Oct 19,2023 06:33

గాజాలోని ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ జరిపిన దాడి అత్యంత దుర్మార్గం. ఈ ఘటనలో 500 మందికిపైగా మృత్యువాత పడినట్లు వస్తున్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులు ఉండటం మరింత బాధాకరం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటనకు కొన్ని గంటల ముందు ఇజ్రాయిల్‌ జరిపిన ఈ అమానుష దాడి పాలస్తీనీయుల పట్ల అది ఎంత క్రూరత్వంతో వ్యవహరిస్తోందో తెలియచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో ఆ దాడి తాము చెయ్యలేదని, తమపై దాడి చేయడానికి హమాస్‌ చేసిన ప్రయత్నమే మిస్‌ఫైర్‌ అయిందని ఇజ్రాయిల్‌ నిస్సిగ్గుగా బుకాయిస్తోంది. పాశ్చాత్య మీడియా కూడా దానినే ప్రచారంలో పెడుతోంది. పన్నెండు రోజులుగా సాగుతున్న ఈ పోరులో మొదటి రోజు మినహాయిస్తే విధ్వంసం సృష్టించిందంతా ఇజ్రాయిలే! దాడికి గురైన ఆస్పత్రిలో ఇజ్రాయిల్‌ దాడుల్లో సర్వస్వాన్ని కోల్పోయి శరణార్థులుగా మారిన 3 వేల మందికిపైగా పాలస్తీనీయులు, వారికి అదనంగా సాధారణ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయిల్‌ యుద్ధ నేరానికి పాల్పడింది. దీనికి బాధ్యత వహించకుండా హమాస్‌ మీదకి నెపం నెట్టివేయాలని చూడటం దాని తెంపరి తనాన్ని తెలియచేస్తోంది. ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) చెబుతున్న మాటలను, ట్విట్టర్లో పోస్టు చేసిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవని రష్యా పేర్కొంది. ఇజ్రాయిలే దీనికి పూర్తి బాధ్యత వహించాలని అరబ్‌ దేశాలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి.
మానవాళి పట్ల, ప్రపంచం పట్ల బాధ్యత ఉన్న వారెవ్వరైనా ఈ తరహా హింసాకాండను సమర్ధించరు. కానీ, ఇంత దారుణ హింసాకాండ తరువాత కూడా ఇజ్రాయిల్‌ను బైడెన్‌ వెనకేసుకు రావడంతో అమెరికా దుర్నీతి మరోసారి ప్రపంచానికి వెల్లడైంది. బుధవారం నాడు ఇజ్రాయిల్లో జరిపిన సంఘీభావ పర్యటనలోనూ, ఆ తరువాత చేసిన ట్వీట్లలోనూ బైడెన్‌ అన్ని విధాల ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించారు. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో హమాస్‌ను ఆయన పోల్చారు. దీనిని అదునుగా తీసుకున్న ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు యుద్ధోన్మాదంతో మరింతగా రెచ్చిపోయారు. దాడులు తక్షణం ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇరాన్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయిల్‌ను మరింత రెచ్చగొట్టడమే బైడెన్‌ పర్యటన ఉద్ధేశ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాజాపై భూతల దాడులకు రంగం సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తలు ఈ సందర్భంగా గమనార్హం.
ఆస్పత్రిపై జరిగిన దాడి తరువాత ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం పట్ల ప్రపంచ దేశాలు స్పష్టమైన వైఖరిని తీసుకుంటున్నాయి. తక్షణం దాడులను ఆపి, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆ దేశాలు కోరుతున్నాయి. మరోవైపు గాజాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజానీకానికి మానవతా పూర్వక సాయానికి కూడా ఇజ్రాయిల్‌ షరతులు పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. లెబనాన్‌, జోర్డాన్‌, లిబియా, ట్యునీషియా, టర్కీ, మొరాకో, ఇరాన్‌లలో బుధవారం పెద్దఎత్తున పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. వేలాదిమంది ప్రజానీకం ఈ ప్రదర్శనల్లో భాగస్వాములయ్యారు. జో బైడెన్‌తో ఈజిప్టు, జోర్డాన్‌, పాలస్తీనా అథారిటీ నేతల భేటీ కూడా ఈ కారణంగానే రద్దు అయింది. మరోవైపు ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా ఇప్పటికే పది లక్షల మందికి పైగా అమాయక ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గాజా నుండి సరిహద్దు ప్రాంతానికి తరలివెళ్లారు. ఆ ప్రాంతం మీద కూడా ఇజ్రాయిల్‌ బాంబులు వేయడం మరీ దారుణం. అంతర్జాతీయ ఒప్పందాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను తుంగలో తొక్కి సొంత గడ్డపైనే కాందిశీకులుగా, శరణార్థులుగా పాలస్తీనీయులను మార్చిన పాపిష్టి చరిత్ర ఇజాయ్రిల్‌ది. ఆక్రమించిన భూ భాగాలను ఖాళీ చేసి 1967కి ముందున్న సరిహద్దులతో తూర్పు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. ఆస్పత్రిపై దాడి సంఘటనతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది పెను విపత్తుగా మారకముందే తక్షణం యుద్ధం ఆపేలా ఇజ్రాయిల్‌పై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలి. భారత ప్రభుత్వం కూడా గుడ్డిగా అమెరికాను అనుసరించడం కాకుండా తన వైఖరిని సమీక్షించుకోవాలి. అమెరికా, ఇజ్రాయిల్‌ అనుకూల విధానానికి స్వస్తి పలికి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలి. పాలస్తీనా విమోచనా పోరాటానికి చిరకాలంగా భారత్‌ ఇస్తున్న మద్దతును కొనసాగించాలి.