Jul 26,2023 14:28

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అనుచితమని రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ను జంతువులతో పోల్చి అనుచితంగా మాట్లాడడం తగదని, వ్యక్తిగత దూషణలు, వెర్రి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. నవరత్నాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగి వైసీపీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. నవరత్నాలు కూడా సంపూర్ణ స్థాయిలో అమలు చేయలేక ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను దూషించేందుకే వైసీపీలో కొన్ని శాఖలను ఏర్పాటు చేశారని, ఆయా శాఖామాత్యులు అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇకనైనా వ్యక్తిగత దూషణలు, పరనిందలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. వైసీపీ నాయకుల తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నంద్యాల హరి, వీరయ్య ఆచారి, గోపి, హేమంత్, పెంచలయ్య, రాఘవ, వీర మహిళలు జెడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు.