- నాలుగు వేలు దాటిన మరణాలు
- ఆసుపత్రులపైనా బాంబు దాడులు
- ఖాళీ చేయాలంటూ హుకుం
- 16 మందికిపైగా ఐరాస సిబ్బంది మృతి
గాజా : ఇజ్రాయిల్ మారణహోమం కొనసాగుతోంది. దీంతో, పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాలకు చెందిన పసికందుల నుంచి పండు ముదుసలి వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. 4,385మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీ (పిఆర్‌సిఎస్) డైరెక్టర్ మార్వాన్ జిలానీ తెలిపారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, గాజాలో మరణించిన వారి సంఖ్య 4,137కు చేరుకుంది, వీరిలో 70 శాతం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. వెయ్యిమంది గల్లంతయ్యారు. లేదా శిథిలాల కింద చిక్కుకున్నారు.
- ఐరాస సంస్థలే లక్ష్యంగా వైమానిక దాడులు
ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ మానవతా సంస్థలే లక్ష్యంగా నెతన్యాహు ప్రభుత్వం వైమానిక దాడులకు పాల్పడుతోంది. గత 24 గంటల్లో వైమానిక దాడుల్లో ఇద్దరు ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) సిబ్బంది హత్యకు గురయ్యారు. వైమానిక దాడుల్లో 16 మందికిపై ఐరాస సిబ్బంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చునని ఐరాస పేర్కొంది. ఐరాస సంస్థలపై ఇప్పటివరకూ ఇజ్రాయిల్ 33 వైమానిక దాడులకు పాల్పడింది. గాజాలో 14 లక్షల మంది శరణార్థులు ఉన్నారని ఐరాస అంచనా వేసింది. వారిలో ఐదు లక్షల మంది వరకూ ఐరాస ఏర్పాటు చేసిన అత్యవసర శిబిరాల్లో తలదాచుకున్నారు. ఒకవైపు బాంబు దాడులు చేయడంతోపాటు మరోవైపు ఆహారం, ఇంధనం, తాగునీరు గాజాలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. ఆహారం అందకపోవడం, ఆరోగ్య సమస్యల ద్వారా వారు మరణించేలా చేయాలని ఇజ్రాయిల్ ఎత్తుగడలు వేస్తోంది. ''గాజాపై పూర్తి ముట్టడి వరుసగా పదవ రోజు కొనసాగుతోంది. రఫా, కెరెమ్ షాలోమ్, ఎరెజ్ క్రాసింగ్‌లు మూసివేయబడ్డాయి, ఆహారం, నీరు, మందులు మరియు ఇంధనంతో సహా అత్యంత అవసరమైన మానవతా సహాయం యొక్క ప్రవేశాన్ని నిరోధించాయి.'' అని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
- 30 శాతం నివాసాలు ధ్వంసం
గాజాలోని హౌసింగ్ మంత్రిత్వ శాఖ, ఐరాస తెలిపిన వివరాల ప్రకారం, గాజా స్ట్రిప్‌లోని 30 శాతం నివాసాలు గత రెండు వారాల్లో ధ్వంసమయ్యాయి. వేల మంది తమ నివాసాలను కోల్పోయారు. ''బీట్ హనౌన్, బీట్ లాహియా, షుజారు, అబ్బాసన్ కబీరాతో సహా చాలా ప్రాంతాలు నాశనం చేయబడ్డాయి'' అని ఐరాస పేర్కొంది.
- శరణార్థుల శిబిరాలు, ఆసుపత్రులు లక్ష్యంగా బాంబు దాడులు
దాదాపు 400 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న గాజాలోని అత్యంత పురాతనమైన క్రిస్టియన్ చర్చిపై గురువారం ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 18 మంది మరణించగా, మరో 18 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. బాంబు దాడిలో తన కుటుంబ సభ్యులు మరణించారని అమెరికా మాజీ ప్రతినిధి జస్టిన్ అమాష్ శుక్రవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ ఉత్తర గాజాలో వేలాది మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న క్రైస్తవ ఆసుపత్రిపై మంగళవారం బాంబు దాడి జరగడంతో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
గాజా విద్యా మౌలిక సదుపాయాలు క్రమపద్ధతిలో కూల్చివేయబడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న 29 పాఠశాలలతో సహా దాదాపు 200 విద్యాసంస్థలు దెబ్బతిన్నాయి. విద్యుత్, మందులు, పరికరాలు, ప్రత్యేక సిబ్బంది కొరత కారణంగా ఆసుపత్రులు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. 12,000 మందికి సేవలందిస్తున్న అల్-ఖుద్స్ ఆసుపత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధికారులు శుక్రవారం ఆదేశించారు, ఇది కూడా బాంబు దాడులకు లక్ష్యంగా ఉండవచ్చునని ఐరాస భావిస్తోంది. ''తరలింపు సాధ్యం కాదు,'' అని పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి చెందిన నెబల్ ఫర్సాఖ్ అన్నారు. ''ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పిల్లలతో నిండి ఉంది. మేము వారి జీవితాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించలేం' అని చెప్పారు. అల్-ఖుద్స్ ఆసుపత్రిని తరలించాలని ఆదేశించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సెక్రటరీ జనరల్ టెడ్రోస్ అథనామ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ''ఈ రద్దీ ఆసుపత్రులకు రోగులను సురక్షితంగా తరలించడం అసాధ్యం. వారి ప్రాణాలను రక్షించే విధులను నిర్వహించడానికి వారిని అనుమతించాలి. వారికి రక్షణ కల్పించాలి.'' అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. ''ఇజ్రాయెల్ దాడులు గాజాలోని మొత్తం కుటుంబాలను తుడిచిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన హేయమైన యుద్ధ నేరాలకు సాక్ష్యాలు ఉన్నాయి'' అని గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలపై గత వారం ఇచ్చిన ప్రాథమిక నివేదికలో, అమ్నెస్టీ పేర్కొంది.