కరోనా అని పిలువబడే నేను పుట్టి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా నా అనుభవాలు, ముఖ్యమైన ఘట్టాలు 'డైరీ-2020'లో పొందుపర్చాలని నిర్ణయించుకున్నాను. డైరీ అంటే దినచర్య రాసుకోవటం కదా! అంతా కలిపి ఒకేసారి రాస్తే డైరీ ఎట్లా అవుతుంది అని మీరడగవచ్చు. కానీ నాకు అంత తీరికెక్కడిదీ. నా దెబ్బ రుచి చూసిన వాళ్ళను లెక్కపెట్టుకోవటానికి ఎంతోమంది డాక్టర్లు, ఆఫీసర్లే చాలలేదు! ఇక నేను డైరీ రాసుకునేంత తీరికగా ఉన్నానా చెప్పండి! ప్రపంచంలో నాకు ఎన్ని అనుభవాలు ఉన్నాయి. కాని నేను భారతదేశానికి పరిమితమైన అనుభవాలే రాస్తాను.
డిసెంబర్ 2019లో చైనాలోని ఊహాన్ నగరంలో నన్ను మొదటిసారిగా గుర్తించారు. అక్కడే మొదటి మరణం కూడా సంభవించింది. చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారంలో ఉండటం, అమెరికాను మించిపోయేలా చైనా అభివృద్ధి సాధించటం కొందరికి గిట్టదు కదా! ఇదే అదనుగా, చైనా శాస్త్రవేత్తలే నన్ను సృష్టించారని, అసలు నా పేరే 'చైనా వైరస్' అంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. కానీ నాలాంటి వైరస్‌ను పరిశోధనాశాలల్లో సృష్టించటం సాధ్యం కాదని ఈ మూఢులకు తెలియదని నాకు అర్ధమైంది!
ఊహాన్ లో మొదలైన నా ప్రభంజనం ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసింది. నన్ను నిర్లక్ష్యం చేసిన వారికి నా తడాఖా చూపించాను. మాస్కులు కట్టుకుని, చేతులు శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించి, నా పట్ల భయభక్తులు ప్రదర్శించిన వారిని నేను కూడా గౌరవించాను. వారి దగ్గరికే నేను పోలేదు. దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు నన్ను అదుపులో పెట్టేందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించి, లాక్‌డౌన్ పెట్టి, కొన్ని కఠిన చర్యలు తీసుకున్నాయి.
కానీ నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దేశాలు అమెరికా, ఇండియా మాత్రమే. అందుకే ఈ రెండు దేశాల్లో నా కాటుకి కోటి మందికి పైగా బలయ్యారు. ఇండియా ప్రధానికి రాజుకు ఉండే లక్షణాలే అధికం. అందుకే ఆయనకు వందిమాగధులు ఎక్కువ. వారు ఆయన ఏం చేసినా 'ఆహా! ఓహో!' అనటం తప్ప మరొకటి చేయరు. నేను విస్తరించటం ప్రారంభించాక మూడు నెలలకు గాని లాక్‌డౌన్ పెట్టలేదు. ఈ లోగా ఎంచక్కా బోయింగ్ విమానాలు ఎక్కి హాయిగా ఇండియాలో ల్యాండ్ అయ్యాను. అయినా ఏలినవారికి సోయి లేదు. అమెరికాలో ట్రంప్ మరోసారి గెలవటానికి గుజరాత్‌లో లక్ష మందితో ''నమస్తే ట్రంప్'' అంటూ పెద్ద మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్‌కి వచ్చిన లక్షల మందిని ఒకేదగ్గర చూసి నా కొమ్ములు మరింత పెరిగాయి. నిజం చెప్పాలంటే.. నా అభివృద్ధికి మోడీ చేసిన కృషి చూసి నాకు ఎంత ముచ్చటేసిందో..! పెద్ద నగరాలకే పరిమితమైన నేను ''నమస్తే ట్రంప్''ను సువర్ణావకాశంగా తీసుకుని దేశమంతా విస్తరించాను.
ప్రపంచం అంతా లాక్‌డౌన్ విధిస్తున్నా, చౌకీదార్ మాత్రం వేరే అత్యవసరమైన పని పెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫిరాయింపుల ద్వారా పడగొట్టి, తమ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాడు. ఆ తర్వాతే, మళ్ళీ అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ను ప్రకటించాడు. అంతే లక్షలాది మంది వలస కార్మికులు దిక్కులేని వారయ్యారు. ప్రజల ప్రాణాల పట్ల నేను ఎంతో నిర్దయగా ఉన్నాను. ఎందుకంటే నేను మనిషిని కాను. సంతోషం, దు:ఖం లాంటి అనుభూతులు నేను పొందలేను. కాని తనను నమ్మి రెండవసారి గద్దెనెక్కిన ప్రజల పట్ల పాలకులు ఇంత కర్కశత్వం చూపుతారా! నడవలేని తన మూడేళ్ల కొడుకును ట్రాలీ సూట్‌కేస్ మీద నిద్రపుచ్చి, రోడ్డుపై లాక్కెళుతున్న తల్లిని ఆదుకోలేని ఈ ప్రభుత్వాలెందుకు? అన్పించింది!
మార్చిలో లాక్‌డౌన్ అకస్మాత్తుగా విధించటం వల్ల ఏ పూటకాపూట కష్టం చేసి కడుపు నింపుకునే కష్టజీవులు ఇబ్బందులు పడ్డారు. కానీ నేనేమీ ఇబ్బంది పడలేదు. అప్పటికే దేశమంతా విస్తరించిన నేను, నా సత్తా చూపుతూనే ఉన్నాను. అప్పుడు చౌకీదార్ నన్ను ఎదుర్కొనేందుకు ఇచ్చిన కార్యక్రమం నాకు భలే కామెడీగా అన్పించింది! చప్పట్లు కొట్టాలని, పళ్ళాలు మోగించాలని పిలుపునిచ్చాడు. ఆ శబ్దాలకు కరోనా భయపడి పారిపోతుందని చౌకీదార్ వందిమాగధులు సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. వీళ్ళ లెక్కకి ఒక లెక్కా డొక్కా ఏమీ లేవు! నాకు చెవులు లేనే లేవు. ఇక నాకేం వినబడతుందీ! ఉన్నవి కొమ్ములు మాత్రమే! అందుకే ఆ కొమ్ములతో ఢిల్లీ అమిత్ షా తో సహా ఎందరినో కసిదీరా పొడిచేశాను. దెబ్బకి ఎయిమ్స్, నానావతి వంటి దావాఖనాల్లో పడ్డారు!
దేశమంతా నా విజృంభణ కొనసాగుతుండగా, చౌకీదార్ మరో కార్యక్రమం ఇచ్చాడు. రాత్రివేళ కరెంట్ బంద్ చేసి, దీపాలు ముట్టించమన్నాడు. మళ్ళీ వందిమాగధులు సోషల్ మీడియాలో దుమ్ము లేపారు. దీపాల వెలుతురికి కరోనా గుడ్‌బై చెబుతుందని, వేడికి కాలిపోతుందని అడ్డగోలు వాదనలు చేశారు. నాకు అసలు కళ్ళే లేవని, దీపాలతో వచ్చే వేడి నాకు చలి కాచుకునేందుకు కూడా చాలదనే చిన్న లాజిక్ కూడా వందిమాగధులు మిస్సయ్యారు!
'యథా రాజా తథా ప్రజా' అన్నట్టు, చౌకీదార్ మంత్రులు, మిగిలిన వంది మాగధులు అనేక తెలివి తక్కువ వేశాలు వేశారు. ఒకడు ఆవు పేడతో స్నానం చెయ్యాలన్నాడు. మరొకడు ఆవు మూత్రం తాగాలన్నాడు. ఇంకొకడు అప్పడాలు తినాలన్నాడు. మరొకడు మంత్రాలు వేయాలన్నాడు, ఇంకొందరు మహానుభావులు 'గో కరోనా గో' అంటూ పాటలు పాడి డాన్సులు చేశారు. ఇంకొక సాధ్వీమణి హనుమాన్ చాలీసా చదవాలన్నది. ఇవన్నీ చేయటం ద్వారా నన్ను అంతమొందిస్తామని ప్రచారం చేశారు. ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు చెపితే అది నిజమైపోతుంది అనే ఫార్మూలా అమలు అవుతున్న దేశం కదా! ఈ గోబెల్స్ ప్రచారాలు బాగా చొచ్చుకుని పోయాయి. ఇలాంటి మంత్రాలకు చింతకాయలే రాలవు! నేను రాలుతానా! ఇలాంటి మూఢ విశ్వాసాలను ప్రచారం చేసేవాళ్ళందరినీ ఓ చూపు చూశాను. అంతే! ఆవు పేడ తినాలన్న వాడు, ఆవు మూత్రం తాగాలన్నవాడూ, అప్పడాలు తినాలన్నవాడూ, గో కరోనా అంటూ డాన్సులు చేసినవాడు, నన్ను కాలి కిందేసి తొక్కిన ఫాస్టర్, చీపురుకట్టతో కొట్టిన ఫకీరు, మంత్రాలు చదివిన అయ్యగారు అందరూ నా దెబ్బకి మంచాలెక్కారు! కళ్ల ముందే మృత్యుదేవతను పెట్టుకుని 21 రోజులు దిక్కూ మొక్కూ లేకుండా గడిపారు!
మరికొందరు కార్పొరేట్లు మాత్రం తమ ఆస్థులు పెంచుకునేందుకు ఇదే అదనుగా ప్రయత్నించి, రెండు చేతులా సంపాదించారు. దేశ సంపదను తమ జేబుల్లో నింపుకున్నారు. చౌకీదార్ ప్రభుత్వం వారికోసం కార్మిక రైతు చట్టాలు మార్చివేసింది! ప్రతిపక్షాలు కూడా లేకుండా చట్టాలు చేసిందంటే కార్పొరేట్లకి ఎంతగా దాసోహమయ్యిందో తెలుస్తున్నది.
ఇదంతా ఇలా సాగుతూనే ఉండగా, నన్ను కంట్రోల్ చేశామని అనుకుంటున్న వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాను. బ్రిటన్‌లో నేను పరివర్తన చెంది, కరోనా స్ట్రెయిన్‌గా మరింత బలంగా ముందుకు వచ్చాను. నేను 23 రకాలుగా మార్పు చెందానని శాస్త్రవేత్తలు ప్రకటించారు. నేను ఎన్ని మార్పులకు గురి అవుతున్నానో శాస్త్రవేత్తలు బాగానే గుర్తిస్తున్నారు. పాపం వాళ్ళకి వేరే స్వార్థం లేదు కదా!
మొత్తానికి నాపై విజయం సాధించే ప్రయత్నంలో మనిషి చివరి మెట్టు ఎక్కేసినట్టున్నాడు. వ్యాక్సిన్ తయారు చేయటంలో అనేక దేశాలు పోటీ పడ్డాయి. అన్నీ విజయం సాధించినట్టు ప్రకటించుకుంటున్నాయి. కేవలం రెండవ, మూడవ దశ ప్రయోగాలు మాత్రమే చేసి, వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఆయా కంపెనీలు చెప్పుకుంటున్నాయి. కీలకమైన ప్రయోగ దశను నేరుగా ప్రజలందరిపైనా ప్రయోగిస్తున్నట్లు కనపడుతున్నది. పాపం ప్రభుత్వాలు! నన్ను కంట్రోలు చేయలేక, పూర్తిగా ప్రయోగాలు చేయని టీకాలు ఇచ్చి, ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో నాలాంటి భయంకరమైన వైరస్‌లు శాస్త్రవేత్తలకు లొంగాయని తెలుసుకున్నాను. నేను కూడా ఈరోజు కాకపోతే రేపైనా లొంగవచ్చు!
అయితే చౌకీదార్‌ను, ఆయన వంధి మాగధులను చూస్తే నాకు జాలి, అసహ్యం రెండూ ఒకేసారి కలుగుతున్నాయి. తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కుట్రలు చేసిన తర్వాతే లాక్‌డౌన్ విధించారు. లక్షలాది మంది వలస కార్మికులను దిక్కులేని వారిగా చేసి వందల కిలోమీటర్లు నడిపించారు. తర్వాత రైళ్ళు ఏర్పాటు చేసి రెండింతలు ఛార్జీలు వసూలు చేశారు. ఈ చౌకీదార్ ఇంత విపత్తులో కూడా విమానాశ్రయాలు, ఓడరేవులు ఆదానికీ.. టెలికం, కిరాణాషాపులు, చమురు మొదలైనవి అంబానీకీ కట్టబెట్టి వారి ఆస్తులు పెంచాడు. మరోపక్క మూఢ విశ్వాసాలు విపరీతంగా ప్రచారం చేసినా ఫలితం లేదని తేలటంతో, గతిలేక వ్యాక్సిన్ వైపు మళ్ళారు. ఇందులో కూడా ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. నా మీద విజయం సాధించాలంటే... వ్యాక్సిన్, ఇతర శాస్త్రీయ విధానాలే శరణ్యమని గుర్తించినట్లైతే... తాము గతంలో ప్రచారం చేసిన మూఢ విశ్వాసాలు తప్పని ఈ దేశ ప్రజలకు చౌకీదార్ క్షమాపణ చెబుతారా! లేక తమ గోబెల్స్ ప్రచారం మరో విధంగా కొనసాగిస్తారా? చూద్దాం! 2021లో ఏం జరుగుతుందో..!
- ఉషాకిరణ్










