- 'జనం కోసం సిపిఎం'లో నేతల ఎదుట కూలీల ఆవేదన
- ప్రజా సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన
ప్రజాశక్తి-యంత్రాంగం :'జనం కోసం సిపిఎం' కార్యక్రమంలో గుర్తించిన స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు మంగళవారం ధర్నాలు చేశారు. పన్నుల భారాలు మోపవద్దని, తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులకు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఉపాధి పనులు కల్పించాలని కోరారు. అనంతరం అధికారులుకు వినతిపత్రాలు అందజేశారు. పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురంలో కూలీలు సిపిఎం నేతల ఎదుట వాపోయారు. తాము ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని, ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని పలువురు ఇంటి స్థలాల లబ్ధిదారులు నేతల దృష్టికి తీసుకొచ్చారు. అర్హులకు పింఛన్లు ఇవ్వడంలేదని, ఆస్తి, చెత్త పన్నులు బలవంతంగా వసూలు చేస్తున్నారని నెల్లూరు నగరంలోని 21, 30, 31వ డివిజన్లలో ప్రజలు తెలిపారు.
సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
అల్లూరి జిల్లా ఎటపాక వైటిసి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలివ్వాలని, పోడు సాగుదారులపై అటవీ అధికారుల నిర్బంధం ఆపాలని డిమాండ్ చేశారు. వలస ఆదివాసీ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, వలస ఆదివాసీ గ్రామాల్లో విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట సెజ్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని, ఎన్‌ఎఒబి గ్రామాల మత్స్యకారులకు జెట్టీ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కె.కోటపాడులో పారిశుధ్యం మెరుగుపర్చాలని, డ్రెయినేజీలు ఏర్పాటు చేయాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని, వీధి లైట్లు వేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. శ్రీకాకుళంలోని 13వ వార్డులో గుర్తించిన సమస్యలపై వార్డు సచివాలయం వద్ద ధర్నా చేసి, సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు జిల్లాలో ప్రజా సమస్యలపై సచివాలయాల వద్ద ధర్నాలు చేశారు.










