Oct 08,2020 21:14

ఎండిన వరి పొలాలను చూస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు, నందిగాం, కంచిలి, సోంపేట: శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వజ్రపుకొత్తూరు, నందిగాం, కంచిలి, సోంపేట మండలాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం పర్యటించిన సిపిఎం ప్రతినిధి బృందం, కరువు కారణంగా పాడైన పంట పొలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ప్రతినిధి బృందం వద్ద ఏకరువు పెట్టారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంట ఎండిపోయిందని, ఎకరాకు రూ.16 వేలు వరకు ఖర్చు చేశామని పలువురు రైతులు వాపోయారు. సాగునీటి కోసం పలుమార్లు వంశధార అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వర్షాభావం కారణంగా కొంత, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరందక మరికొంత పంటలు పాడయ్యాయని తెలిపారు. జిల్లాలో వంశధార కాలువ శివారు భూములకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నీరు ఇవ్వలేకపోవడానికి కాలువ గట్ల మరమ్మతులే కారణమని చెప్తున్నారే తప్ప, సమస్యను పరిష్కరించడం లేదని తెలిపారు. చెరువులను నీటితో నింపి, గ్రామాలకు సాగు నీరందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. పైడిగాం కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని, లెడ్డాగుడ్డి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలన్నారు. అప్పుడే సోంపేట, కంచిలి మండలాల రైతులకు సాగు నీరందుతుందన్నారు. కంచిలిలో ఉన్న జలంత్రకోట సాగర్‌ పనులు పూర్తి చేయాలన్నారు. మహేంద్రతనయ నదిలో పుష్కలంగా నీరున్నా, పైడిగాం ఛానల్‌ ద్వారా నీరు రాక పంటలు ఎండుతున్నాయన్నారు. 16 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు మూడేళ్లయినా పూర్తి కాలేదని చెప్పారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. కరువు ప్రాంతాల్లో రబీ పంటలకు అవసరమైన వేరుశనగ, మినుము, పెసలు విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో తక్షణమే ఉపాధి హామీ పనులను ప్రారంభించాలన్నారు. ప్రతినిధి బృందంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, ఎం.తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.సింహాచలం ఉన్నారు. వారి వెంట పర్యటనలో సిపిఎం నాయకులు బి.రామకృష్ణ, ఎం.మహేష్‌, సాంబమూర్తి, ఎస్‌.లక్ష్మీనారాయణ, కె.గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.