
కొత్త సంవత్సరానికి మనం గ్రాండ్‌గా స్వాగతం పలికినా.. మామూలుగా స్వాగతం చెప్పినా.. అసలు స్వాగతించనూ అన్నా.. న్యూ ఇయర్ వచ్చి తీరుతుంది. మనం కాదనుకున్నా.. కావాలనుకున్నా.. క్యాలెండర్ మారే తీరుతుంది. కాలం ముందుకే సాగుతుంది. దాన్ని నియంత్రించడం మన చేతుల్లో ఉండదు. కాలం ఎవరి కోసం ఆగదు.. అదో నిత్య చలనశీలి. క్షణాలు.. నిమిషాలు.. గంటలు.. రోజులు.. నెలలు.. సంవత్సరాలు.. ఇలా పరుగులు తీస్తూనే ఉంటుంది. మన కార్యక్రమాలన్నీ ఆ కాలంతోనే కలిసిపోతూ కొనసాగాల్సిందే.. కొత్త సంవత్సరం వస్తుందనగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది సర్వసాధారణం. అవి ఆచరిస్తామా? లేదా? అన్నది తర్వాత విషయం.. అయితే ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ లేనిదీ కొన్ని ప్రత్యేకమైన సవాళ్లతో ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం.. ఆ ప్రత్యేక సవాళ్లు గురించే ఈ వారం కథనం.. ఈ సారి కరోనాతో 2019 కొత్త పాఠాలను నేర్పింది.. అయితే ఇదో పెద్ద సవాలుగా ఇంకా కొనసాగుతోంది. దీని పర్యవసానాలు అని కాదుగానీ.. ఈ ఏడాది ప్రత్యేకంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉత్పత్తి రంగంలో సవాళ్లు ఎదుర్కోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయా రంగాల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలో చూద్దాం..
వ్యవసాయ రంగం :
భూమిని నమ్ముకున్న రైతు ఏళ్లకు ఏళ్లు మోసపోతూనే ఉన్నాడు. దళారీల వల్ల, అప్పులపాలైనా, ప్రకృతి ప్రకోపించినా.. రైతు వ్యవసాయం చేయడం ఏనాడూ మానలేదు. అమాంతం రైతుని, భూమిని మింగేసేందుకు కాలనాగుల్లాంటి కార్పొరేట్‌లకే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అందుకే రైతు భూమి నుండి రోడ్డు మీదకు వచ్చాడు. ఇప్పుడు రైతు ఉద్యమం దేశరాజధానిలో మహోద్యమంగా సాగుతోంది. కుటుంబాలతో సమేతంగా పిల్లా పాపలతో.. వండుకుంటూ, ఆకుకూరులు పండిస్తూ.. పోరాట సేద్యమే చేస్తున్నారు. అయినా ప్రభుత్వం బండరాయిలానే ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ఇది ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
- వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది.
- కాగితంపైనే కనీస మద్దతు ధర. గిట్టుబాటు ధర అందని పరిస్థితి.
- మూడు నల్ల చట్టాలతో ఇప్పుడు రైతులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టినట్లే! ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా.
- ఈ ప్రభావం రైతులపైనే కాదు పంటలపైనా, వాటి ధరలపైనా ఉంటుంది.
- సామాన్యుడూ కొనలేని పరిస్థితి.
- ఏం కొనాలో, ఏం తినాలో కార్పొరేట్లే నిర్ణయించేలా చేసేవే ఈ నల్లచట్టాలు.
- ఇక కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు గుర్తింపే లేదు.
- ఉపాధి లేక వివిధ పనుల్లోకి చిన్న, సన్నకారు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వెళ్లాల్సిన పరిస్థితి. వీళ్లంతా ఆందోళనలో ఉన్నారు.
- రైతులే కూలీలుగా మారే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
ఆరోగ్య రంగం :
'వైద్యో నారాయణో హరి!' అన్నట్లు ఉంది పరిస్థితి. కరోనాతో కార్పొరేట్ వైద్యంలోని డొల్లతనం బట్టబయలైంది. ప్రభుత్వరంగంలో ప్రజారోగ్యం లేకపోవడం ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. ఇక మాతృత్వాన్నీ ఆస్వాదించలేని సంకటస్థితి. ప్రసవించే స్త్రీల అవస్థలు అంతా ఇంతా కాదు. ప్రసవం సుఖంగా అవుతుందో లేదో అన్నదే ఒకప్పటి భయం. ఇప్పుడు కరోనా ఎక్కడ వస్తుందోనన్నది మరో ఆందోళన. తల్లిని కాపాడుకున్నా.. పుట్టిన బిడ్డకూ కరోనా సోకే ప్రమాదాలు పొంచే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి. కరోనా వస్తే లక్షల్లో ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఆస్తులూ అమ్ముకున్న వైనాలు ఉన్నాయి.

- కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ఎదుర్కోవాల్సి ఉంది.
- కరోనా వ్యాక్సిన్ సామాన్యులకూ అందాలి.
- కొత్త వైరస్ రావడంతో ఇప్పటివరకూ చేసిన పరిశోధనలు.. పర్యవసానాలు చూడాలి.
- వైద్య కళాశాలలు, వైద్య పరిశోధనలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం అత్యవసరం.
- ఇది చాలా కీలకమైన రంగం. దీనికి నిధులు కేటాయించాలి.
- ఇప్పుడున్న వైరస్‌లను.. రాబోయే కొత్త వైరస్‌లను ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సన్నద్ధం కావాలి.
- ఔషధ పరిశ్రమలు కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి.
కార్మిక రంగం :
బృహత్తర పోరాటాలకు సారథ్యం వహించాల్సిన కార్మికవర్గం.. సంఘటిత శక్తిగా లేదు. నూతన ఆర్థిక విధానాలతో రకరకాల పేర్లతో శ్రామికులంతా చెల్లాచెదురయ్యారు. శ్రమజీవులు సంఘటితమవ్వని అసంఘటితం రంగం పెరిగిపోయింది. ఇంటి దగ్గర పనిచేసే పీస్ వర్కర్ల దగ్గర నుండి రోడ్ల మీద పళ్లు అమ్ముకునే వారి వరకూ రకరకాల రూపాల్లో అసంఘటిత రంగం విస్తరిస్తోంది. ఎక్కువ మంది కార్మికులు ఈ రంగంలోనే ఉన్నారు. ప్రధానంగా స్త్రీలు ఈ రంగాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చట్టాలను రద్దు చేసి, కార్మికరంగంపై పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు.

- ఉద్యోగ భద్రత పెద్ద సమస్యగా మారనుంది.
- కార్మికరంగంలో అత్యధికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు.
- ఈ రంగంలో అత్యధికులుగా మహిళలే ఉన్నా.. వారికి కనీస సదుపాయాలు లేవు.
- శ్రామిక మహిళలు ప్రధానంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
- సుప్రీం కోర్టు తీర్పు నేటికీ అమలుపరచని దుస్థితి.
- శ్రమకు తగ్గ వేతనం లేదు. కనీస వేతన చట్టం అమలుకాని పరిస్థితి.
- నాలుగు చట్టాలను రద్దు చేసి, కార్మికరంగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
విద్యా రంగం :
బాల్యం ప్రకృతితో మమేకమై ఉంది. అలాంటిది ఇప్పుడు పిల్లలు హాయిగా ఆడుకొనే అవకాశమే లేదు. సెలవుల్లో, పండగ వేళల్లో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఊళ్లకు వెళ్లాలనుకునే పిల్లలకు ఇప్పుడు అవన్నీ తీరని కోరికలే. ఎక్కడో కొందరు ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నా.. చాలామంది పిల్లలు ఊళ్లు వెళ్లే పరిస్థితి లేదు. పిల్లల్ని కొత్తగా స్కూల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు కన్న కలలు కల్లలవుతున్నాయి. పిల్లలు కొత్త స్కూల్ డ్రెస్, కొత్త బ్యాగ్ వేసుకుని బుజ్జి బుజ్జిగా తయారై వెళ్లాలనే వారి ఉబలాటం ఆవిరైపోతుంది. స్కూలు వెళ్లననే పేచీలు, మురిపించి, మైమరిపించి పంపే మురిపాలు లేవు. ఆన్‌లైన్ చదువు కొనసాగించే వారి పరిస్థితి మరోలా ఉంది.

- ఆన్‌లైన్ చదువులు పిల్లల భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి.
- ఆడపిల్లలు లైంగిక వేధింపులకూ గురవుతున్నారు.
- ఆటపాటలు.. స్నేహసంబంధాలు.. భౌతికంగా లేకపోవడం పెద్ద అగాధమే.
- స్మార్ట్‌ఫోన్లు అందరూ అందరికీ సమకూర్చలేని పరిస్థితి. దీంతో కొందరు ఈ ఏడాది విద్యకు దూరమయ్యారు.
- పాఠశాలలు తెరవకపోవడంతో మధ్యాహ్నం భోజనం లేక పేద పిల్లలు తిండికీ దూరమైన దుస్థితి.
- నూతన విద్యావిధానం ప్రయివేటు, కార్పొరేట్ విద్యకు పెద్దపీట.
- ఈ విధానపత్రం కుల, మత, భాష, పురుషాధిక్య భావజాలంతో కూడుకుని ఉంది.
- విద్యార్థులు కోల్పోయిన విద్యాసంవత్సరం పూడ్చేది ఎలా? వారి భవిష్యత్తు ఏమిటి?
- టీచర్లకూ ఆన్‌లైన్‌లో బోధన కత్తిమీద సామే.
- కొత్త ట్రాన్స్‌ఫర్ విధానం వారికో పెద్ద ఆటంకంగా ఉంది.
ఆర్థిక రంగం :
ఆర్థిక సంబంధాలన్నీ మానవసంబంధాలే అన్న మార్క్స్ మహనీయుడి మాటలు అక్షర సత్యాలు. ఇప్పటికే ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభానికి కరోనా పరిస్థితులు తోడయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. ఇలాంటి తరుణంలో పాలకపక్షాలు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ప్రజానుకూల, ప్రజాభివృద్ధి ఆర్థిక విధానాలు అనుసరించాలి. కానీ మెజార్టీ పేదలను విస్మరించి, బడా కార్పొరేట్లకు, గుత్త పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోంది ఈ పాలకపక్షం.

- మసిపూసి మారేడుకాయ చేసి చూపించే పాలకుల మాయమాటలు అర్థం చేసుకోకపోతే నిలువునా మోసపోవాల్సిందే.
- ప్రజల్లో కొనుగోలు శక్తి రోజురోజుకూ తగ్గిపోతుంది.
- న ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బును ఖర్చుపెట్టడం జరుగుతోంది.
- న జిఎస్‌టి, నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీసింది లేదు.
- స్వేచ్ఛామార్కెట్ పేరుతో కార్పొరేట్ల కొమ్ముకాసే ఆర్థిక విధానాలే అన్నీ.
- ఇవన్నీ ముంచేవేగానీ పెంచేవి కాదు.
- పేదలు మరింత పేదలుగా.. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు.
- ఉపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది.
- ఆర్థిక అసమానతలు మున్ముందు మరింత పెరుగుతాయి.
మహిళా రంగం :
ఆడపిల్ల పుట్టుకే మన దేశంలో ఓ పోరాటం. బ్రూణ హత్యలు ఇప్పుడు ఏకంగా తల్లీ బిడ్డనూ కలిపి చంపేంత తీవ్రమయ్యాయి. అసమానత ప్రధాన సమస్యగా ఉంది. పురుషాధిక్య భావజాలం స్త్రీని ఇంకా వస్తువుగానే చూస్తోంది.

- అత్యాచారాల భారతంగా మారిపోయి, ఆడపిల్లల మనుగడే ప్రశ్నార్థకమైంది.
- హత్యాచారాల సంఖ్య పెరగడం ఓ ప్రమాదకర పరిస్థితి.
- వర్మ కమిషన్ సిఫారసులు అమలు నేటికీ నోచుకోలేదు.
- నిర్భయ చట్టం వచ్చినా ఆడపిల్లలపై హత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది.
- పోరాడి సాధించుకున్న చట్టాలూ అమలుకాని స్థితి.
- చట్టసభల్లో 33% రిజర్వేషన్ల బిల్లు ఇంతవరకూ ఆమోదానికి నోచుకోలేదు.
- ఆడపిల్లల చదువు గురించి పేరుకే పథకాలుగానీ, ఆచరణ శూన్యం.
- నూతన విద్యావిధానంతో ఈ వివక్ష ఎంతగా పాతుకుని ఉందో చెప్పొచ్చు.
- పాలకుల మనువాదంతో స్త్రీ పట్ల చులకన భావం మరింత పెంచి పోషించేలా ఉంది.
- ట్రాన్స్‌జెండర్ల సమస్యలపైనా నిర్దిష్ట నిర్ణయాలు చేయాల్సి ఉంది.
- ఒంటరి మహిళల గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి.
పేదలు :
పొట్ట చేతబట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, తినటానికి తిండిలేక.. అల్లాడిపోయారు. పుట్టిన గడ్డపైనే చావో బతుకు అనుకుని.. మూటాముల్ల్లె సర్దుకుని పిల్లల్ని తీసుకుని వేల కిలోమీటర్లు కాలినడకనే తిరుగు ప్రయాణం చేశారు.

- లాక్‌డౌన్ ఎత్తి వేసిన ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వెళ్లారు.. చాలామంది స్వస్థలాల్లోనే ఉన్నారు. ఉన్న వారికి ఉపాధి లేదు. కొత్త వైరస్‌తో పరిస్థితులు మళ్లీ పునరావృతం కావొచ్చు. వీరి పట్ల ప్రభుత్వాల బాధ్యతలేనితనాన్ని యావత్ భారతం చూసింది.
- స్వస్థలాలకు చేరిన పేదలకు ఉపాధి లేదు.
- లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తిరిగి వెళ్లి వారికి పనులు లేవు.
- ఓ గూడు కట్టుకోవాలనేది పేదలకు ఓ తీరని కోరిక. అద్దెలు కట్టి బతకలేని ఆర్థిక దుస్థితి.
- ఏ కట్ట మీదో.. గట్టు మీదో.. ఫ్లాట్‌ఫారం మీదో.. ఓ గుడిసె / గుడారమో వేసుకుంటే.. తొలగించేస్తారు.
- ఇంటి సమస్య ఏళ్లకు ఏళ్లు అలాగే ఉంటుంది.
- అసలే ఉపాధి లేదంటే.. కరోనాతో ఉన్న పనులూ కోల్పోయిన పరిస్థితి.
- తినడానికే తిండి లేదు.. కరోనాను ఎదుర్కోవాలంటే పోషకాహారం తప్పనిసరి.
- పైగా కరోనా రక్షణ కోసం శానిటైజర్లు, మాస్క్‌లు కొనలేని దుస్థితి.
- ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలూ తీర్చకుండా బాధ్యతల నుండి తప్పుకుంటోంది.
- యూజర్ ఛార్జీలు వసూలు చేయడంతో పేదలపై మరింత భారం.
- ఎక్కడన్నా కాస్త నీడున్న పేదలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెనుభారమే!
- ఉన్న ఇంటికి కొత్త పన్ను విధానం పులిపై పుట్రలా పడుతోంది.
- నిన్నటివరకు ఇంటి అద్దె ఆధారంగా ఇంటిపన్ను ( రూ.300)
- రేపటి నుండి - ఇంటి విలువ ఆధారంగా ఇంటిపన్ను (రూ.7500)
- పన్నుల భారం వేసే మున్సిపల్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే.
కులం, మతం :
మన దేశంలో ప్రత్యేకంగా కుల వివక్ష వేళ్లూనుకుని ఉంది. పాలకపక్షాల మనువాదం సంస్కృతి అగ్నికి ఆజ్యం పోస్తోంది.
- దళితులపై దాడులు దేశవ్యాప్తంగా పెరిగాయి. ఇకముందు మరింత ఎక్కువయ్యే పరిస్థితులు లేకపోలేదు.
- మతపరమైన దాడులూ పెరిగాయి.
- ప్రభుత్వమే అందుకు సారథ్యం వహిస్తూ ఎన్‌ఆర్‌సి, సిఎఎ వంటి వాటికి తెగబడడం చూశాం. పౌరసత్వమే ప్రశ్నార్థకం చేస్తూ.. పనిగట్టుకుని ఒక మతం వారిని నియంత్రించాలనే దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోంది. దీనికి తీవ్ర ప్రతిఘటన వచ్చింది.
- దీనికోసం పోరాడిన వారిపై 'దేశద్రోహం' నేరం మోపి, పౌరహక్కులను కాలరాస్తోంది.
- భీమా కోరేగావ్ కుట్రకేసుల్లో హక్కుల నేతలు అనేకమంది వృద్ధాప్యంతో, అనారోగ్యంతో జైళ్లలో మగ్గుతున్నారు. వీళ్లంతా ఆరోపణలు ఎదుర్కొన్నవారే.. ఇంతవరకూ నిర్ధారణ చేసిందీ లేదు.
- మున్ముందు ఈ నిర్బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సమాజాన్ని బట్టే ఆయా రంగాల నడక, నడత సాగేది. సంవత్సరాలు గడుస్తున్నా సామాన్యుడి పరిస్థితిలో మార్పు రానప్పుడు ఆ సమాజం తప్పక మారాలి. ఆ మార్పు రావడానికి భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. వాటిని అర్థం చేసుకునే చైతన్యం ప్రజల్లో కలిగించే అభ్యుదయకాముకుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ చైతన్యాన్ని ప్రజలు అందిపుచ్చుకున్నప్పుడు పోరాటాలు జరగడమే కాదు.. పోరాటాల ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం పెను సవాళ్లనే ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశాన్ని వేరే దేశం ఆక్రమించినప్పుడు స్వాతంత్య్ర పోరాటంతో విముక్తి చేసుకున్నాం. ఇప్పుడు దేశ రాజధానిలో జరుగుతున్న రైతు మహోద్యమం మనందరిలో స్ఫూర్తిని నింపుతుంది. సవాళ్లను ఎదుర్కోవడం మనకేం కొత్తకాదు.. భూమిలో విత్తనం నాటితే ఎంతో పోరాటం చేసే మొలకెత్తుతుంది. ఆ స్ఫూర్తితోనే సవాళ్లతో వస్తున్న 2021కి స్వాగతం చెబుదాం. సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుదాం.
* శాంతి శ్రీ, 8333818985