అది ఏప్రిల్ 10, 2020.. కరోనా లాక్‌డౌన్ ఉధృతంగా అమలవుతున్న రోజులు. మూడు నెలల గర్భిణి సఫూరా జర్గార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ''ఆమె హిందువులను చంపే టెర్రరిస్టు.. ఆమెతో ఎవరూ మాట్లాడొద్దు..'' అని జైలు అధికారులు ఇతర ఖైదీలను ఆదేశించారు. కానీ, ఆమె చేసిన నేరం.. ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొనడం. గర్భిణులకు వైరస్ త్వరగా సోకుతుందని సాకుతో ఆమెను అరెస్టు చేసి టెర్రరిస్టు ముద్ర వేశారు. ఇదంతా రెండు నెలల తర్వాత విడుదలైన సఫూరా జర్గార్ ఆవేదనతో చెప్పుకున్న నిజాలు. ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమయ్యాయి. ఆమె లాగా అరెస్టయిన అనేకమంది జైల్లోనే ఉండిపోయారు. అయితే ఇది కేవలం ఇండియా లోనే కాదు. ఆసియా లోని చాలా దేశాలలో ప్రభుత్వాలు తాము తయారు చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలను కఠినంగా అమలు చేయడానికి కరోనా వైరస్‌ను వాడుకున్నాయి. కరోనా లేకుంటే ఈ ఉద్యమాలు తీవ్రరూపం దాల్చేవి. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చేది. కానీ నేతలు ఈ చట్టాలను వెనక్కి తీసుకోకపోగా, ప్రజల దృష్టిని మరల్చి తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించారు.
భారత్‌లో సఫూరాతో పాటు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 83 ఏళ్ల ఓ మత ప్రచారకుడిని కూడా అరెస్టు చేశారు. దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బెయిల్‌కు వీలు లేని అభియోగాలు మోపి జైల్లో పెట్టారు. ఈ అరెస్టులు, అణచివేతలు వివిధ సంఘాలకు ఒక సందేశాన్నిచ్చాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఐదు సంస్థలు పేర్కొన్నాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆయా సంస్థలు ప్రభుత్వాలకు సూచించాయి. అయినా అరెస్టులు కొనసాగాయి. అరెస్టయినవారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రకటించిన పలు ప్రభుత్వాలు, వారిని వెంటాడి వేధిస్తున్నారన్న వాదనలను ఖండిస్తూ వచ్చాయి.
ఫిలిప్పీన్స్‌లో గుండె సంబంధ వ్యాధులతోపాటు ఆస్తమాతో బాధపడుతున్న తెరెసిటా నౌల్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆమెపై కిడ్నాప్ అభియోగాలు మోపింది. ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని అభియోగాలున్న 400 మందితో కలిపి ఆమెను మీడియా ముందు పరేడ్ చేయించారు పోలీసులు. వీరిలో జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలే ఎక్కువ. ఇక జారా అల్వారెజ్, రాండాల్ ఎచెయిన్స్ లాంటి కార్యకర్తలపై దాడులు చేసి చంపేశారు.
''ప్రజల ఉద్యమాలకు వైరస్ శత్రువులా మారింది. మహమ్మారితో పోరాడుతున్నామన్న పేరుతో ప్రభుత్వాలు తమ నిరంకుశ చట్టాలను అమలు చేశాయి..'' అంటారు గ్లోబల్ అలయన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్‌కు చెందిన జోసెఫ్ బెనెడిక్ట్. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు తమపై ఉన్న వ్యతిరేకతను తీవ్రంగా అణచివేశాయని, ఆఖరికి కరోనాను ఎదుర్కోవడంలో తమ వైఫల్యాలను కూడా బైటికి రాకుండా జాగ్రత్త పడ్డాయని 'సివికస్' తాజాగా విడుదల చేసిన 'ఎటాక్ ఆన్ పీపుల్ పవర్' నివేదికలో పేర్కొంది. పెరిగిన నిఘాతో కఠినమైన నిబంధనల మాటున ప్రభుత్వాలు తమపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డాయని, దీంతో చాలా చోట్ల ఈ వ్యతిరేకతలు అణచివేతకు గురయ్యాయని ఈ నివేదిక తెలిపింది. కనీసం 26 దేశాలలో కఠినమైన నిబంధనలను అమలు చేశారని, మరో 16 దేశాలో మానవ హక్కుల కార్యకర్తలపై విచారణలు, అరెస్టులు, శిక్షల అమలు జరిగాయి.
ఫిలిప్పీన్స్‌లో ప్రముఖ మీడియా సంస్థ ఎబిఎస్-సిబిఎన్ ను బలవంతంగా మూతపడేలా చేయడంతో కరోనా మహ్మమ్మారి వార్తలు కూడా బయటకు రాలేదు. కానీ ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో మాత్రం తన పాపులారిటీని పెంచుకున్నారు. కరోనా విషయంలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న నెపంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేక వెబ్‌సైట్లను మూసేయించింది. హక్కుల సంఘాలను అణచి వేయడానికి కరోనా మహమ్మారిని సర్కార్లు చాకచక్యంగా ఉపయోగించుకున్నాయని నేపాల్‌కు చెందిన హక్కుల కార్యకర్త బిద్య శ్రేష్ఠ చెప్పారు. నీవర్ తెగకు చెందిన ఓ సంప్రదాయ నివాస ప్రాంతాన్ని తొలగించి రోడ్డు వేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా నేపాల్ ప్రభుత్వం పక్కనపెట్టింది. థారులాండ్, శ్రీలంక, వియత్నాం దేశాలలో అనేకమందిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులకు పాల్పడ్డారు. వీరందరిపైనా కరోనాపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న అభియోగాలు మోపారు. వాక్ స్వాతంత్య్రాన్ని హరించి వేడయానికి మయన్మార్ ప్రభుత్వం టెర్రరిజం అనే మాటను విస్తతంగా వాడుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కరోనా కారణంగా నిలిచిపోయింది. ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈ ఆందోళన కీలకంగా మారింది. ఇంకా పురుడు పోసుకోవాల్సిన అనేక ఉద్యమాలు కరోనా కారణంగా పుట్టకుండానే గిట్టాయి.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్










