ప్రజాశక్తి-తెనాలి : బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం అందించిన రిజర్వేషన్లకు భంగం కలిగించే జీవో 111ను తక్షణమే రద్దుచేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక చినరావూరులోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో ఆన్‌లై న్‌లో ఎదురైన సాంకేతిక సమస్యల పరిష్కారానికి తెచ్చిన జీవో 111 ద్వారా రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు నష్టమన్నారు. ఈ జీవోను సవాలు చేసి రద్దు చేయించామని, గతంలో ఉన్న జీవో 550 ప్రకారమే అడ్మిషన్లు కొనసాగాలని కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టులో తాము ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని, అ రిట్ పెండింగ్‌లో ఉండగా కమిటీ సిఫార్సులంటూ వాటి విధి విధానాలు బయట పెట్టకుండా కొత్త జీవో ద్వారా 2020-21మెడిసిన్ ప్రవేశాలు సరికాద న్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.










