Dec 31,2022 23:16

'విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి సామాజిక సూచీలలో కేరళ ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకుంది. అయితే, ఆర్థికా భివృద్ధి అంతగా జరగలేదు. కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని సమీక్షించింది. స్థానిక ఆర్థికాభివృద్ధిని సాధించడం ద్వారా ఆ లోపానిు అధిగమించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా యువతీయువకులు సొంతంగా ఆర్ధిక కార్యక్రమాలు నిర్వహించేలా, పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. స్థానిక సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. మధ్య ఆదాయ దేశాల సరసన కేరళ సమాజాన్ని నిలబెట్టడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది పూర్తయితే ఓ పెద్ద ముందడుగు వేసినట్టువుతుంది' అని కేరళ రాష్ట్ర స్థానిక స్వ పరిపాలన శాఖ మంత్రి ఎంబి రాజేష్‌ అన్నారు. మాకినేని బసవపున్నయ్య స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి విజయవాడ వచ్చిన ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేరళలో స్థానిక సంస్థల పనితీరు, అవి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా :

  • ప్ర: మరే రాష్ట్రంలో లేని విధంగా కేరళలో స్థానిక సంస్థలకు ప్రాధాన్యత లభిస్తోంది. ఎందువల్ల?

జ: ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ సమాజం కూడా అభివృద్ధి సాధించదు. కమ్యూనిస్టు పార్టీ ఆ విషయాన్ని గుర్తించింది. ఎనోు రైతాంగ, ప్రజా పోరాటాల ద్వారా కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పోరాటాలకు జాతీయోద్యమ నేపథ్యం కూడా ఉంది. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు దిశా నిర్దేశం చేయడానికి వేసిన కమిటికీ మా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ స్వయంగా నేతృత్వం వహించారు. అప్పటి నుండి స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశలో కృషి ప్రారంభమైంది. అయితే, కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నంబూద్రి ప్రభుత్వాన్ని రద్దు చేయడం, నిర్బంధం సాగించడం వంటి కారణాలతో పూర్తిగా సాగలేదు. 1996లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్థానిక సంస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ స్థానిక ప్రభుత్వాలను భాగస్వాములను చేస్తున్నాం.

  • ప్ర: ఈ కృషి నిరాటంకంగా సాగుతోందా..?

జ: లేదు. మా రాష్ట్రంలో తరుచు ప్రభుత్వాలు మారే సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిసారి స్థానిక సంస్థలను విస్మరించేవారు. వారు మాటలెన్ని చెప్పినా ఆచరణలో కేంద్రీకరణకే ప్రాధాన్యత ఇచ్చేవారు. స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయించడానికి వారు వ్యతిరేకం. ఇకె నయనార్‌ హయంలో (1996) స్థానిక సంస్థల అభివృద్ధి కోసం మేం పెద్ద ఎత్తున ప్రజాప్రణాళికను రూపొందించాం. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని వారికి కావాల్సిన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవడం దీని లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 96 లక్షల మంది ప్రజలు, 10 వేల మంది నిపుణులు, 14 వేల మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రజా ప్రణాళిక ఏ విధంగా రూపొందిందో అర్ధం చేసుకోవడానికి ఈ అంకెలు చాలు. యుడిఎఫ్‌ దీనిని కూడా పక్కన పెట్టేసింది. అయితే, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రజా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తూనే ఉన్నాం.

  • ప్ర: స్థానిక సంస్థలకు నిధుల పంపిణీ ఎలా చేస్తున్నారు?

జ: ఎల్‌డిఫ్‌ ప్రభుత్వం నిధుల పంపిణీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ప్రణాళిక నిధుల్లో కనీసం 25 శాతం నిధులు స్థానిక సంస్థలకు కేటాయించాలని నిర్ణయించాం. దీనిని ప్రతి ఏడాది 0.5శాతం పెంచుతున్నాం. గత ఏడాది 26 శాతం నిధులు కేటాయించగా ఈ ఏడాది 26.5 శాతం కేటాయిచాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 27 శాతానికి చేరుతుంది. ప్రణాళిక నిధులతో పాటే కేటాయింపులూ పెరుగుతుంటాయి.

  • ప్ర: కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయా?

జ: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావడం దాదాపు ఆగిపోయింది. వాటి కోసం మేం పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రమం తప్పకుండా ఇస్తున్నాం. సాధ్యమైనంత వరకు స్వయంపోషకంగా ఉండేలా సొంత ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తునాుం. దీనికి ప్రజల నుండి సహకారం లభిస్తోంది.

  • ప్ర: ప్రస్తుతం మీ ప్రాధాన్యతలేంటి?

జ: ఇప్పుడు మేము స్థానిక ఆర్థిక అభివృద్ధి (లోకల్‌ ఎకనామిక్‌ గ్రోత్‌)ని సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. స్థానిక సంస్థలను కేంద్రంగా చేసుకుని ఈ కార్యక్రమం సాగుతుంది. నాలెడ్జి బేస్డ్‌ ఆర్థిక వ్యవస్థగా కేరళను తీర్చి దిద్ధడం దీనిలక్ష్యం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం దీని లక్ష్యం. ఉత్పత్తి, సేవా రంగాలతో పాటు వివిధ రకాల సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రానున్న నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని భావిస్తున్నాం. దీని కోసం కేరళ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్ట్రాటజీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశాం. ఇది స్థానిక సంస్థలతో కలిసి పని చేస్తుంది. ఇటీవల పరిశ్రమల శాఖ ఏడాదిలో లక్ష సంస్థలను ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద లక్ష్యంగా కనిపించవచ్చు. కానీ, స్థానిక సంస్థల సహకారంతో 9 నెలల్లోనే దాదాపుగా ఆ లక్ష్యాన్ని సాధించాం. 6,098 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2.83 లక్షల ఉద్యోగాలను సాధించాం. ఇవి భారీ సంస్థలు కావు. అన్నీ సూక్ష్మ స్థాయి సంస్థలే! గతంలో స్థానిక సంస్థలు ఈ తరహా కార్యక్రమాలకు దూరంగా ఉండేవి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు అవే కేంద్రంగా మారుతున్నాయి.స్థానికంగా ఆర్థికాభివృద్ధి చర్యలు చేపట్టడం, దానిద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించడం, అంతిమంగా ఆదాయాన్ని రాబట్టడం. కేరళ ఆదాయాన్ని ప్రపంచంలోని మధ్య ఆదాయ దేశాల స్థాయికి చేర్చడం ఈ కార్యక్రమం మొత్తం లక్ష్యం. దీని వల్ల స్థానిక సంస్థలు కూడా లభ్ధి పొందుతాయి. మేము ఇప్పటికే వివిధ సామాజిక సూచీలలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉన్నాం.

  • ప్ర: పట్టణీకరణ సమస్యలు ఉన్నాయా...? వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు?

జ: మా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతోంది. దశాబ్దకాలంలో దేశ వ్యాప్తంగా 2.57 శాతం, ప్రపంచ వ్యాప్తంగా 2.9 శాతం పట్టణీకరణ జరగ్గా అదే సమయంలో కేరళలో 6.58 శాతం జరిగింది. 2031 నాటికి 95 శాతం కేరళ జనాభా పట్టణాలకు చేరుకుంటారని అంచనా! దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టణీకరణ సమస్యల పరిష్కారం కోసం ఒక సమగ్ర విధానం రూపొందించడంపై దృష్టి సారించాం. సాధ్యమైనంత త్వరలోనే ఇది సిద్ధమౌతుంది. ప్రజలపై భారాలు మోపే కేంద్ర ప్రభుత్వ విధానం మాదిరి ఇది ఉండదు. పట్టణ సమస్యల పరిష్కారానికి కేరళ చూపే ప్రత్యామ్నాయ విధానంగా ఉంటుంది.

  • ప్ర: ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో మహిళలను ఎలా భాగస్వాములను చేస్తున్నారు?

జ: కుడుంబ శ్రీ (డ్వాక్రా) ప్రారంభమై ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. పేదరిక నిర్మూలన స్థాయి నుంచి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రస్తుతం ఈ గ్రూపులు పనిచేస్తున్నాయి. నూతన లక్ష్యంలో భాగంగా కుడుంబ శ్రీలోనే ' షీ స్టార్ట్స్‌' గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాం. చదువుకున్న యువతులతో ఏర్పాటవుతున్న ఈ గ్రూపులు వాణిజ్య లక్ష్యాలతో సంస్థలను ఏర్పాటు చేసి నడుపుతున్నాయి. కుడుంబ శ్రీలో 46 లక్షల మంది సభ్యులుండగా, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 'షీ స్టార్ట్స్‌'లలో ఇప్పటికే మూడు లక్షల మంది యువతులు నమోదు చేసుకున్నారు. అదే విధంగా ఇప్పటికీ తీవ్ర పేదరికంలో ఉన్న వారిని గుర్తించి, వారిని ఆ ఊబిలోంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ అమలు కోసం జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. దేశంలో అంత మొత్తం నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం కేరళ ఒక్కటే!