేసుకోని మధ్యతరగతి మహిళను చూసే విధానం వంటి అంశాలతో కామెడీ అండ్ ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు దర్శకుడు.
కథలోకి వెళితే.. రాజమహేంద్రవరం సమీపంలోని రామరాజులంకలో తల్లి దేవకి (గౌతమి), చెల్లి కల్యాణి (ప్రణీత పట్నాయక్), నాయనమ్మ శేషమ్మ (రామేశ్వరి) తో కలిసి ఉంటుంది సిరి అలియాస్ శ్రీమతి (నిత్యామేనన్). హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి, ఓ రెస్టారెంట్‌లో రూ.13 వేల జీతానికి పనిచేస్తుంటుంది. మరోవైపు తాతల నాటి ఇంటిని అమ్మేందుకు సిరి బాబాయి కేశవరావు (ప్రేమ్‌సాగర్) ప్రయత్నించడంతో న్యాయస్థానంలో పోరాటం చేస్తుంటుంది. అలా 18 ఏళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తర్వాత, తన తండ్రి రాసిన వీలునామా దొరికిందని, దాని ప్రకారం ఇంటిని తనకే ఇవ్వాలని కేశవరావు కోర్టులో ఆధారాలు చూపిస్తాడు. అయితే, ఇంటి విలువను రూ.38 లక్షలుగా కోర్టు లెక్కగడుతుంది. తాతల నాటి ఆస్తి కావడంతో మొత్తాన్ని ఆరునెలల్లో కేశవరావుకు చెల్లించి, ఇంటిని సొంతం చేసుకోవచ్చని శ్రీమతికి కోర్టు ఒక అవకాశం ఇస్తుంది. నెల జీతం, తల్లి దేవకి కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రీమతి రూ.38 లక్షలు సంపాదించడానికి ఊళ్లో బార్ పెట్టాలనుకుంటుంది. మరి శ్రీమతి తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఊళ్లో బార్ పెట్టడానికి ఆమె పడిన కష్టం ఏంటి? ఈ క్రమంలో పక్కంటి అబ్బాయి శ్రీరామ్ (నిరుపమ్), చిన్ననాటి స్నేహితుడు అభి (తిరువీర్), కాలేజ్ మిత్రుడు దొరబాబు (గవిరెటడ్డి శ్రీనివాస్) చేసిన సాయం ఏంటి? అసలు శ్రీమతి తండ్రి విశ్వేశ్వరరావు (నరేష్) ఏమయ్యాడు? చివరకు శ్రీమతి తాతలనాటి ఇంటిని దక్కించుకుందా? లేదా? తెలియాలంటే వెబ్‌సిరీస్ చూడాల్సిందే!
మొదటి ఎపిసోడ్‌లో పాత్రలను పరిచయం చేస్తూ, రూ.38 లక్షలు సంపాదించడం.. అందుకు ఊళ్లో బార్ పెట్టాలని శ్రీమతి నిర్ణయం తీసుకోవడం.. వంటి కీలక అంశాలతో నడుస్తుంది. తర్వాతి ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందోననే ఆసక్తిని కలిగించారు. డబ్బు అవసరం ఉన్నా ఇతరులకు నష్టం కలగకుండా శ్రీమతి వ్యాపారం చేసే తీరు, అందుకు పెట్టే రూల్స్ నిజంగా ఆకట్టుకుంటాయి. బార్ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక్కో సమస్య రావడం, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లడం.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లడం స్ఫూర్తినిస్తుంది. కానీ మహిళా సాధికారతతో కూడిన కథను తీసినప్పుడు మద్యం, బార్‌లాంటి పాయింట్‌లు ఎంచుకుంటే ప్రధానపాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. స్వార్థంతో కూడిన శ్రీమతి పాత్రకు ఈ లక్షణాలను ఆపాదించినప్పుడు ఆ పాత్రను సాఫ్ట్‌గా చూపించాల్సిన అవసరం లేదు. బార్ వంటివి కాకుండా ఇంకేదైనా అంశాన్ని ఎంచుకుంటే, సిరీస్ మరింత స్ఫూర్తివంతంగా ఉండేదేమో. అయితే కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు. ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లంటే అసభ్యత, అశ్లీల పదాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. కానీ, ఇందులో ఎలాంటి అసభ్యతకు తావులేదు. ఎక్కడా అలాంటి సంభాషణలు లేవు.
నటీనటులు : నిత్యామీనన్, గౌతమి, తిరువీర్, నిరుపమ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీ మోహన్ తదితరులు
సంగీతం : స్టెక్కటో అండ్ కమ్రాన్
నిర్మాత : స్వప్న సినిమా
దర్శకత్వం : గోమఠేష్ ఉపాధ్యాయి
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో