
- రేపు ఉదయం 9 గం!! కౌంట్ డౌన్
- లియో ఆర్బిటల్ కక్షలోకి 36 ఉపగ్రహాలు
- పూర్తి వాణిజ్యా పరమైన ప్రయోగం
ప్రజాశక్తి - సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈనెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు LVM 3- M 3 రాకెట్ ను ప్రయోగించనున్నది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండోవ ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. వన్ వెబ్ ఇండియా-2 మిషన్ ద్వారా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఇప్పటికే ఒకసారి ఇస్రో 36 యూకే ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్ష కక్షలో నిలపడం జరిగింది. ఇప్పుడు రెండవ సారి మరో 36 ఉపగ్రహాలను భూమికి సమీప 450 కిలోమీటర్ల దూరంలో గల లియో ఆర్బిటల్ వృత్తాకారపు కక్షలో ప్రవేశపెట్టబోతుంది. మొత్తం ఈ ఉపగ్రహాల బరువు 5805 కిలోల వరకు ఉంటుంది. ప్రయోగం అనంతరం ఈ రాకెట్ 20 నిమిషాల పాటు అంతరిక్షం వైపు ప్రయాణించిన అనంతరం 36 ఉపగ్రహాలను ఒకదాని తర్వాత ఒకదానిని కక్షలోకి వదలడం జరుగుతుంది. ఎల్ వి ఎం 3- ఎం 3 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. అయితే బరువు 643 టన్నుల వరకు ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ 23 తేదీన ఇదే తరహాలో రాకెట్ ప్రయోగం ద్వారా 36 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో అదే తరహా ఉత్సాహంతో ఇప్పుడు ఈ ప్రయోగ విజయానికి సన్నహాలు సిద్ధం చేస్తుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబందించిన 24 గంటల కౌంట్ డౌన్ ను 25వ తేదీ 9 గంటలకు ఇస్రో ప్రారంభిస్తుంది.