విజయవాడ లోని బోయిన సరోజ రాణి కి 72 చదరపు గజాల ఇల్లు ఉందనుకుందాం. అది రేకుల షెడ్డు. ప్రస్తుతం ఉన్న పన్ను సంవత్సరానికి రూ.360. ఆస్తి విలువను బట్టి లెక్కిస్తే స్థలం విలువ చదరపు గజానికి రూ.13 వేల చొప్పున, స్థలం విలువ రూ.9,36,000, నిర్మాణం విలువ రూ.3,80,000. మొత్తం కలిపి రూ.13,16,000 ఆస్తి విలువ. దీనిని బట్టి 0.5 శాతం పన్ను వేస్తే రూ.6,580 అవుతుంది. రూ.360 ఎక్కడీ రూ.6580 ఎక్కడీ 1700 శాతం పైగా పెరుగుతుంది. దయతలిచి 0.3 శాతం వేస్తే రూ.3,948 పన్ను పడుతుంది. సుమారుగా 1000 శాతం, పది రెట్లు పెరుగుతుంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారం దృష్టితో కాకుండా పట్టణ ప్రజలపై భారం మోపే ఆర్డినెన్సు, ఇతర బిల్లులను ఆమోదించడం కోసం మొక్కుబడిగా ఈ సమావేశాలను ప్రభుత్వం జరుపుతోంది. ఇప్పటికే పట్టణ ప్రజల మీద ఆస్తి పన్ను ఇతర భారాలు మోపేందుకు 6 మున్సిపల్ చట్టాలకు సవరణలు తీసుకు వస్తూ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్సుకు ఈ శాసనసభలో చట్ట రూపం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కరోనా కష్టాల్లో ప్రజలు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమనం కలిగించాలి. 'ఆత్మ నిర్భర భారత్' పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ప్రజలను మోసగించింది. ఈ ప్యాకేజీలో ప్రజలకు చేరేది శూన్యం. కానీ రాష్ట్రాలకు రుణ సహాయం పొందడానికి అనుమతి కొరకు షరతులతో కూడిన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం లోని మోడీ సర్కారు రుద్దింది. ఆస్తి పన్నులను పెంచడం, పౌర సదుపాయాల కల్పనకు, నిర్వహణకు అయిన ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టే రీతిలో యూజర్ చార్జీలు వసూలు చేయడం ఈ సంస్కరణలలో కీలక అంశాలు.
వైఎస్‌ఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర షరతులకు లొంగిపోయి వేగంగా మరిన్ని భారాలు వేసేందుకు పూనుకుంటున్నది. అంతేగాక, పన్నులు పెంచటమే కాదు, పన్నులు విధించే మౌలిక విధానాల్ని మార్చేస్తున్నది.
పన్నుల మోత
ఇప్పటి వరకు పట్టణాలలో అద్దె విలువ ఆధారంగా పన్నులు వేసేవారు. ఇక నుండి ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. ఆస్తి విలువ అంటే ఇల్లు ఉన్న స్థలం విలువ, అదే విధంగా ఇంటి నిర్మాణం విలువ రెండు కలిపి లెక్కించి దాని ఆధారంగా పన్ను వేస్తారు. నివాస గృహాలపై 0.1 శాతం నుండి 0.5 శాతం వరకు, నివాసేతర కట్టడాలు, వ్యాపార సంస్థలపై 0. 2 శాతం నుండి 2 శాతం వరకు ఇంటి పన్ను సంవత్సరానికి వేస్తారు. ఈ విధానం వల్ల పన్ను అనేక రెట్లు పెరుగుతుంది. కొందరికి 10 నుండి 20 రెట్లు కూడా పెరిగినా ఆశ్చర్యం లేదు. ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలను పెంచుతుంది. ఈ పెరుగుదలను బట్టి ఆటోమేటిక్‌గా ప్రతి సంవత్సరం పన్నులు కూడా పెరిగిపోతాయి. 15 శాతం మించి పెరగవని ప్రభుత్వము, మంత్రులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ విషయం ఆర్డినెన్సులో, చట్టాల సవరణల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీవో లో మాత్రమే పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు 15 శాతం పెంచి, ప్రజలను మభ్యపెట్టి తదనంతరం జీవో లో మార్పులు చేసి...చట్టానికి అనుగుణంగా ఆస్తి విలువ ఆధారంగా మొత్తం పెంచిన పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు 15 శాతం పెరిగినా అది ఒక సంవత్సరానికి పరిమితం కాదు, ఆస్తి విలువ ఆధారంగా ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున పెరుగుతూనే ఉంటుంది.
కొత్తగా నిర్మించే ఇళ్లకు ఆస్తి విలువ ఆధారంగానే పన్ను వేస్తారు. పాత ఇంట్లో మార్పులు ఏమైనా జరిగితే కొత్త విధానం ప్రకారమే ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధిస్తారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలపై ఆక్రమణదారులనే పేరుతో ఆస్తి విలువకు ఆధారంగా పన్ను లెక్కించి రెట్టింపు పెనాల్టీగా ప్రతి సంవత్సరం పన్ను వసూలు చేస్తారు. స్వంత ఇల్లు పట్టా స్థలంలో నిర్మించుకున్నా ప్లాన్ లేకపోతే అదనంగా కట్టుకున్న భాగంపై ఆస్తి విలువ ఆధారంగా మరో వంద శాతం కలిపి పన్ను వసూలు చేస్తారు. ఖాళీ స్థలాలపై మున్సిపాలిటీలలో ఆస్తి విలువలో 0.2 శాతం, మున్సిపల్ కార్పొరేషన్లలో స్థలం విలువలో 0.5 శాతం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఆనాటి భూమి విలువ ప్రకారం ఖాళీ స్థలం పన్ను విధిస్తారు. ఇల్లు ఉన్నా మూడు రెట్ల కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంపై కూడా ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థలం పన్ను వేస్తారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కరోనా, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఈ సంవత్సరం ఇంటి పన్నులో 50 శాతం రాయితీ కల్పిస్తూ 611 నెంబర్ జీవో విడుదల చేసింది. కానీ ఆంధ్రప్రదేశో బిజెపి, వైసిపి కుమ్మక్కై రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తున్నాయి.
375 చదరపు అడుగుల లోపు ఉన్న ఇళ్లకు రూ. 50 మాత్రమే పన్ను విధిస్తారని చట్టంలో పేర్కొన్నారు. కానీ వీటి సంఖ్య చాలా తక్కువ. అలాగే ప్రస్తుతం ఉన్న చట్టంలో కూడా సంవత్సరానికి రూ. 600 అద్దె విలువ లోపు ఉన్నవారికి పన్నులు వేయకూడదని ఉన్నది. అలాగే పేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు 6 నెలలకు రూ.2 మాత్రమే పన్ను వసూలు చేయాలని చట్టంలో ఉన్నది. కానీ ఎక్కడా అమలు జరగటం లేదు. ఇప్పుడు అమలు జరుగుతుందనే గ్యారెంటీ లేదు.
సేవ కాదు..అంతా వ్యాపారమే..
ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా మంచినీటి చార్జీలు, భూగర్భ డ్రైనేజీ చార్జీలు పెంచడానికి వీలుగా 196, 197 నెంబర్ జీవోలను విడుదల చేసింది. పారిశుధ్యం, చెత్త మీద, అన్ని పౌర సదుపాయాల మీద, నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టే విధంగా యూజర్ చార్జీల వసూళ్లకు చట్టంలో కొత్తగా నిబంధనలు పెట్టారు. ఇప్పటి వరకు చట్టంలో లేక పోయినా దొడ్డి దారిన వసూలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రజల అందరి దగ్గర నుండి వసూలు చేస్తారు. మంచి నీటి చార్జీలు నెలకు రూ.100 నుండి రూ.350 వరకు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సంస్థల నుంచి నీటి మీటర్లు ఆధారంగా లీటర్ల చొప్పున రేట్లు నిర్ణయించారు. భూగర్భ డ్రైనేజీలో వదిలే మురుగునీటిపై మరుగుదొడ్లు సంఖ్య ఆధారంగా విడివిడిగా నెలసరి చార్జీలు వసూలు చేస్తారు. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారు వేల రూపాయల డిపాజిట్లు కట్టాలి. నిర్వహణ ఖర్చు అంటే ఈ సదుపాయాలు కల్పించడానికి అయ్యే మొత్తం సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు, రిపేర్లు, సామగ్రి ఇలా మొత్తం ఖర్చు లెక్కించి ఆ మొత్తాన్ని ప్రజల నుండి రాబట్టే విధంగా చార్జీలు పెంచుతారు. 15 శాతం మాత్రమే పెంచాలని ప్రభుత్వం చెబుతున్నా ఖర్చు మొత్తం ప్రజల నుండి రాబట్టాలనీ చట్టంలో ఉండటం వల్ల తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇవి పెరిగిపోతాయి. వేతనాల ఖర్చు, విద్యుత్ చార్జీల ఖర్చు సర్వ సాధారణంగా ప్రతి సంవత్సరం పెరుగుతాయి. కాబట్టి ఛార్జీలు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పెరుగుతాయి. వీటితోనే ఆగకుండా పార్కుల్లో ఫీజులు, పాదచారుల మీద చార్జీలు, స్టేడియంలు, ఆట స్థలాలు, ఇక వీధి లైట్లు ఒకటి కాదు అన్ని సదుపాయాల పైన వినియోగదారుల ఛార్జీలు వసూలు చేస్తారు. మున్సిపాలిటీలను స్థానిక సంస్థలను వ్యాపార సంస్థలుగా ప్రభుత్వాలు మార్చేస్తున్నాయి. పౌర సేవలను ప్రభుత్వాలు వ్యాపార సరుకులుగా పరిగణిస్తున్నాయి. స్థానిక సంస్థల స్వయం సమృద్ధి నినాదాలు ఇస్తే లాభం ఏముంది? స్థానిక సంస్థల నుండి వసూలయ్యే పన్నులను స్థానిక సంస్థలకే ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇది పచ్చి మోసం. స్థానిక సంస్థల పన్నులు ఎప్పుడూ స్థానిక సంస్థల దగ్గరే ఉంటాయి. కానీ రాజ్యాంగ బద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ నుండి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. నిధులలో కోత పెడుతున్నాయి. మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. ఎన్నికైన కౌన్సిళ్లు లేవు. ఎన్నికైన కౌన్సిళ్లు లేని సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని స్థానిక సంస్థలపై పన్నుల విధానాన్ని రుద్దటం అప్రజాస్వామికం. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం...రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై పెత్తనం చేస్తూ ప్రమాదకర విధానాలు రుద్దుతూ ఫెడరల్ స్ఫూర్తిని, స్థానిక సంస్థల స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బ తీస్తున్నది.
అందరిదీ ఒకటే దారి
మున్సిపాలిటీలో పన్నులు ఎలా ఉండాలో? ఏ పద్ధతిలో ఉండాలో నిర్ణయించుకునే అధికారం స్థానిక సంస్థలకు, ప్రజలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంస్కరణలను మెచ్చుకుంటూ పార్లమెంట్‌లో ఆమోద ముద్ర వేస్తున్న టిడిపి రాష్ట్రంలో మాత్రం పన్నుల భారం పెరిగిందని మాట్లాడటం హాస్యాస్పదం. 2018లో మంచి నీటి చార్జీలు, నీటి మీటర్ల కోసం కేంద్రం పెట్టిన అమృత్ పథకం ఆధారంగా చార్జీలు పెంచడానికి అవకాశం కల్పించే జీఓ 159 ఆనాటి టిడిపి ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం వైఎస్‌ఆర్ ప్రభుత్వానికి అదే ఆదర్శం అయింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నులలో పది శాతం వరకు రాయితీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అదాని కంపెనీ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కు ఏడేళ్లపాటు పనులలో పూర్తి రాయితీలు ఇచ్చింది.
బడా కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మాత్రం భారాలు మోపడం శోచనీయం. పన్నుల భారాలు పెంచటమే కాదు, పౌర సేవల బాధ్యతల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవటం ప్రమాదకరం. క్రమంగా ప్రైవేటు కంపెనీలకు పౌర సదుపాయాలు ధారాదత్తం చేసే కుట్రలు ఇమిడి ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే కేంద్రం ఆదేశాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం చట్టాల మౌలిక స్వభావాన్ని మార్చేసింది. అందుకే తక్షణ పన్నుల భారాలతో పాటు విధానాల ప్రమాదాన్ని గుర్తించాలి, ఎదుర్కోవాలి. పౌర సంఘాలు, అసోసియేషన్లు ఉమ్మడిగా ప్రతిఘటించాలి. దశలవారీ ఉద్యమాలకు సిద్ధం కావాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం కృషి చేయాలి.
(వ్యాసకర్త 'ఆంధ్ర ప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య' కన్వీనర్)
సిహెచ్.బాబూరావు











