Nov 05,2022 06:24

కేరళ గవర్నర్‌ కార్యాలయం ఇటీవల చేసిన ట్వీట్‌ (తప్పుడు కారణాల వల్ల) దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ''గవర్నర్‌ కార్యాలయం గౌరవాన్ని తగ్గించిన కొంతమంది మంత్రుల ప్రకటనలు చర్యలు తీసుకోదగినవి'' అన్నది ట్వీట్‌ సారాంశం. అలాంటి మంత్రులను తొలగించాలని రాజ్‌భవన్‌ స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ, ''గవర్నర్‌ విశ్వాసం పొందగలిగినంత కాలం మంత్రులు తమ పదవీ బాధ్యతలలో ఉంటార''ని రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 164(1) స్పష్టంగా సూచిస్తుంది. గవర్నర్‌ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా వ్యవహరించిన కేరళ ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి గవర్నర్‌ లేఖ రాసినప్పుడే ఈ విషయం మరింత స్పష్టమైంది. కానీ గవర్నర్‌ కోరిన విధంగా, ముఖ్యమంత్రి ఆ పని చేయడానికి నిరాకరించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి రేకెత్తించిన గవర్నర్‌ చర్యకు రాజకీయపరమైన, రాజ్యాంగపరమైన కోణాలు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకపు ప్రక్రియలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపిస్తూ, వారిని తొలగించేందుకు తీసుకున్న గవర్నర్‌ చర్య, ఛాన్సలర్‌గా తనకున్న చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించుకున్నారనే విషయాన్ని తెలియజేస్తుంది. మంత్రులకు వ్యతిరేకంగా వ్యవహరించేలా ప్రత్యేకమైన అధికారం ఆయనకు లేదు. కేవలం రాజ్యాంగ పరిధికి లోబడి మాత్రమే ఆయన పనిచేయగలరు.
నియమించబడిన గవర్నర్‌ విధి ఎప్పటికీ కూడా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి లోబడి మాత్రమే ఉంటుంది తప్ప, దానికి విరుద్ధంగా ఉండదు. ఇది భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యం యొక్క పునాది సిద్ధాంతం. రాజ్యాంగపరమైన నిబంధనలను విడిగా ప్రత్యేకంగా చూడలేం. మంత్రి మండలి సభ్యులు గవర్నర్‌కు తోడ్పాటును అందిస్తూ, సలహాలు ఇవ్వాలని ఆర్టికల్‌ 163(1) చెపుతుంది. అయితే కొన్ని విషయాలలో గవర్నర్‌...రాజ్యాంగం అనుమతించిన మేరకు, దానికి లోబడి తన విచక్షణను బట్టి వ్యవహరించాలని ఆర్టికల్‌ 163(2) తెలియజేస్తుంది. అంటే దీనర్థం గవర్నర్‌, తన విచక్షణను ఉపయోగించడానికి చట్టబద్దమైన హక్కును కలిగి ఉన్నప్పుడు తప్ప, సాధారణంగా మంత్రివర్గం నిర్ణయానికే కట్టుబడి ఉండాలి (ఉదాహరణకు, ఒక క్యేబినెట్‌ మంత్రిని విచారణ చేయడానికి అనుమతి మంజూరు నిర్ణయంలో. లేదా భారత రాష్ట్రపతి ఆజ్ఞలను అనుసరించి కేంద్రపాలిత ప్రాంత పాలకుడిగా నిర్ణయాలు చేయడం లాంటి సందర్భాలలో). కేరళ గవర్నర్‌ చేసిన ట్వీట్‌, రాసిన లేఖల సందర్భానికి సంబంధించిన నిబంధనలు ఉన్న ఆర్టికల్‌ 164 ...ఆర్టికల్‌ 163 నుండి విడదీయలేనిది. కాబట్టి, మంత్రిమండలి లేదా ముఖ్యమంత్రి ఒక మంత్రిని తొలగించాలనే సలహా ఇవ్వకుండా...గవర్నర్‌ తన ''విశ్వాసాన్ని విరమించుకోవడం'' ద్వారా ఆ మంత్రిని తీసేయలేరు.
న్యాయనిపుణులు హెచ్‌.ఎం.సీర్వారు ఆర్టికల్‌ 163 యొక్క స్ఫూర్తి గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇది ఒక విధంగా, ''విశ్వాసానికి'' సంబంధించిన ఆర్టికల్‌ 164(1)కి నాంది. ఆర్టికల్‌ 163(1) ప్రకారం గవర్నర్‌లకు అన్ని విషయాల్లో విచక్షణాధికారం ఉంటే...కొన్ని నిర్దిష్ట విషయాలలో (ఆర్టికల్‌ 163(2) ద్వారా) వారి విచక్షణతో వ్యవహరించే అధికారాన్ని గవర్నర్‌లకు ఇవ్వడం అనవసరం'' అని ఆయన అన్నారు (భారత రాజ్యాంగ చట్టం, వాల్యూమ్‌-2, యూనివర్సల్‌, 1993, పేజీ 2,037).
షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ రాష్ట్రానికి (1974) సంబంధించిన కేసులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆర్టికల్‌ 164ను పరిశీలించవచ్చు. 1948 నవంబర్‌ 4న రాజ్యాంగ పరిషత్‌లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఉటంకించిన అంశాలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఉదహరించింది. అది ఈ విధంగా ఉంది - 'అమెరికా అధ్యక్షుడు, తన కార్యదర్శులు ఇచ్చిన సలహాలను అంగీకరించనవసరం లేదు. భారత రాష్ట్రపతి సాధారణంగా మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. మంత్రుల సలహాలకు విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడు. వారి సలహా లేకుండా కూడా రాష్ట్రపతి ఏమీ చేయలేడు. అమెరికా అధ్యక్షుడు ఏ సమయంలోనైనా ఏ కార్యదర్శినైనా తొలగించవచ్చు. మంత్రులకు పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్నంత కాలం, భారత రాష్ట్రపతికి మంత్రులను తొలగించే అధికారం లేదు''.
రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 75(2) ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం కేంద్ర మంత్రులు వారి బాధ్యతలు నిర్వహిస్తారు కాబట్టి, ఇవే నిబంధనలు గవర్నర్లకు కూడా వర్తిస్తాయి. మంత్రి మండలి సలహా లేకుండా రాజ్‌భవన్‌ సూచించినట్టుగా ''తన విశ్వాసాన్ని విరమించుకోవడం'' (విత్‌డ్రాల్‌ ఆఫ్‌ ప్లెజర్‌) అనేది తప్పుడు భావన.
ఆర్టికల్‌ 164(1)ని వున్నదున్నట్లుగా తీసుకోరాదు. రాజ్యాంగపరమైన అర్థంలో అవగాహన చేసుకోవాలంటే నిబంధన యొక్క పూర్వాపరాలను అవగాహన చేసుకోవాలి. 1947లో రాజ్యాంగపరమైన సలహాదారు తయారు చేసిన చిత్తుప్రతి రాజ్యాంగంలో ఆర్టికల్‌ 121 ఉంది. దాని ప్రకారం -'గవర్నర్‌ మంత్రులను ఎంపిక చేస్తారు. గవర్నరే వారిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఆయన విశ్వాసం ఉన్నంత కాలం వారు పదవిలో కొనసాగుతారు'. అంతకు ముందు ఆర్టికల్‌ 144లో భాగంగా ఉన్న ఈ ఆర్టికల్‌ 121పై రాజ్యాంగ పరిషత్‌లో చాలా సుదీర్ఘంగా చర్చించారు. గవర్నర్‌కు ఉన్న సాధారణ విచక్షణను తొలగించి, మంత్రివర్గానికి పాలనాధికారాన్ని ఇచ్చారు. చిత్తుప్రతి రూపంలో ఉన్న ఆర్టికల్‌ 144కు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రతిపాదించిన సవరణ ఫలితంగానే ప్రస్తుత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164, ఆర్టికల్‌ 165 రూపొందించబడ్డాయి.
గవర్నర్‌ రాష్ట్రానికి కేవలం ఒక నామమాత్రపు పెద్ద అనీ, ఒకవేళ మంత్రి వర్గానికి సభలో మెజారిటీ ఉంటే, ఆ మంత్రి వర్గానికి వ్యతిరేకంగా గవర్నర్‌ ఏమీ చేయలేడని ఆ ఆర్టికల్‌ సూచిస్తుంది.
గవర్నర్‌ కార్యాలయం వలస మూలాలను కలిగి ఉంది. 'భారత ప్రభుత్వ చట్టం-1858' గవర్నర్‌ జనరల్‌ పర్యవేక్షణలో గవర్నర్‌ పదవిని ఏర్పాటు చేసింది. ఆ తరువాత తీసుకొచ్చిన ''భారత ప్రభుత్వ చట్టం-1935'' ఏప్రిల్‌1, 1937 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం కూడా గవర్నర్లు ప్రాంతీయ ప్రభుత్వ సలహాల ఆధారంగా మాత్రమే పని చేయాలి.
గవర్నర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఏదైనా హామీ వుందా అని చర్చల సందర్భంగా హెచ్‌.వి.కామత్‌ ప్రశ్నించారు. మరొక ముఖ్య సభ్యుడైన పి.ఎస్‌. దేశ్‌ముఖ్‌ తక్షణ ప్రతిస్పందన ఇలా ఉంది: ''హామీ అనేది...గవర్నర్‌ విజ్ఞత. గవర్నర్‌ను నియమించే అధికార యంత్రాంగం విజ్ఞత'' (1949 జూన్‌ 2న-రాజ్యాంగ పరిషత్‌ చర్చల్లో).
రాజ్యాంగానికి సంబంధించిన ఈ విధమైన కాల్పనిక భావనను న్యాయపరమైన వాస్తవికతగా ఆశావహంగా అనువదించుకోవాలి. సుప్రీంకోర్టు షంషేర్‌సింగ్‌ కేసులో ఆ పనే చేసింది. జస్టిస్‌ వి.ఆర్‌ కృష్ణయ్యర్‌ ఆ తీర్పులో తన సహజ ప్రత్యేక శైలిలో అత్యుత్తమమైన వివరణ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో రాజ్యాంగేతర భ్రమలను తొలగించేలా ఇలా చెప్తారు. ''రాష్ట్ర స్థాయిలో...రాష్ట్రపతి, గవర్నర్ల అతిశక్తివంతమైన స్థానం....రాజ్యాంగ అధికరణలలో అధికారాలు, విధులను నేరుగా పేర్కొన్న చోట కూడా...శాసనసభకు జవాబుదారీగా వుండే మంత్రివర్గం ద్వారానే పూర్తిచేయాలి. అప్పుడది ప్రజల తరపున చేసినట్లవుతుంది. అప్పుడే మన ప్రజాస్వామ్యం మన రాజకీయ నిర్మాణం మౌలిక సూత్రాలకు అనుగుణమౌంది. ఏ ఒక్క అఖండ ఆత్మకు లొంగిపోకుండా కాపాడుతుంది...''.
అందువల్ల గవర్నర్‌ ట్వీట్‌ కన్నా లేఖ కన్నా రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందే అమలు జరగాలి.
kaleswaram raj

 

 

 


వ్యాసకర్త : కాళీశ్వరం రాజ్‌, సుప్రీంకోర్టు న్యాయవాది
(''ద హిందూ'' సౌజన్యంతో)