Oct 18,2020 21:47

 శస్త్ర చికిత్స వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు

- వృద్ధురాలికి ఎక్టోపిక్‌ మూత్రపిండాల్లో రాళ్లు తొలగించిన వైద్యులు
      ప్రజాశక్తి -కర్నూలు హాస్పిటల్‌:
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం. కానీ, మూత్ర పిండాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే సంక్లిష్టమైన చోట ఉండి.వాటి చుట్టూ వేరే అవయవాలు కూడా ఉన్న స్థితిలో వాటిలో ఉన్న రాళ్లను తీయడం అంత సులభం కాదు. మూత్రపిండాలు ఇలా వేరేచోట ఉండటాన్ని ఎక్టోపిక్‌ కిడ్నీ అంటారు. సుమారు 3-4వేల మందిలో ఒకరికి మాత్రమే ఇలా ఉంటుంది. వాళ్లకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం కూడా అరుదే. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 60 ఏళ్ల వద్ధురాలికి ఇలా ఎక్టోపిక్‌ మూత్రపిండాలున్నాయి. వాటిలో రాళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి ఉండటంతో పలు ఆస్పత్రులకు తిరిగారు. ఎక్కడా ఈ చికిత్సలో ఉన్న సంక్లిష్టత కారణంగా కేసు తీసుకోలేదు. దాంతో ఆమె కర్నూలు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. అక్కడి కన్సల్టెంట్‌ యూరాలజిస్టు డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ ముందుగా సిటీస్కాన్‌, ఐవిపి (ఇంట్రావీనస్‌ పైలోగ్రామ్‌) పరీక్షలు చేశారు. వీటిలో కుడి మూత్రపిండంలో 17 మిల్లీమీటర్లు, 13 మి.మీ. పరిమాణంలోని రెండు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మూత్రాశయానికి పైన కటిప్రాంతంలో మూత్రపిండాలున్నాయి. ఇవి సాధారణంగా కాకుండా కొంత తిరిగిపోయి ఉన్నాయి. దానిలోకి మూత్రనాళం కూడా చాలా విభిన్నంగా వెళ్లడం లాంటి సమస్యలను గుర్తించారు. దీంతో మూత్రం పూర్తిగా పోకుండా కొంత అందులోనే ఉండిపోవడం, దానివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తినట్లు డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ వివరించారు. అల్ట్రాసౌండ్‌ గైడెడ్‌ మినీ పీసీఎన్‌ఎల్‌ (చిన్న పరిమాణంలోని పరికరాలతో) చేయాలని నిర్ణయించారు. సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పేగులను పక్కకు తోసి, వాటికి గాయం కాకుండా చూసుకుని.. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ సహాయంతో లోపలి పరిస్థితిని గమనిస్తూ అత్యంత చిన్న పరికరాలతో శస్త్రచికిత్స చేశారు. ఈ తరహా చిన్న పరికరాలు కిమ్స్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం చాలా మేలు చేసింది. అదే పెద్ద పరికరం అయితే పెద్ద రంధ్రం చేయాల్సి రావడంతో పాటు గాయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నది ఉంది కాబట్టి ముప్పు అవకాశాలు తక్కువ. ఇలా విజయవంతంగా ఆమెకు శస్త్ర చికిత్స ముగిసింది. ఆపరేషన్‌ తర్వాత మళ్లీ స్కాన్‌ తీయగా.. రాళ్లు మొత్తం పోయినట్లు నిర్ధారణ అయింది. రెండు రోజుల అనంతరం రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు. ఇది చాలా అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స. ఎండోయూరాలజీ స్టోన్‌ మేనేజ్‌మెంట్‌లో నిపుణులైన డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ఉండటం, దానికితోడు ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాల వల్ల ఎలాంటి సమస్య లేకుండా రోగికి ఇబ్బందిని పూర్తిగా తొలగించారు. ఇందుకు సహకరించిన రేడియాలజిస్టు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌కు డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ కతజ్ఞతలు తెలిపారు.