
నీటమునిగిన నారుమళ్లు
జనజీవనం అస్తవ్యస్తం..!
20రోజుల నుంచి వర్షాలు
మత్స్య, చేనేత, కూలీలకు కష్టాలు
మత్స్యకారుడు మృతి
లోతట్టు ప్రాంతాలు జలమయం
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :తుపాన్లు వరుస కడుతున్నాయి. ఇరవై రోజుల నుంచి వర్షాలు జిల్లాను వీడడం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. పంట నష్టంతోపాటు, చేపలు, రొయ్యల గుంటలు కొట్టుకుపోయాయి. ఆదివారం జిల్లా వ్యాపితంగా ఓమోస్తరు భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు నగరంలోని రోడ్లు నీటితో ముగినిపోయాయి. వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి. వాహనదారులు గుంటల్లో పడి గాయాలయ్యాయి. మత్స్యకారులు రెండు వారాల నుంచి వేటకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. చేనేత, వ్యవసాయ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సీజన్‌లో నారేతలు పూర్తిగా నిలిచిపోయాయి. వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందాడు. లోతట్టు ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. నివర్ తుపాన్‌కు ముందే వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బురేవి తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఒక్క తుపాన్‌తో వారం, పదిరోజులు వర్షాలు కురిసేవి. ఇప్పుడు ఏకంగా ఇరవై రోజులైనా ఇంకనూ వర్షాలు పడుతున్నాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ సీజన్‌లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగాల్సి ఉంది. కోవూరు, నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట జిల్లా వ్యాపితంగా నారేతలు జరిగాయి. నివర్ తుపాన్ కారణంగా చిత్తూరు,కడప జిల్లాలోని భారీ వర్షాలు వరదలు కారణంగా పెన్నా, కైవల్య, స్వర్ణముఖి, కాళంగి, పంబలేరు, మామిడికాలువలు ఉదృతంగా ప్రవహించాయి. చెరువులు నూరుశాతం నిండిపోయాయి. ఫలితంగా కలుజులు పారి, చెరువులు తెగి, వరదనీటిలో పంట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం అంచనా ప్రకారం 80 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పుడు లక్ష ఎకరాలు దాటే పరిస్థితి కనిపిస్తోంది. చేపలు, రొయ్యల చెరువులు భారీగా దెబ్బతిన్నాయి. మత్స్యసంపద ఎక్కువ భాగం సముద్రంలోకి చేరింది. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే వరదల్లో వస్తువులు పాడైపోయాయి. టివి, ఫ్రిజ్, గ్యాస్ స్టౌవ్‌లు, ఇలా ఒక్కటేమిటి ఇంట్లో ఉన్న సామానులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పట్లో పేదలు సాధారణ పరిస్థితికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాపితంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. గాంధీబొమ్మ, కలెక్టరేట్, చిన్నబజార్, రామచంద్రారెడ్డి ఆసుపత్రితోపాటు అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. పాదచారులు, వాహనాలు రోడ్లపై నడిచే పరిస్థితి కనిపించ లేదు. ఇరవై రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు నెల్లూరునగరంలో ప్రధాన రహదారులు పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి. సుమారు వెయ్యి కిలో మీటర్లు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు గుంటల్లో పడుతున్నారు. ఆదివారం ఒక్కరోజు జిల్లా వ్యాపితంగా 21.2 మిమి వర్షపాతం నమోదయ్యింది. ఏడాదిపాటు జిల్లా సాధారణ వర్షపాతం 1080 మిమి. ఇప్పటి వరకు పడాల్సింది 904 మిమి. ఆదివారం నాటికి 1243 మిమి వర్షపాతం నమోదయ్యింది. 37.2 మిమి అధిక వర్షపాతం ఇప్పటి వరకు నమోదయ్యింది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే పడితే పరిస్థితి మరింత ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతుంది.
ప్రజల జీవనం దయనీయం..!
వర్షాలు, వరదలు కారణంగా జిల్లాలో ప్రజల జీవన పరిస్థితి దయనీయంగా ఉంది. నివర్, బురేవి తుపాన్లు కారణంగా ఇరవై రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. వ్యవసాయ, చేనేత కార్మికులను పనులు లేకుండా పోయాయి. సుమారు లక్ష మంది వ్యవసాయ కార్మికులు, ఐదు వేల మంది చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాపితంగా లక్ష మంది మత్స్యకారులున్నారు. వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తుపాన్లు కారణంగా అధికారులు ఇరవై రోజుల నుంచి సముద్రంలో వేట నిషేధించారు. బోట్లు, వలలు బయటపెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ సాయం చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సాయమూ అందలేదు. తోటపల్లి గూడూరు మండలం, కోడూరు పంచాయతీకి చెందిన అంకయ్య శనివారం వేటకు వెళ్లి మృతి చెందారు. వర్షాలు కారణంగా జనం బయటకు రాకపోవడంతో వ్యాపారాలు సాగడం లేదు. చిరువ్యాపారుల పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. వర్షాలు ఇంకా ఇలా సాగితే నష్టాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.