ప్రజాశక్తి-విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కృష్ణలంకలో సిపిఎం ఆధ్వర్యంలో సభ, ఈ సందర్భంగా స్థానికులు సిపిఎంలో చేరారు. విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం విధానాలు నచ్చి స్థానికులు 35 మంది సిపిఎంలో చేరడం జరిగింది. సభకు ముఖ్య అతిధిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోపిడి చేసి కార్పోరేట్ల కోసం ప్రభుత్వాన్ని నడుపుతుందన్నారు. కార్పోరేట్ల వద్ద నుండి కంటే సామాన్య ప్రజానీకం వద్ద నుండే అధిక పన్నులు వసూళ్ళు చేస్తున్నారన్నారు. 13లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం నుండి పన్నులు వసూళ్ళు చేస్తే కార్పోరేట్ల వద్ద నుండి మాత్రం 9లక్షల కోట్ల రూపాయలను మాత్రమే వసూళ్ళు చేసారన్నారు. మరోపక్క 61వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా ఘడిరచారన్నారు. ప్రజల సొమ్మును, ఆస్థిని అప్పనంగా అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్లకు అప్పచెబుతున్నారన్నారు. అధికారంలోని వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదు. ప్రత్యేకహోదా, విభజన హామీలు గురించి మాట్లాడటం లేదన్నారు. ఢీల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన మోడీ ఇప్పుడు ఉన్న రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. ఒకపక్క సామాన్యుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చాల్సిన ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోకపోగా కార్మికులు, రైతులు, కూలీలపై అధిక ధరల భారాలు వేసి నడ్డి విరుస్తున్నది. కేంద్రం రాష్ట్రానికి ఇంతగా ద్రోహం చేస్తుంటే ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. కేంద్రంపై పల్లెత్తి మాట్లాడే ఆలోచన కూడా వైసిపి, టిడిపి, జనసేన చేయడం లేదన్నారు. మరోపక్క బిజెపి తాన అంటే తందాన అన్నట్లు ఇంటిపన్ను పెంచడం, చెత్తపన్ను వేయడం, విద్యుత్ చార్జీలు పెంచడం ఇలా అనేక భారాలను మోపుతున్నారు. కమ్యూనిస్టుల హయాంలో కేరళలో పన్నులు లేని పాలనను అందిస్తున్నాము. దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన కమ్యూనిస్టులుగా కేరళలో చేసాము. గతంలో విజయవాడ కార్పోరేషన్‌లో పన్నులు పెంచకుండా 10సంవత్సరాలు పనిచేసాము. అప్పటి హయాంలో చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇప్పటికీ నగర అభివృద్ధి పాలకపక్షం పనిచేయడం లేదన్నారు. కమ్యూనిస్టుల విధానాలు నచ్చి సిపిఎం చేరుతున్న ఈ 35మందికి అభినందనలు తెలియచేసారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో కానీ, కృష్ణలంకలో కానీ కమ్యూనిస్టుల హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రోడ్లు లేక మురుగు నీటితో మునిగిపోయి ఉండే కృష్ణలంకను సిమెంట్ రోడ్డులు వేసి అభివృద్ధి చేసింది కమ్యూనిస్టులే అని గుర్తుచేసారు. కరకట్ట రిటైనింగ్‌వాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మంచినీరు ఇలా ఏ సమస్య వచ్చిన ఎర్రజెండా అండగా నిలిచిందన్నారు. అవినీతి, దోపిడి రాజకీయాలు ఒకపక్క నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన రాజకీయాలుగా కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం ఒకపక్కన ఉన్నాయన్నారు. ఈరోజు సిపిఎం విధానాలు నచ్చి డివిజన్‌లో ఉన్న దాదాపు 35 మంది వారి కుటుంబాలతో సహా సిపిఎంతో కలిసి నడిచేందుకు సిపిఎం పోరాటాలలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చారన్నారు. విజయవాడలో ఏ సమస్య వచ్చినా ఎర్రజెండా పోరాడుతుందన్నారు. ప్రజల పక్షాన నిలిచేటువంటి పార్టీకి ప్రజల మద్దుతు ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మురళి, కసర లక్ష్మణ, శాంతారావు, మర్రి ఏడుకొండలు, ముడుసు వెంకటరత్నం, బుర్రె శ్రీను, ఆడేపు నాగరాజు, వేల్పూరి రాజేంద్ర, తాడిశెట్టి నాగేంద్రబాబు, వేల్పూరి దుర్గారావు, వేల్పూరి గోపి, తాడిశెట్టి ఫణీంద్రబాబు, వేల్పూరి రాజేష్, కట్టా లింగయ్య, కొరివి మహేష్, పులి చక్రి, కొరివి రాకేష్, సంగం చంటి, ఊరుగుండ్ల శేఖర్, పులకరం నరసింహారావు, పురకరం శేఖర్, పులకరం సాయి, కట్టా సాయి, గడే శివశంకర్, పులకరం కిషోర్, వేమన శామ్యూల్, వేమన విజ్జి, దార్ల నాగార్జున, ఈ.రవి, బి.హర్ష, కగ్గా శ్రీను, తిప్పాని మల్లీశ్వరరావు, మదగాని దుర్గారావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి బోజడ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పుప్పాల కృష్ణ, బత్తుల చిన్నారావు నగర కమిటీ సభ్యులు కోరాడ రమణ, తమ్మిన చంద్రశేఖర్ మరియు నాయకులు కె.శివాజీ, వి.గోపి, కుమార్, లక్ష్మణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










