Sep 24,2023 14:52

తిరువనంతపురం :   రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసేందుకు సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. శనివారం త్రికరిపూర్‌లోని పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాను అధికంగా వినియోగిస్తున్నారని, అయితే మీడియాను వినియోగించేటపుడు విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. ఇతరులను వ్యక్తిగతంగా కించపరించేలా మన చర్యలు ఉండకూడదని అన్నారు.

కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ.. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ప్రధాన మీడియాతో పాటు ప్రత్యేక ఏజన్సీలను రాష్ట్రానికి తీసుకువచ్చిందని, వాటి కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్టకు దిగజార్చేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. సోషల్‌మీడియాలో వేధింపులకు పాల్పడేవారిని కనిపెట్టాలని సిపిఎం కార్యకర్తలకు సూచించారు. అలాగే ప్రభుత్వ అభివృద్థి పథకాలు, కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.

తిరువనంతపురంలోని పరశాలకు చెందిన 28 ఏళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త అబిన్‌ కోడంకర సోషల్‌ మీడియా వేదికగా సిపిఎం నేతల కుటుంబంలోని మహిళలపై వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.  అతనిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇటీవల విచారణలో భాగంగా ఓ కాంగ్రెస్‌ నేతను అరెస్ట్‌ చేశారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడానికి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ.. సోషల్‌మీడియాను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ ఘటన ద్వారా వెల్లడైందని అన్నారు.