గాజా : ఇజ్రాయెల్ గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా లక్ష్యంగా దాడులను ప్రారంభించింది. ఆస్పత్రిని హమాస్ కమాండ్ సెంటర్‌గా వినియోగిస్తోందని ఆరోపించింది. ఆస్పత్రిలో వేలాది మంది రోగులతో పాటు నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇజ్రాయిల్ దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హమాస్ గాజాలోని ఆస్పత్రుల కింద సొరంగాలను సైనిక కార్యకలాపాలకు, బందీలను దాచేందుకు వాడుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే గుర్తించామని ఐడిఎఫ్ తెలిపింది. గాజాలోని అల్-షిఫా ఆస్పత్రి నుంచి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. అక్కడ వారు ఆయుధాలను దాచారని పేర్కొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ట్యాంకులు, సైన్యం ఆస్పత్రిలోకి చేరుకొని.. అత్యవసర విభాగంలోకి ప్రవేశించాయి. ఈ ఆస్పత్రిలో దాక్కొన్న హమాస్ దళాలు లొంగిపోవాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆస్పత్రిలో కచ్చితమైన సమాచారంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ పేర్కొంది.
మొదట ఆస్పత్రిలో సైనిక కార్యకలాపాలను 12 గంటలలోపు నిలిపివేస్తామని సంబంధిత గాజా అధికారులకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే సైనిక కార్యకలాపాలను నిలిపివేయలేదని, ఆస్పత్రిలోని హమాస్ కమాండర్‌ను లంగిపోవాల్సిందిగా హెచ్చరించింది. నవజాత శిశువులు సహా రోగులు, సిబ్బంది సుమారు 2,300 మంది ఆస్పత్రిలో చిక్కుకుపోయినట్లు యుఎన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రిలో మంగళవారం నాటికి 36 మంది శిశువులకు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొంది. అల్-షిఫా ఆస్పత్రిపై దాడులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌దే పూర్తి బాధ్యత అని హమాస్ పేర్కొంది.