Jun 28,2023 14:55
  • నూతన పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి 
  • ప్రముఖ పారిశ్రామికవేత్త జయ చంద్రారెడ్డి వెల్లడి 

ప్రజాశక్తి - బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులు బయట ప్రాంతాలకు వలస వెళ్లకుండా నివారించవచ్చునని ప్రముఖ పారిశ్రామికవేత్త కదిరినాయుని కోట జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.బి.కొత్తకోటలో బుధవారం మొరుసుకాపు రెడ్డి (వక్కలిగర గౌడ) సమావేశం పాల్గొన్న ఆయన స్థానిక నియోజకవర్గంలోని మొరుసుకాపుల నాయకులతో  కలసి విలేకరుతో మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని,ఇక్కడ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్యను తీర్చవచ్చని ఆయన అన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గం జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గమని ఇక్కడ మున్సిపాలిటీ గానీ,జిల్లా కేంద్రం కానీ లేదని మా నియోజకవర్గం వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉందన్నారు.ఇక్కడ సారవంతమైన భూములు ఉండడంతో పండ్లు,కూరగాయలు పంటలు ఎక్కువగా రైతులు పండిస్తారని,అయితే దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని తెలిపారు.మన తంబల్లపల్లి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఈ దళారుల చేతిలో మోసపోకుండా కట్టడి చేయవచ్చునన్నారు.ఇక్కడ ఎప్పటి నుండో వ్యవసాయానికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే దళారుల చేతిలో రైతులు మోసపోవడం జరుగుతుందన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని,ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిరుద్యోగ సమస్యను తీర్చి యువతను మంచి మార్గంలో నడిపించగలమన్నారు.తంబల్లపల్లి నియోజకవర్గానికి అతి సమీపంలో వున్న అనంతపురంలో జిల్లాలో కియా లాంటి మంచి పరిశ్రమలు ఉన్నాయని, కానీ మన తంబళ్లపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో బయట రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లి జీవించాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్ఘాటించారు.నియోజకవర్గం లో ఖనిజ సంపదకు గాని,వ్యవసాయ సంపదకు గాని ఎటువంటి లోటు లేదు కానీ ఇక్కడ పంటల్లో నష్టపోవడం,అలాగే నిరుద్యోగ సమస్య మాత్రమే ఎక్కువన్నారు.తంబళ్లపల్లి నియోజకవర్గానికి అతి సమీపంలో కొత్తపట్నం పోర్టు,చెన్నై పోర్ట్,బెంగళూరు పట్టణాలు అతి సమీపంలో ఉన్నాయన్నారు.కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములు నిరూపయోగంగా ఉన్నాయని,ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు మంచి అనుకూల వాతావరణం ఉందన్నారు.తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొరుసు కాపురెడ్డి(వక్కలిగరుగౌడ) లుఎక్కువ జనాభా కలిగి ఉన్నారని వారంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనూ, మన రాష్ట్రంలోని కుప్పం, మడకశిర నియోజకవర్గంలో బిసి-బి రిజర్వేషన్లతో వారి భవిష్యత్తు మారిందని కానీ మన తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొరుసు కాపులకు బిసి-బి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఎక్కువ శాతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో పేద రైతులే కాబట్టి ఇక్కడ కూడా మొరుసు రెడ్డిలకు బీసీ-బి సర్టిఫికెట్లు ఇస్తే చదువుకునే పిల్లలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొరుసుకు కాపు నాయకులు ఎం.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి,ఎల్ఐసి మద్ది రెడ్డి,దేవరింటి చిన్నబాబు రెడ్డి, దాదం లోకనాథ రెడ్డి, మస్తాన్ రెడ్డి, మొరుంపల్లి రమేష్ రెడ్డి, జయభరత్ రెడ్డి, మాధవ రెడ్డి,ఆకుల సురేంద్ర రెడ్డి, ఆనంద రెడ్డి,నాగిరెడ్డి, శంకర్ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, తరుగు శివారెడ్డి, రవిచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి, నరసింహారెడ్డి, శివారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.