మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు
క్షతగాత్రులకు మొత్తం వైద్య ఖర్చులు భరిస్తాం
కేరళ ముఖ్యమంత్రి విజయన్
మరో రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన కేంద్రం
తిరువనంతపురం : కేరళలో కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రమాదంలో మృతి చెందిన 20 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దుబారు నుంచి వస్తున్న విమానం ల్యాండ్ అవుతుండగా, జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లుసహా 20 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా, మరో 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కోజికోడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి విజయన్, గవర్నర్ ఆరీఫ్ ఖాన్ శనివారం పరామర్శించారు. ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయన్ మాట్లాడుతూ 23 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారి చికిత్సకయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులను, అధికారులను ప్రశంసించారు. కోవిడ్-19 భయాందోళనలు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ స్థానికులు ఎంతగానో స్పందించారని, గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు లైన్లలో వేచి ఉన్నారని తెలిపారు. బాధితులను రక్షించేందుకు స్థానికులు ఉరుకులు పరుగులు పెట్టడం, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయడం, రక్తదానం చేసేందుకు బారులు తీరి ఉండటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటువంటి సంఘటన్నీంటినీ రాష్ట్రంలోనే చూశామని, ప్రతికూల పరిస్థితుల్లో స్థానికులు మానవత్వాన్ని మరోసారి నిరూపించారంటూ విజయన్ అభినందించారు. కోజికోడ్, మలప్పురం ప్రజలను మెచ్చుకునేందుకు ఒక్క క్షణం తీసుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సురక్షిత ల్యాండింగ్‌కు రెండుసార్లు ప్రయత్నం
అత్యుత్తమ పైలట్‌గా దీపక్ సాథేకు గుర్తింపు
కోజికోడ్ : కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్, కెప్టెన్ దీపక్ వి సాథె కనీసం రెండు సార్లు ప్రయత్నించినట్లు అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్ వెబసైట్‌లో ఉంచిన మ్యాప్ వెల్లడిస్తోంది.
స్వీడన్‌కు చెందిన ఫ్లైట్ ట్రాకర్ 24 సంస్థ కమర్షియల్ విమానాలకు సంబంధించి ట్రాకింగ్ సమాచారాన్ని మ్యాప్ రూపంలో అందిస్తుంది. శుక్రవారం దుబారు నుంచి కొలికోడ్ వరకూ బోయింగ్ 737 ఎన్‌జి విమాన ప్రయాణం బాగానే సాగింది. కోజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్‌టాప్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత రన్‌వే మీద నుంచి జారి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని సురక్షితంగా దింపడానికి పైలట్ రెండుసార్లు ప్రయత్నించినట్టు మ్యాప్ వెల్లడిస్తోంది. పైలట్ అంతగా ప్రయత్నించినా ప్రమాదం తప్పలేదు. అయినప్పటికీ ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారని వైమానిక వర్గాలు తెలిపాయి.
అత్యుత్తమ పైలట్
విమానాన్ని సురక్షితంగా దించేందుకు ప్రయత్నించిన పైలట్, కెప్టెన్ దీపక్ వి సాథె దేశంలోని అత్యుత్తమ పైలట్లలో ఒకరు. 1961లో ముంబైలో జన్మించిన ఆయన డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్ హాల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. తండ్రి సైన్యంలో చేరడంతో అదే ప్రేరణతో ఆయన భారత వాయుసేనలో చేరారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ముంబైలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో 1981లో ఆయన శిక్షణ పొందారు. 127వ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 'స్వార్డ్ ఆఫ్ ఆనర్' అందుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్‌వస్లాలో 58వ బ్యాచ్‌లో శిక్షణ పొంది స్వర్ణ పతకం సాధించారు. ఎయిర్‌ఫోర్సులో టెస్టు పైలట్‌గా పనిచేశారు. 1981లో వాయుసేనలో చేరి 2003లో వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం ఎయిర్ ఇండియాలో చేరారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 17వ స్క్వాడ్రన్, గోల్డెన్ యూరోస్‌లోనూ సేవలందించారు. బోయింగ్ 737-800 విమానాలను నడపడంలో ఆయనకు ఎంతో అనుభవముంది. ఎయిర్‌బస్ ఎ-310 నడిపిన అనుభవం ఉంది. కోజికోడ్ విమానాశ్రయం గురించి ఎంతో అవగాహన కూడా ఉంది. ఈ ప్రమాద జరగడం దురదృష్టకరమని, అత్యుత్తమ పైలట్ కావడం వల్లే ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారని వైమానిక వర్గాలు చెబుతున్నాయి.
మరో రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన కేంద్రం
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున అందజేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హల్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
సిపిఎం పొలిట్‌బ్యూరో విచారం
కేరళలోని కోజికోడ్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదంపై సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మఅతుల కుటుంబాలకు పొలిట్‌బ్యూరో సానుభూతి తెలియజేసింది. ఈ దుర్ఘటనకు గల కారణాలపై వెంటనే విచారణ చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావఅతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇడుక్కి ఘటనపై విచారం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో చనిపోయిన 22 మంది టీ గార్డెన్ కార్మికులు కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసింది. భారీ వర్షాల కారణంగా జరిగిన ఈ విపత్తులో అనేక మంది అచూకీ ఇంకా లభ్యం కాలేదు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.










