Jan 22,2023 06:33

'దేశం మనదే తేజం మనదే/ ఎగురుతున్న జెండా మనదే/...అందాల బంధం ఉంది ఈ నేలలో/ ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో/ ఏ కులమైనా ఏ మతమైనా/ భరతమాతకొకటేలేరా' అంటూ ఈ నేలతోను, ఈ గాలితోను మమేకమైన ప్రజల ఆత్మీయ బంధాన్ని, దేశభక్తిని నెమరువేసుకుంటాడు కులశేఖర్‌. ఆసేతు హిమాచలం ఎందరో త్యాగమూర్తుల రక్తతర్పణతో పులకించిన నేల ఇది. ఎందరో పోరాట యోధుల పద స్పర్శతో పదునెక్కిన భూమి ఇది. 'భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు' అన్న ఐక్యతా నినాదం...ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయులు పలికే జాతీయభావం దేశ నలుమూలలా పత్రిధ్వనిస్తూనే వుంది. భిన్న కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల మధ్యనున్న ఐక్యతాభావాన్ని చెడగొట్టి హిందుత్వమే ఈ దేశంలో మిగలాలని...ఒకే మతం, ఒకే జాతి అంటూ తంపులు పెట్టే గుంపులు నిస్సిగ్గుగా దేశభక్తి ముసుగు ధరించి, ప్రజల మధ్యనే తిరుగుతున్నాయి. హిందుత్వ అంటే జాతీయత అనే భావనను చొప్పించే యత్నం తీవ్రంగా జరుగుతోంది. 'ప్రతివాడూ తన నిజస్వరూపం ఎవరో వొకరి ముందు బయట పెడతాడు' అంటాడు బుచ్చిబాబు.
నిజానికి మన ప్రజల్లో దేశభక్తి భావన చాలా బలంగా నాటుకొని వుంది. ఎందరో పోరాట వీరుల త్యాగాల ఫలితం మన స్వాతంత్య్రం. జాతీయోద్యమంలో అన్ని మతాలకు, కులాలకు చెందిన వారు భాగస్వాములయ్యారు. ప్రజల్లో దేశభక్తి భావన నాటుకొని వుంది కనుకనే కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ చిన్నా పెద్దా బేధం లేకుండా పోరాటంలో ముందుపీఠిన నిలిచారు. మహిళలు బయటకు రావాలంటే సవాలక్ష అడ్డంకులున్న కాలంలోనే కొంగు నడుముకు బిగించి కదనరంగంలో కాలుమోపారు. ఏ దశలోనూ కుల మతాల ప్రస్తావనే లేదు... స్వాతంత్య్ర కాంక్ష తప్ప. నిజాం సంస్థానాధీశునికి వ్యతిరేకంగా హిందూ, ముస్లిం రైతులు కలిసి పోరాడితే, జమ్ము-కాశ్మీర్‌లో హిందూ మహారాజుకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు కలిసి పోరాడారు. ఇక్కడ రాజు ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా ప్రజలందరూ కలిసే పోరాటం చేశారు. అలాంటిది... ఇప్పుడు పలానావాళ్లు దేశభక్తులు..పలానావాళ్లు దేశభక్తులు కాదు అని ముద్రలు వేస్తున్నారు. స్వాతంత్య్రోద్యమంలో సైనికులు కూడా మేము సైతం అంటూ... కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, ముస్లిం లీగ్‌ జెండాలు కట్టుకుని బ్రిటిష్‌ వారికి వ్యతిరేక తిరుగుబాటు చేశారు. అలాగే దేశ విముక్తి కోసం నాటి పంథా సరైందికాదన్న భావనతో స్వయంగా తానే అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి... 'నేను సైతం/ ప్రపంచాబ్జపు/ తెల్లరేకై పల్లవిస్తాను!/ నేను సైతం/ విశ్వవీణకు/ తంత్రినై మూర్ఛనలు పోతాను!/ నేను సైతం/ భువన భవనపు/ బావుటానై పైకి లేస్తాను!' అంటూ కదనరంగంలోకి దూసుకొచ్చిన అగ్నికణం సుభాష్‌ చంద్రబోస్‌. 'స్వేచ్ఛ ఎవ్వరి నుండి ఇవ్వబడదు... మనకు మనమే తీసుకోవాలి' అంటూ తన పంథాలో తాను పోరాటం చేశాడు.
జాతీయోద్యమంలో రకరకాల పాయలుగా దేశ విముక్తి కోసం పోరాటం చేశారు. కానీ అసలు ఆ జాతీయోద్యమంతోనే సంబంధం లేనివారు ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడడం విడ్డూరం. చప్పట్లు కొట్టాలని, లైట్లు ఆర్పాలని, క్యాండిల్స్‌ వెలిగించాలని, జాతీయ జెండాను వాట్సప్‌ డి.పి గా పెట్టుకోవాలని...ఇదే దేశభక్తి అని ఆర్భాటం చేస్తున్నారు. అసలైన దేశభక్తులు... మేము దేశభక్తులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడుతున్నారు. నాడు ప్రత్యక్షంగా దోపిడీ చేసిన సామ్రాజ్యవాదం... నేడు పరోక్షంగా దోపిడీ చేస్తోంది. దానికి వ్యతిరేకంగా నిలబడి, కార్పొరేట్ల దోపిడీని, సామ్రాజ్యవాద సంస్కృతిని ప్రతిఘటించడం ఇవాళ నిజమైన దేశభక్తి. దేశం కోసం ఏమైనా చేయాలనే భావం ప్రజల్లో నిబిడీకృతమై వుంది. సాంస్కృతిక ఉద్యమాల ద్వారా దేశభక్తి మళ్లీ పునరుత్తేజం పొందుతుంది. 'దేశం కోసం చావడానికి సాహసం చెయ్యకపోతే, దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది?' అని పిడికిలెత్తిన సుభాష్‌ చంద్రబోస్‌ పుట్టినరోజు జనవరి 23ను 'దేశభక్తి దినోత్సవం'గా పాటిస్తున్నారు. మతాల పేరుతో దేశభక్తిని కొలిచే పద్ధతులకు స్వస్తి చెప్పి, సుభాష్‌ చంద్రబోస్‌ నింపిన స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించడమే నిజమైన దేశభక్తిగా నడుం కట్టాలి.