
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : కొరటాల సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్ అన్నారు. సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్భంగా ఆర్ అండ్ బి బంగ్లా కార్యాలయంలో చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాను, ఆల్ ఇండియా పొలిటికల్ సభ్యులుగా, వ్యవసాయ, కార్మిక సంఘాలలో కీలకమైన నేతగా వ్యవహరిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేద బడుగు బలహీన వర్గాల భూ హక్కు కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఆయన లేని లోటు దేశంలోనూ, రాష్ట్రంలోనూ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడే అలాంటి నేత అరుదుగా ఉంటారని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహ సర్వేపల్లి, బి.శివయ్య, వెంకటేష్, ప్రభాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.