Jul 05,2023 08:07

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ : 'టిడిపి హయాంలో విజయా డెయిరీని భూస్థాపితం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రెండు దశాబ్దాలుగా మూతబడి ఉన్న ఈ డెయిరీ రూ.182 కోట్ల అప్పులను తీర్చి, అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకుని మరలా జీవం పోశాం' అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో ఇది మరో విప్లవాత్మక అడుగని, చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణ జరిగిందని ఉద్ఘాటించారు. వివిధ అభివృద్ధి పనులకు ఆయన చిత్తూరులో మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఏనాడో మూతబడిన అతి పెద్ద డెయిరీని తెరిపించేందుకు నాంది పలికామన్నారు. దేశంలోనే టాప్‌ త్రీ మెడికల్‌ కాలేజీల్లో ఒకటైన వెల్లూరు సిఎంసి ఏర్పాటుకు చీలాపల్లి వద్ద పునాది రాయి వేస్తున్నానని తెలిపారు. దీంతో, చిత్తూరులో మెడికల్‌ కాలేజీ కల నిజం కాబోతుందని పేర్కొన్నారు. చిత్తూరు డెయిరీని 2002లో కుట్రపూరితంగా మూసేశారని, 1992లో హెరిటేజ్‌ వచ్చే సమయానికి 2.50 లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల వరకు పాల సేకరిస్తున్న అతి పెద్ద సహకార డెయిరీని కావాలనే నష్టాల్లోకి నెట్టి మూసేశారని, తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం చిత్తూరు రైతులను చంద్రబాబు ముంచేశారని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన మాట ప్రకారం అమూల్‌ను తీసుకురావడమే కాకుండా రూ.385 కోట్ల పెట్టుబడి చిత్తూరు డెయిరీలో పెడుతున్నామని తెలిపారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలు పోస్తున్న రైతులకు ప్రతి ఆరు నెలలకొకసారి బోనస్‌ ఇచ్చి లాభాలను పంచి పెడుతున్నామన్నారు. రాబోయే 5 నుంచి 8 ఏళ్ల కాలంలో పది లక్షల లీటర్ల సేకరణ స్థాయికి వెళతామన్నారు. దీనిద్వారా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.
 

                                                          'చంద్రబాబు' అన్యాయాలు కోకొల్లలు

చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన అన్యాయాలు కోకొల్లలని, చేసిన మంచి ఒక్కటీ లేదని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు హయాంలో సహకార రంగంలోని 54 సంస్థలను మూసేశారని, రైతులకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు. 'ప్రయివేటైజేషన్‌ ఎ సక్సెస్‌ స్టోరీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, ఎన్నికలు వస్తే మాత్రం మోసం చేయడానికి విశాఖపట్నం పోయి స్టీల్‌ప్లాంట్‌ ముందు ధర్నా చేస్తానంటున్నాడని, ఆ మనిషి మనస్తత్వం ఎలాంటిదో ఆలోచన చేయాలని అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇద్దరూ నాన్‌రెసిడెంట్‌ నాయకులని విమర్శించారు. తాను అబద్దాలు చెప్పలేనని, మోసాలు చేయలేనని, దేవుడిని, ప్రజలను మాత్రమే మిగతా 2లో నమ్ముకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కె రోజా, వి.రజని, అప్పలరాజు, ఎంపి రెడ్డెప్ప, జడ్‌పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్‌ సగిలి షణ్మోహన్‌ పాల్గొన్నారు.
 

                                                                        వామపక్ష నేతల అరెస్ట్‌

సిఎం పర్యటన ముందు రోజు సోమవారం నుండీ సిపిఎం జిల్లా కార్యదర్శి వి.గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల కళ్లుగప్పి వీరు గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన తెలిపేందుకు మంగళవారం ఉదయం ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సిఎం పర్యటన అనంతరం వారిని విడుదల చేశారు