Jan 12,2021 07:47

               రైతుల ఆదాయాల రెట్టింపు లక్ష్యం నెరవేరాలంటే వ్యవసాయ రంగంలో భారీ ప్రైవేటు పెట్టుబడులే దిక్కని, ప్రైవేటు ఇన్వెస్టుమెంట్లు రావాలంటే రైతులు సంప్రదాయ పద్ధతులు మానుకొని కాంట్రాక్టు సేద్యం వైపునకు మళ్లాలని మోడీ సర్కారు పల్లవినందుకుంది. ఆ కోవలోనిదే బిజెపి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఒకటైన కాంట్రాక్టు సాగు చట్టం. వాస్తవానికి మోడీ ప్రభుత్వం తెచ్చిన 'స్వేచ్ఛా మార్కెట్‌' యాక్టుకు అనుబంధమే ఒప్పంద సాగు చట్టం. స్వేచ్ఛా మార్కెట్‌లో స్వేచ్ఛ కార్పొరేట్లకుమల్లేనే ఒప్పంద సాగు చట్టంలో రక్షణలు కార్పొరేట్లకే తప్ప రైతులకు కాదన్నది స్పష్టం. చట్టాలపై రైతుల నుంచి ఆందోళనలు పెల్లుబుకుతుండగా, కొంత మంది కార్పొరేట్‌, బిజెపి అనుకూల మేధావులు ఒక్క ఉదుటున తెరమీదికొచ్చి, ఒప్పందసాగు కొత్తది కాదని, ఇప్పటికే అమల్లో ఉందని, రైతులు తెగ లాభపడిపోతున్నారని చిలక పలుకులు పలుకుతున్నారు. సదరు అమాంబాపతు 'నిపుణులు' చెపుతున్నది నిజమే అయితే ఉనికిలో ఉన్న పాత పద్ధతి కోసం ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు కొత్త చట్టం తెచ్చినట్టు?
సరళీకరణ విధానాలొచ్చాక వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేయనారంభించాయి. ప్రభుత్వాల నియంత్రణల కింద కాంట్రాక్టు సాగు పురుడు పోసుకుంది. విత్తనోత్పత్తి, కొన్ని వాణిజ్య, హార్టికల్చర్‌ పంటల్లో, అదీ పరిమితంగా అగ్రిమెంట్‌ సాగు ఉంది. ఇప్పుడు కేంద్రం ఆహార పంటలనూ వదిలిపెట్టలేదు. ఏ కంపెనీ అయినా రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోవచ్చంటోంది. విత్తనోత్పత్తిలో మోన్‌శాంటో వంటి బహుళజాతి సంస్థలు ఏ రకంగా రైతులను మోసగిస్తున్నాయో, అనుమతుల్లేని బి.టి విత్తనాలను రైతుల పొలాల్లో యథేచ్ఛగా పండిస్తున్నాయో చూస్తున్నాం. పయనీర్‌, సింజెంటా, బేయర్‌, కార్గిల్‌, వంటి కార్పొరేట్లు గ్రామాల్లో పటిష్టమైన నెట్‌వర్క్‌తో రైతులను లోబరుచుకుంటున్నాయి. అగ్రిమెంట్లపై రైతులు సంతకాలు పెట్టడానికే పరిమితం. కండిషన్లు ఏకపక్షం. ఏమైనా తేడా వస్తే నెపం రైతులపై నెట్టి పరిహారం ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇలాంటి ఉదంతాలెన్నో మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
కాంట్రాక్టు సాగు అనేది కార్పొరేట్‌ కంపెనీల గొలుసుకట్టు వ్యాపారం. జాతీయంగా, అంతర్జాతీయంగా గాలివాటంగా లాభాలొచ్చే గిరాకీ పంటల కోసం రైతులను ముగ్గులోకి లాగుతాయి. కంపెనీలిచ్చే విత్తనాలే రైతులు వేయాలి. వాటి ఎరువులు, పురుగుమందులే వాడాలి. అవి చెప్పిన సంస్థల వద్దనే అప్పులు చేయాలి. యంత్రాలు, పంటల సేకరణ, ప్యాకింగ్‌, రవాణా, ఎగుమతి, హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌ అన్నింటిపైనా కంపెనీలదే గుత్తాధిపత్యం. కంపెనీల చేతుల్లో సమస్త వ్యవస్థలూ చిక్కితే ఇటు రైతులకు ధరల దిగ్గోత అటు వినియోగదారులకు రేట్ల మోత అనివార్యం. ఆహార పంటల్లో 'కాంట్రాక్టు' చొరబడితే ప్రజల ఆహార భద్రతకు ముప్పు తప్పదు. ప్రభుత్వ నియంత్రణలున్నప్పుడే చక్కెర, ఆయిల్‌ఫాం, సిగరేట్‌ ఫ్యాక్టరీలు రైతులను ఏ విధంగా దగా చేస్తున్నాయో, సుబాబుల్‌ రైతులను ఐటిసి వంటి సంస్థలు ఏ రీతిలో అవస్తలకు గురి చేస్తున్నాయో అనుభవమే. మామిడి, టమాటా రైతులను పెప్సీ, బంగాళదుంప రైతులను లేస్‌ కంపెనీ ఎలా కాల్చుకు తింటున్నాయో తెలిసిందే. రైతుల హక్కుల హననం ఎప్పుడో 'కుప్పం' ప్రాజెక్టుతోనే ఎరుక. పర్యావరణ సమస్యపై ప్రపంచం యవత్తూ చర్చిస్తూ.. పంటల్లో జీవ వైవిధ్యం పాటించాలని వక్కాణిస్తుండగా, కంపెనీలు తమ లాభాల కోసం పంట పొలాలను నిర్వీర్యం చేయడం క్షమించరానిది. ప్రపంచబ్యాంక్‌ ఒప్పందాల్లో లిఫ్టుల కింద వరి వేయొద్దన్న షరతు ఎప్పటిదో. కంపెనీ సేద్యం కోసమే ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌, సేంద్రీయ, జీరో బేస్డ్‌ కాన్సెప్టులు పుట్టుకొచ్చాయి. చిన్న సన్నకారు రైతులు అధికంగా కలిగిన దేశానికి కావాల్సింది కార్పొరేట్ల కనుసన్నల్లో కాంట్రాక్టు సేద్యం కాదు. రైతుల సమిష్టి బాధ్యత కలిగిన సహకార సేద్యం. కేరళలో వామపక్ష ప్రభుత్వం కో-ఆపరేటివ్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఆ తరహా ప్రత్యామ్నాయమే దేశానికి, వ్యవసాయానికి, రైతుకు రక్ష.