దేశంలో రైతాంగం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వీరోచితంగా పోరాడుతున్నారు. భోరున కురిసే వానలను గాని, ఎముకలు కొరికే చలిని గాని లెక్క చెయ్యకుండా వారు శాంతియుతంగా దేశ రాజధాని ముట్టడిని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా 1525లో జర్మనీలో జరిగిన రైతాంగ యుద్ధం పైన, ఆ యుద్ధానికి సారథ్యం వహించిన గొప్ప నాయకుడు థామస్ మ్యుంజెర్ పైన ఎంగెల్స్ చేపట్టిన అధ్యయనాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం ఎంతైనా అవసరం.
'కార్మిక-కర్షక మైత్రి' అనే భావనను ముందుకు తెచ్చినవాడు లెనిన్ అని, దానిని ఆ తర్వాత మావో, ఇతర మూడవ ప్రపంచ దేశాల కమ్యూనిస్టు విప్లవకారులు ఆచరణలో అమలు చేశారని చాలామంది అభిప్రాయపడుతూంటారు. సోషలిజం వైపుగా సమాజం పరివర్తన చెందే క్రమంలో శ్రామిక వర్గానికి మిత్రుడిగా రైతాంగం పోషించగలిగిన పాత్ర గురించి మార్క్స్‌కు గాని ఎంగెల్స్‌కు గాని పెద్దగా నమ్మకం లేదని కూడా వారు అనుకుంటూ వుంటారు. ఎక్కడో మార్క్స్ చెప్పిన మాటల్ని ఆ సందర్భంతో నిమిత్తం లేకుండా ఉటంకించడం కూడా ఇటువంటి అభిప్రాయం కలగడానికి దోహదపడింది.
ఈ విషయంలో అనార్కిస్టులు (అరాచకవాదులు) ప్రత్యేకించి మార్క్సిజంపై విరుచుకు పడుతూంటారు. జర్మన్ కమ్యూనిస్టులు రైతాంగాన్ని అభివృద్ధి నిరోధకులుగా పరిగణిస్తారంటూ బకునిన్ విమర్శించాడు. ''మార్క్సిస్టులు ఇంకోవిధంగా ఆలోచించలేరన్నది వాస్తవం. వాళ్ళు ఏ మూల్యమైనా చెల్లించి రాజ్యాధికారాన్ని పొందాలనుకుంటారు. అందుకే నిజమైన ప్రజా విప్లవాలను, మరీ ముఖ్యంగా రైతాంగ విప్లవాలను తెగనాడతారు. ఆ విప్లవం స్వభావరీత్యానే అరాచకమైనది. అంతేగాక అది మొత్తంగా రాజ్యాంగ యంత్రాన్నే అంతమొందిస్తుంది.''
మార్క్స్, ఎంగెల్స్ గురించిన ఈ విధమైన అభిప్రాయం పూర్తిగా తప్పు. 16వ శతాబ్దంలో జరిగిన జర్మన్ రైతాంగ తిరుగుబాటును ''పైకి చూడటానికి విప్లవకరంగా కనిపించినప్పటికీ'' ''సారాంశంలోగాని, సూత్రప్రాయంగా గాని అభివృద్ధి నిరోధకం'' అని అభివర్ణించినవాడు ఫెర్డినాండ్ లాసల్లె. అతనొక జర్మన్ కార్మికవర్గ నాయకుడు. ఇతని అభిప్రాయాన్నే మార్క్స్, ఎంగెల్స్ అభిప్రాయాలుగా భావించి పొరబడుతుంటారు. ''వేతనాల ఉక్కు చట్రం'' అని లాసల్లె ఇంకొక సూత్రం ప్రతిపాదించాడు (దాని ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల వేతనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు భౌతికంగా జీవించి వుండడానికి సరిపోయే ఒక కనీస దశను దాటి పెరగవు). దీని విషయంలో కూడా ఇదే విధంగా పొరబడుతూంటారు. జర్మనీలో విల్హెమ్ లీబ్‌నెక్ట్ వంటి వామపక్ష నేతలతో సహా పలువురిలో రైతాంగం అంటే అభివృద్ధి నిరోధక సమూహం అనే పొరపాటు భావన ఉండేది. వారితో కార్మిక వర్గానికి ఎటువంటి మైత్రీ కుదరదని వారు భావించేవారు. ఈ భావనను పోగొట్టడానికే, ఎంగెల్స్ 16వ శతాబ్దంలో జరిగిన జర్మన్ రైతాంగ పోరాటాన్ని అధ్యయనం చేశాడు.
ఆ సందర్భంగా ఎంగెల్స్ జర్మనీలో విప్లవం విజయవంతం కావడానికి కార్మిక-కర్షక మైత్రి చాలా అవసరమని నొక్కి చెప్పాడు. ఎక్కడికక్కడ స్థానికంగా జరిగే ఘటనల మాదిరిగా 1525 జర్మనీ రైతాంగ తిరుగుబాటు ఉండినదని, మొత్తంగా జాతీయ స్థాయిలో ఎటువంటి సమన్వయమూ లేకుండా పోయిందని ఎంగెల్స్ గమనించాడు (ఆ కాలంలో జర్మనీ ఒక ఏకైక దేశంగా లేదు. అంతేగాక పట్టణాలలో ఉండే సామాన్య పౌరులతోగాని, కనీసం స్థానికంగా ఉండే సామాన్యులతోగాని రైతులు ఎటువంటి పొత్తునూ ఏర్పరచుకోలేకపోయారని ఆయన గుర్తించాడు (సామాన్య పౌరులు అంటే ఆ తర్వాత కాలంలో కార్మికులుగా రూపాంతరం చెందినవారు). థామస్ మ్యుంజెర్ నాయకత్వంలో తురింగియా ప్రాంతంలో రైతులు బలమైన ప్రతిఘటనను ఇవ్వగలిగారంటే అందుకు కారణం ఆ ప్రాంతానికి పరిమితంగా స్థానిక సామాన్య పౌరులతో సంఘటన ఏర్పడడమేనని ఎంగెల్స్ వివరించాడు.
1848లో యూరప్‌లో విప్లవం విఫలమైన అనంతరం ఆ ఓటమి నేపథ్యంలో 1850లో ఎంగెల్స్ ''జర్మనీలో రైతాంగ యుద్ధం'' అన్న గ్రంథాన్ని రచించాడు. ఆ పుస్తకాన్ని 1870లో తిరిగి కొత్తగా ముద్రించినపుడు దానికి ముందుమాట రాసిన ఎంగెల్స్ అందులో 1525 పోరాటానికి, 1848 విప్లవానికి మధ్య ఉన్న సామ్యాన్ని గురించి పేర్కొన్నాడు. అంతేగాక, కార్మిక-కర్షక ఐక్యత ఆవశ్యకతను గురించి తన వాదనను వివరించాడు.
తక్కిన యూరప్ అంతటా అప్పటికే పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెంది, తనతోబాటు కార్మికవర్గం కూడా అభివృద్ధి చెందివుండగా జర్మనీలో మాత్రం పెట్టుబడిదారీ వర్గం ఆలస్యంగా రంగం మీదికొచ్చిందని ఎంగెల్స్ ఆ ఉపోద్ఘాతంలో గుర్తు చేశాడు. తక్కిన దేశాల్లో కార్మికవర్గ అభివృద్ధి ఎక్కువ స్థాయిలో జరగడంతో బూర్జువా వర్గం తన అభివృద్ధికరమైన స్వభావాన్ని విడనాడి, తన రాజకీయ ప్రాబల్యాన్ని మరింత బలపరుచుకోడానికి తక్కిన మితవాద, కార్మిక వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం మొదలెట్టింది. ఫ్రాన్సులో లూయీ బోనాపార్టీ (రాచరిక వర్గం)తో సైతం రాజీపడి అతడి పాలనను ఆమోదించడం ఇందుకు ఒక ఉదాహరణ. అదే జర్మనీలోనైతే బూర్జువావర్గం అప్పటికింకా రాజకీయ అధికారం దిశగా అసలు ఏ ముందడుగూ వేయనేలేదు. అందుచేత ముందు నుంచే జర్మన్ బూర్జువా వర్గం అక్కడి ఫ్యూడల్ ప్రభువులతో రాజీపడింది. బూర్జువా ప్రైవేటు ఆస్తినే గాకుండా ఫ్యూడల్ ప్రైవేటు ఆస్తిని కూడా కాపాడుకునేందుకు ఒక ఐక్య సంఘటనను కట్టింది.
ఈ క్రమంలో అనివార్యంగా బూర్జువా వర్గం రైతాంగానికి ద్రోహం చేసింది. ఇక రైతాంగం ప్రయోజనాలు నెరవేరాలంటే కార్మిక వర్గంతో చేయి కలిపి సంఘటనను నిర్మించి తద్వారా కార్మిక ప్రభుత్వాన్ని ఏర్పరచడమొక్కటే మార్గం. కార్మికులు, రైతులు కలిస్తే వారి సంఖ్యా బలం రీత్యా రాజకీయాధికారం సాధించడం సాధ్యమే. అందుచేత ఈ బూర్జువా-భూస్వామ్య కూటమిని ఎదుర్కోవాలంటే కార్మిక-కర్షక ఐక్య సంఘటన నిర్మించడం అత్యవసరం.
19వ శతాబ్దపు చివరి సంవత్సరాలలో జర్మనీలో జనాభాలో ఏయే తరగతులు కార్మికులతో సంఘటనలో కలిసివచ్చే వీలుందో ఎంగెల్స్ పేర్కొన్నాడు. పట్టణాల్లోని పెటీ బూర్జువా వర్గమూ, అర్ధ శ్రామికులూ, గ్రామాల్లోని చిన్న రైతులూ, రైతు కూలీలూ కలిసివస్తారని ఎంగెల్స్ అన్నాడు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు మాత్రమే కలిసివస్తారని ఎంగెల్స్ అన్నాడు. ఆయన వాదన ఈ విధంగా ఉంది -
''చిన్న రైతులు అందరూ ఒకే స్వభావం కలిగివున్నవారు కాదు. వారిలో కొందరు భూ యజమానులకు, ప్రభువులకు కట్టుబడి వున్నారు. బూర్జువా వర్గం వారిని ఆ వెట్టిచాకిరీ నుండి విముక్తి చేయవలసిన తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైంది. కనుక ఆ రైతుల విముక్తి జరగాలంటే అందుకు తోడ్పాటును ఇక కార్మిక వర్గం నుండి మాత్రమే వారు ఆశించగలరని వారిని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాబోదు. మరికొందరు కౌలురైతులుగా ఉన్నారు. వీరు చెల్లించవలసిన కౌలు రేట్లు ఎంత ఎక్కువగా వున్నాయంటే పంటలు బాగా పండిన సందర్భాలలో సైతం వారు తమ కుటుంబాలను పోషించుకోవడం గగనమౌతోంది. ఇక పంటలు గనుక దెబ్బ తింటే వారింక ఆకలితో మాడాల్సిందే. తన కౌలు చెల్లించలేని పరిస్థితుల్లో వారు పూర్తిగా భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. బూర్జువా వర్గం తనపై తీవ్రమైన ఒత్తిళ్లు వుంటే తప్ప రైతుల ఇక్కట్లను పట్టించుకోదు. మరి ఆ కౌలురైతులు తమకు ఊరట కలగాలంటే కార్మికుల వైపు గాక ఇంకెటువైపు చూస్తారు?
''ఇక చిన్నపాటి స్వంత కమతాలున్న రైతులున్నారు. అయితే వాటిపై ఎంతేసి అప్పులున్నాయంటే వారు వడ్డీ వ్యాపారుల దయపై ఆధారపడాల్సిందే. వారు చేసిన శ్రమకు కనీసం కూలి కూడా గిట్టడం లేదు. పైగా పంటలు ఒక ఏడాది బాగా పండితే మరో ఏడు దెబ్బ తినడం పరిపాటిగా వున్న స్థితిలో ఆ కూలికి కూడా గ్యారంటీ లేదు. వీరు బూర్జువా వర్గం నుండి ఎటువంటి తోడ్పాటునూ ఆశించలేరు. ఎందుకంటే ఆ బూర్జువా వర్గమే వారి వంట్లో రక్తాన్నంతా పీల్చేస్తోంది. అయినా ఆ రైతులు తమ భూములనే అంటిపెట్టుకుని వుంటున్నారు. వాస్తవానికి ఆ భూములన్నీ అప్పులిచ్చినవారికే చెందుతాయి. ఒక నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడి, వారి అప్పులన్నింటినీ ఆ ప్రభుత్వమే తీర్చే విధానం చేపట్టినపుడు మాత్రమే ఆ భూములు నిజంగా వారి స్వంతం అవుతాయని వారికి అర్ధమయ్యేలా వివరించాలి. ఆ పని కార్మికవర్గం మాత్రమే చేయగలుగుతుంది.''
''మధ్య తరగతి, ధనిక భూ యజమానులున్న చోట్ల ఆ భూములపై పని చేసే కూలీలు అధిక సంఖ్యాక వర్గంగా వుంటారు. ఉత్తర, తూర్పు జర్మనీ ప్రాంతం అంతటా ఇదే పరిస్థితి. పట్టణాల్లోని కార్మిక వర్గానికి అధిక సంఖ్యలో తమ సహజమైన మిత్రులు ఇక్కడే దొరుకుతారు. పెట్టుబడిదారులకు కార్మికుల పట్ల వ్యతిరేకత ఉన్నట్టే ఈ పెద్ద భూకమతాల యజమానులకు కూడా తమ భూములపై పని చేసే కూలీల పట్ల వ్యతిరేకత వుంటుంది. కార్మిక వర్గానికి తోడ్పడే చర్యలు వ్యవసాయ కూలీలకు కూడా తోడ్పడతాయి. బూర్జువా వర్గపు పెట్టుబడిగా వుండే ముడిసరుకులు, యంత్రాలు, పరికరాలు వంటి ఉత్పత్తికి అవసరమైన వాటిని సామాజిక ఆస్తిగా, ఉమ్మడి ఆస్తిగా మార్చినప్పుడే కార్మికులు స్వేచ్ఛను పొందగలుగుతారు. అదే విధంగా వ్యవసాయ కూలీలు కూడా తమ శ్రమను ప్రధానంగా వెచ్చించే ఆ భూములను ధనిక రైతుల నుండి, భూస్వాముల నుండి స్వాధీన పరుచుకుని సామాజిక ఆస్తిగా మార్చి ఉమ్మడి ప్రాతిపదికన ఒక సంఘంగా ఏర్పడిన కూలీలతో సాగు చేసినప్పుడే తమ దయనీయమైన దారిద్య్రం నుండి విముక్తి పొందగలుగుతారు.''
ఇక్కడ ఎంగెల్స్ ఊహించినది రెండు దశలలో వచ్చే విప్లవాన్ని కాదు. ఒకే దశలో వచ్చే సోషలిస్టు విప్లవాన్ని గురించి. అంటే విప్లవం జయప్రదమైన మర్నాటి నుండి అన్ని ప్రయత్నాలూ సోషలిజాన్ని నిర్మించే దిశగానే జరుగుతాయి. అందులో మధ్యంతరంగా పెట్టుబడిదారీ పద్ధతులలో అభివృద్ధి చేయడమనేది లేదు. అందుకే కార్మికవర్గ మిత్రుల జాబితాలో మధ్యతరగతి రైతులను తొలగించాడు. భూస్వామ్య వ్యవస్థను కూలదోశాక భూ పంపకం చేయమని చెప్పకుండా భూమిని జాతీయం చేయాలని చెప్పాడు.
కార్మిక-కర్షక సంఘటన నిర్మాణం, దాని ఎజెండా ఏవిధంగా వుండాలనేది ఆయా దేశాలకు, అక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది. పైగా, ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగ సమస్య అనేది కేవలం భూస్వామ్య దోపిడీ నుండి విముక్తిని మాత్రమే గాక విదేశీ అగ్రి బిజినెస్ కార్పొరేట్ల నుండి, స్వదేశీ కార్పొరేట్ల నుండి కూడా విముక్తిని సాధించడంతో ముడి పడి వుంది. అయితే మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ చెప్పినట్టు సోషలిజం సాధించాలంటే ఒక సరైన పద్ధతిలో కార్మిక-కర్షక ఐక్య సంఘటన నిర్మించడం తప్పనిసరిగా జరగాలి.
* ప్రభాత్ పట్నాయక్, (స్వేచ్ఛానుసరణ)










